Nara Lokesh: లోకేశ్ వ్యూహంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ.. దెబ్బ అదుర్స్ కదూ..!

ABN , First Publish Date - 2023-08-19T17:05:17+05:30 IST

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు.

Nara Lokesh: లోకేశ్ వ్యూహంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో వైసీపీ..  దెబ్బ అదుర్స్ కదూ..!

మంగళగిరిలో 20 వేల మంది పేదలకి ఇళ్ల స్థలాల ప్రకటన

అసైన్డ్‌, ఇతర ప్రభుత్వ భూముల్లో ఉంటున్న వారికి క్రమబద్ధీకరణ

2,500 కిలోమీటర్లకు చేరుకున్న పాదయాత్ర.. ఈ సందర్భంగా యువనేత హామీ

గుంటూరు (ఆంధ్రజ్యోతి): మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పేదలకు అమరావతి రాజధానిలో ఇళ్ల స్థలాల ఆశ చూపించి ఓట్లు పొందాలని వైసీపీ వేసిన ఎత్తుకు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌ పైఎత్తు వేశారు. నియోజకవర్గంలోని 20 వేల మంది పేదలకు అధికారంలోకి రాగానే ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తామని శనివారం స్పష్టమైన హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర నేడు 2,500 కిలోమీటర్ల మైలురాయిని ఉండవల్లి సమీపంలో అధిగమించింది. అక్కడే 20 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల హామీ శిలాఫలకాన్ని ఆవిష్కరించి కృష్ణా జిల్లాలోకి యువ నేత అడుగుపెట్టారు. అంతేకాకుండా నియోజకవర్గంలో అసైన్డ్‌, ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పరుచుకొని జీవిస్తోన్న వారందరికి పట్టాలు ఇస్తామని కూడా లోకేశ్ ప్రకటించారు.


వైసీపీ ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గంలోని పేదలకు స్థానికంగానే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకుండా హైకోర్టు, సుప్రీంకోర్టు వివాదంలో ఉన్న అమరావతి రాజధాని ఆర్‌ 5 జోన్‌లో ఇళ్ల స్థలాలను ఇస్తామని ఆశ పెట్టింది. స్థలం విలువ రూ.12 లక్షలకు పైగా ఉంటుందని స్వయాన సీఎం జగన్‌ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కేసు విచారణలో భాగంగా నివేశన స్థలాల పట్టాల వరకు పంపిణీ చేసుకోవచ్చని, అయితే అవి కూడా తుది తీర్పునకు లోబడేనని చెప్పింది. ఆయా పట్టాలపై ఎలాంటి థర్డ్‌ పార్టీ హక్కులు లబ్ధిదారులు కోరడానికి వీల్లేదని కూడా పేర్కొన్నది. అయినప్పటికీ జగన్‌ సర్కారు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడమే కాకుండా లేఅవుట్‌లు వేసేసి ఇళ్ల నిర్మాణాలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రెండు కార్యక్రమాలు నిర్వహించి రూ. వంద కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు చేసింది. అయితే దీనిపై హైకోర్టులో విచారణ జరిగిన అనంతరం ఇళ్ల నిర్మాణాలపై స్టే రావడంతో ఇక తమకు ఇళ్ల స్థలాలు లేనట్లేనన్న భావన లబ్ధిదారుల్లో నెలకొన్నది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం పేదలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో వారికి సమీపంలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అలాంటిది ఎక్కడో 10 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న కృష్ణాయపాలెంలో వైసీపీ ప్రభుత్వం అది కూడా అమరావతి రాజధానిలో ఎలక్ట్రానిక్స్‌ సిటీకి రిజర్వు చేసిన భూములను పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి రాగానే ఆర్‌ 5 జోన్‌ని రద్దు చేస్తామని ఇప్పటికే లోకేశ్‌ స్పష్టం చేశారు. ఎవరైతే మంగళగిరి నియోజకవర్గంలో సొంత ఇల్లు లేకుండా ఉంటున్నారో వారందరికి సమీపంలోనే ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిల్లో ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఆయా భూములపై ఎలాంటి కోర్టు వివాదాలు ఉండవు. అంతేకాకుండా ప్రస్తుత నివాసాలకు సమీపంలోనే ఉండటం వలన ఆయా పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా వైసీపీ ఎత్తుకు లోకేశ్‌ చెక్‌ పెట్టారు.

Updated Date - 2023-08-19T17:07:39+05:30 IST