Government schools : నేల, బండి, గౌరి, పేరు, చీమ, గంట.. చదవాలంటే ఆ పిల్లలకు తంటా

ABN , First Publish Date - 2023-07-27T02:19:02+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువమందికి అక్షరాలను గుర్తించడం రావడం లేదని ‘ఆసర్‌-2022’ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) నివేదిక పేర్కొంది. నేల, బండి, గౌరి, చీమ, అర, పేరు, గంట, ఊడ, సూది, ఒంటె

Government schools : నేల, బండి, గౌరి, పేరు, చీమ, గంట.. చదవాలంటే ఆ పిల్లలకు తంటా

  • 390 గ్రామాల్లో ప్రభుత్వ బడులపై సర్వ్చేక్యాట్‌, మ్యాట్‌, రెడ్‌, సన్‌, బస్‌, ఫ్యాన్‌

  • లాంటి పొట్టి పదాలూ నోరు తిరగవు

  • జగన్‌ మామ చెప్పించే చదువులివే..

  • సెకండ్‌ క్లాస్‌ బుక్‌ ఫిఫ్త్‌ విద్యార్థీ చదవలేడు

  • థర్డ్‌ క్లాస్‌లో 12.6% మందికి అక్షరాలే రావు

  • తీసివేతలకు 8వ తరగతి పిల్లలు తిప్పలు

  • 3 నుంచి 8 వరకు అభ్యసనం అధ్వానం

  • ‘ఆసర్‌-2022’ నివేదిక స్పష్టీకరణ

‘‘ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు ప్రతి రంగంలోనూ ఎదగాలనే లక్ష్యంతో విద్యారంగంలో అనేక మార్పులు తీసుకువస్తున్నాం. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎ్‌సఈ సిలబ్‌సలను తీసుకువచ్చాం. ఇంటర్నేషనల్‌ సిలబ్‌సను (ఐబీ) కూడా త్వరలోనే తీసుకొచ్చేస్తాం. కార్పొరేట్‌’కు మించిన చదువులు చెప్పిస్తాం. పేదపిల్లలు ప్రపంచాన్ని శాసించే రోజు వస్తుంది. ప్రైవేటు విద్యాసంస్థలు సర్కారు బడులతో పోటీ పడక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది’’.. గత నెల 20వ తేదీన ‘జగనన్న ఆణిముత్యాలు’ అవార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్‌ చెప్పిన గొప్పలివి. అయితే ఇదంతా ఉత్తిదే! ప్రభుత్వ బడుల్లో పిల్లల పఠనస్థాయి ఇటీవల మరీ పడిపోయింది. విపక్షాలో, మీడియానో కాకుండా.. కేంద్రం వెలువరించే ‘ఆసర్‌-2022’ నివేదికే ఈ సంగతి తేల్చేసింది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల్లో ఎక్కువమందికి అక్షరాలను గుర్తించడం రావడం లేదని ‘ఆసర్‌-2022’ (యాన్యువల్‌ స్టేటస్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రిపోర్టు) నివేదిక పేర్కొంది. నేల, బండి, గౌరి, చీమ, అర, పేరు, గంట, ఊడ, సూది, ఒంటె వంటి రెండక్షరాల పదాలు చదవడం కూడా రావడం లేదని.. ఇంగ్లి్‌షలో క్యాట్‌, మ్యాట్‌, బస్‌, ఫ్యాన్‌ వంటి పదాలను కూడా పలకలేకపోతున్నారని తెలిపింది. ‘నాణ్యమైన విద్యకు ప్రాధాన్యతను ఇస్తున్నాం. ప్రభుత్వ బడులను కార్పొరేట్‌ పాఠశాలల స్థాయికి మించి అభివృద్ధి చేస్తున్నామ’ని చెబుతున్న జగన్‌ పాలనలో ప్రభుత్వ బడుల వాస్తవ చిత్రాన్నీ, భావి పౌరుల దుస్థితినీ ఈ నివేదిక పట్టి ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబరు - అక్టోబరు నెలల్లో రాష్ట్రంలోని 390 గ్రామాల్లో ఈ సంస్థ అధ్యయనం జరిపింది. ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యక్షంగా వెళ్లి.. అక్కడ విద్యా ప్రమాణాలు ఎంత దయనీయంగా ఉన్నాయనేది గుర్తించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 63శాతం మందికి పైగా పిల్లలు రెండో తరగతి పాఠాలు (టెక్ట్స్‌బుక్‌) చదవలేకపోతున్నారని తేల్చింది. ప్రాథమిక పఠనం, అంకగణితం, తెలుగు, ఇంగ్లిష్‌ భాషలు చదవడంలో విద్యార్థుల గ్రహణశక్తి అంతంతమాత్రంగా ఉన్నదని స్పష్టం చేసింది. ‘ఆసర్‌-2022’ నివేదికలో ఇంకా ఏమున్నదంటే...

‘బాలబాలికలార రారండి’ పాడలేరు..

‘‘మూడో తరగతి పిల్లల్లో 12.6 శాతం మంది అక్షరాలు చదవలేరు. 24.3 శాతం మంది అక్షరాలు చదవగలరు కానీ పదాలు చదవగలరు. 36.2 శాతం మంది పదాలను చదవగలరు కానీ ఒకటో తరగతి వచన పుస్తకాన్ని చదవలేరు. ఐదో తరగతి విద్యార్థుల్లో 36.3 శాతం మంది మాత్రమే రెండో తరగతి పాఠాలను చదవగలుగుతున్నారు. 70 శాతం మంది చిన్న చిన్న భాగాహారాలు (సింపుల్‌ డివిజన్‌) సైతం చేయలేకపోతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో 33 శాతం మంది కూడా రెండోతరగతి పాఠాలను చదవలేకపోతున్నారు. 48 శాతం కంటే ఎక్కువ మందికి సింపుల్‌ డివిజన్‌ లెక్కలు చేయడం కూడా రావట్లేదు. 2.7 శాతం మందికి అక్షరాలు కూడా రావు. 4.1 శాతం మంది అక్షరాలు చదవగలరు కానీ పదాలు చదవలేరు. 9.2 మంది పదాలను చదవగలరు కానీ ఒకటో తరగతి పుస్తకాన్ని చదవలేకపోతున్నారు. 17.7 శాతం మంది ఒకటో తరగతి పుస్తకాన్ని చదవగలిగినా రెండో తరగతి పుస్తకాన్ని చదవలేరు. ఒకటో తరగతిలోని బాలబాలికలారా రారండి, ఆటలు పాటలు పాడండి, పలకా బలపం తీసుకురారండి, ఆఆ ఇఈ రాయండి వంటి పాఠాలు, రెండో తరగతి పుస్తకంలోని సాధారణ పాఠ్యాంశాలను కూడా చదవలేకపోతున్నారు.’’

చిన్న వాక్యానికీ పెద్ద కసరత్తు..: ‘‘అంకగణితంలో విద్యార్థుల ప్రతిభ అత్తెసరుగా ఉంది. 5 నుంచి 16 సంవత్సరాల వయసు పిల్లలకు సాధారణ తీసివేతలు, భాగాహారాలు చేయడం కూడా రావడం లేదు. ఉదాహరణకు 3వ తరగతి చదువుతున్న పిల్లల్లో 7.2 శాతం మంది 1 నుంచి 9 వరకు అంకెలను కూడా గుర్తించలేకపోతున్నారు. ఇంగ్లి్‌షలోనూ అంతే! 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 18.9 శాతం మంది క్యాట్‌, మ్యాట్‌, రెడ్‌, సన్‌, బస్‌, ఫ్యాన్‌ వంటి పదాలను చదవలేకపోయారు. 69.8 శాతం మంది మాత్రమే వాట్‌ ఈజ్‌ ద టైమ్‌? దిస్‌ ఈజ్‌ ఏ లార్జ్‌ హౌస్‌, ఐ లైక్‌ టు రీడ్‌ వంటి సింపుల్‌ సెంటెన్స్‌ చదవగలిగారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో 35.8 శాతం మంది, 8వ తరగతి విద్యార్థుల్లో 65.5 శాతం మంది మాత్రమే ఇంగ్లి్‌షలో సింపుల్‌ సెంటెన్స్‌లు చదవగలుగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు సరిగా చెప్పడంలేదని దాదాపు 18 శాతం మంది విద్యార్థులు పెయిడ్‌ ట్యూషన్స్‌ పెట్టించుకుని చదువుకుంటున్నారు’’

చేరికలు భళా ... ప్రమాణాలు ఢీలా

‘‘2018తో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ కాస్త పెరిగింది. 2018లో ప్రభుత్వ పాఠశాలల్లో 63.2 శాతం విద్యార్థులు ఉంటే.. 2022 నాటికి 71 శాతానికి ఆ సంఖ్య పెరిగింది. ఇదొక్కటే కాస్త మెరుగైన అంశంగా ‘ఆసర్‌ నివేదిక’ తెలిపింది. అదే సమయంలో 2018లో నిర్వహించిన అధ్యయనంతో పోలిస్తే విద్యార్థుల అభ్యసన స్థాయిలు గణనీయంగా పడిపోయాయని అదే నివేదిక తేల్చింది.


2vij4.jpg

నమ్మండి.. నిజంగా ఇది బడే

ఎన్టీఆర్‌ జిల్లా విస్సన్నపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో 6ఏ, 6బీ తరగతులను రేకుల షెడ్ల కింద నిర్వహిస్తున్నారు. ఎడతెరిపి లేని వానలకు ఆ రేకుల గుండా వర్షపునీరు తరగతి గదుల్లోకి వచ్చి పడుతోంది. బుధవారం నీళ్లొచ్చిన క్లాసు రూంలో బెంచీలపై విద్యార్థులు గొడుగులు పట్టుకొని కూర్చుని పాఠాలు వినాల్సిన పరిస్థితి. ‘నాడు-నేడు’ అని ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం దీనికేం జవాబిస్తుందో!

- విస్సన్నపేట

Updated Date - 2023-07-27T02:19:06+05:30 IST