అంతా ప్రశాంతం

ABN , First Publish Date - 2023-03-14T00:47:12+05:30 IST

తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా పరిధిలో ప్రశాంతంగా ముగిశాయి. ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా, పట్టభద్రుల పోలింగ్‌ మాత్రం మందకొడిగా సాగింది.

   అంతా ప్రశాంతం
నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఓట్లు వేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు

మందకొడిగా సాగిన పట్టభద్రుల పోలింగ్‌

సాయంత్రం 4 గంటలకు 63 శాతమే పోలింగ్‌

నెల్లూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలు జిల్లా పరిధిలో ప్రశాంతంగా ముగిశాయి. ఉపాధ్యాయులు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొనగా, పట్టభద్రుల పోలింగ్‌ మాత్రం మందకొడిగా సాగింది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో సాయంత్రం 4 గంటల సమయానికి 88.36 శాతం, పట్టభద్రుల నియోజకవర్గంలో 63.82 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో మహిళల ఓటింగ్‌ శాతం తక్కువగా నమోదు కావడం ఒక విశేషమమైతే, జిల్లా పరిధిలోని నాలుగు డివిజన్లలో కందుకూరు డివిజన్‌లో అత్యధిక శాతం పోలింగ్‌ జరగడం మరో విశేషం. కావలి, నెల్లూరు నగరంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కనిపించినా జిల్లాలో ఎక్కడా చెప్పుకోదగ్గ సంఘటనలు జరగలేదు. అయితే జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ హడావిడి కనిపించింది. టీడీపీ, వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను మాత్రం పోలీసులు పోలింగ్‌ కేంద్రం దరిదాపుల్లోకి కూడా రానివ్వకపోవడం గమనార్హం.

ఆది నుంచి మందకొడిగా..

సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైనా మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్‌ చాలా మందకొడిగా సాగింది. తొలి రెండు గంటల్లో అంటే ఉదయం 10 గంటలకు పట్టభద్రుల నియోజకవర్గంలో 8.94 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 16.55 శాతం ఓట్లు మాత్రమే పోల్‌ అయ్యాయి. క్యూలైన్ల వద్ద కొంతమంది ఉపాధ్యాయులు కనిపించారు తప్ప పట్టభద్రుల క్యూలైన్లు మాత్రం బోసిగా కనిపించాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలో 24.58 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. ఉపాధ్యాయ నియోజకవర్గంలో కాస్త ఎక్కువగా 39.72 పోలింగ్‌ రికార్డయ్యింది.

మధ్యాహ్నం తరువాత పుంజుకున్న పోలింగ్‌

మధ్యాహ్నం 12 గంటల తరువాత పోలింగ్‌ కేంద్రాల వద్ద జనం బారులుతీరి కనిపించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఈ నాలుగు గంటల వ్యవధిలో 40 శాతానికిపైగా పోలింగ్‌ నమోదయ్యింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి పట్టభద్రుల పోలింగ్‌ శాతం 43.10కి చేరుకోగా సాయంత్రం 4 గంటల సమయానికి 63.82 శాతానికి చేరుకుంది. టీచర్స్‌ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2 గంటలకు 54.08 శాతం పోలింగ్‌ నమోదవగా సాయంత్రం 88.36 శాతానికి చేరుకుంది.

కందుకూరు డివిజన్‌ టాప్‌

సాయత్రం నాలుగు గంటల వరకు పరిశీలిస్తే కందుకూరు డివిజన్‌లో ఎక్కువ శాతం ఓట్లు పోల్‌ అయ్యాయి. నాలుగు గంటలకు కందుకూరులో 72.09 శాతం ఓట్లతో అగ్రస్థానంలో కనిపించింది. కావలి డివిజన్‌లో 67శాతం, ఆత్మకూరు డివిజన్‌ 64.11 శాతం, నెల్లూరు డివిజన్‌లో 60 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. పట్టభద్రులు ఎక్కువగా ఉండే నెల్లూరు డివిజన్‌లో మిగిలిన డివిజన్ల కన్నా తక్కువగా పోలింగ్‌ జరగడం గమనార్హం. కాగా, సాయంత్రం పోలింగ్‌ ముగిసిన వెంటనే బ్యాలెట్‌ పత్రాలు కలిగి ఉన్న బాక్సులకు అధికారులు సీల్‌ వేశారు. అనంతరం పటిష్ట భద్రత నడుమ చిత్తూరుకు తరలించారు. ఈ నెల 16వ తేదీన ఉపాధ్యాయుల ఓట్లను ఆర్వీఎస్‌ లా కళాశాలలోను, ఆర్వీఎస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో పట్టభద్రుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

వైసీపీ హల్‌చల్‌

పట్టభద్రుల పోలింగ్‌ కేంద్రాల వద్ద వైసీపీ వర్గాలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. నెల్లూరు నగరం మొదలు జిల్లావ్యాప్తంగా ఇవే దృశ్యాలు కనిపించాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, ఉద్యోగులు అధికార పార్టీ వారితో ఒకలా, ప్రతిపక్ష వర్గాలతో మరోలా వ్యవహరించాయనే విమర్శలు వినిపించాయి. కొన్నిచోట్ల పోలింగ్‌ కేంద్రాల్లో వైసీపీ నాయకులు తిష్ఠి వేసుకొని కూర్చున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోలేదని, ప్రతిపక్షాలకు చెందిన వారిని మాత్రం పోలింగ్‌ కేంద్రం ప్రహరీకి దూరంగా తరివేశాయనే విమర్శలు వెల్లువెత్తాయి.

చెదురుమదురు ఘటనలు

అల్లూరులో ఎమ్మెల్యే రామిరెడ్డి తన అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళుతుండగా టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను అక్కడ నుంచి తరిమేశారు.

వరికుంటపాడులో ఓ వ్యక్తి దొంగ ఓటు వేసేందుకు వెళ్లగా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య గొడవ జరగ్గా, పోలీసులు సర్దుబాటు చేశారు. కాగా, వరికుంటపాడులోనే వైసీపీకి చెందిన రెండు వర్గాలు వేర్వేరుగా శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం చర్చకు దారి తీసింది.

ముత్తుకూరులో ఉదయం టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

వెంకటాచలంలో పోలింగ్‌ కేంద్రం వద్ద వైసీపీ నాయకులు ఉండగా టీడీపీ వర్గం అక్కడకు చేరుకుంది. అయితే పోలీసులు అభ్యంతరం తెలపడంతో టీడీపీ నాయకులు వారిని నిలదీశారు. తాము ఉంటే మీకుందుకంటూ వైసీపీ నాయకులు అనడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు సర్దుబాటు చేశారు.

నెల్లూరు నగరంలో పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్‌కు విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారికి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇలా ఒకటి రెండు వాగ్వివాదలు మినహా జిల్లావ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది.

మనుబోలులో ఒక్కో బూత్‌కు ఒక్కో బ్యాలెట్‌ బాక్సు కేటాయించడంతో 350 ఓట్ల తర్వాత నిండిపోయాయి. దీంతో బ్యాలెట్‌ పేపర్‌ బాక్సులోపలికి వెళ్ళడం లేదని ఓటర్లు అధికారులకు తెలిపారు. అయినా పట్టించుకోకపోవడంతో ఏజెంట్లు అభ్యంతరాలు తెలిపి పోలింగ్‌ ఆపాలని పట్టుబట్టారు. దీంతో తహసీల్దారు సుధీర్‌ హడావుడిగా బాక్సుల కోసం కలెక్టరేట్‌కు పరుగులు తీశారు. తిరిగి ఆయన వచ్చే వరకు క్యూలైన్‌లోనే ఓటర్లు ఆగిపోయారు. సుమారు 40 నిమిషాల తర్వాత తిరిగి పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది.

కావలిలో ఉద్రిక్తత

వైసీపీ, టీడీపీ వర్గాల సవాళ్లు, ప్రతిసవాళ్లు

కావలి, మార్చి 13 : కావలి పట్టణంలో వైసీపీ, టీడీపీ వర్గాల బల ప్రదర్శనతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ వర్గంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతా్‌పకుమార్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులు, టీడీపీ వర్గంలో నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటి సుబ్బానాయుడుతోపాటు ఆయన అనుచరుల మధ్య సుమారు ఒకటిన్నర గంటపాటు శివాలయం రోడ్డులో ఎదురెదురుగా సవాళ్లు ప్రతిసవాళ్లు, ఈలలు, కేకలు వేసుకున్నారు. దీంతో వారిని నియంత్రించడం పోలీ్‌సలకు పెద్ద కష్టంగా మారింది. అయితే ఆది నుంచి డీఎస్పీ వెంకటరమణతోపాటు అక్కడా పోలీ్‌సలు ఉండటం, మరలా మద్యలో రెచ్చిపోయినపుడు అదనపు ఎస్పీ ప్రసాద్‌ కూడా అక్కడకు చేరుకోవటంతో రెండు వర్గాలను అదుపులోకి తెచ్చారు. శివాలయం వీధిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలు రెండూ పక్కపక్కనే ఉండగా అక్కడే పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలలకు కొంతదూరంగా టీడీపీ, వైసీపీ నాయకులు శిబిరాలను ఏర్పాటు చేశారు. సాయంత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే ప్రతా్‌పకుమార్‌రెడ్డి తన అనుచరులతో శివాలయం రోడ్డుకు ఉత్తరం వైపున ఉన్న శిబిరం వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన హడావుడి చేస్తుండగా ఆ ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకులు నియోజకవర్గ ఇన్‌చార్జి మాలేపాటిని పిలిచారు. మాలేపాటి తన అనుచరులతో అక్కడకు వెళుతుండగా మధ్యలో ఎమ్మెల్యే అనుచరులలో కొందరు జై జగన్‌ అంటూ కేకలు వేశారు. దీంతో టీడీపీ వర్గీయులు కూడా జై చంద్రబాబు అని కేకలు వేశారు. దీంతో రెండు శిబిరాలు మోహరించాయి. పరిస్థితి చేతి దాటుతోందని గ్రహించిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశాయి. టీడీపీ వర్గీయులను అక్కడ నుంచి పంపించగా వారు జడ్పీ పాఠశాల వద్ద మీడియాతో మాట్లాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా వైసీపీ వర్గీయులు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవటంతో మరోసారి సవాళ్లు, ప్రతిసవాళ్లు, కేకలతో ఉద్రిక్తత నెలకొంది. ఆ సమయంలో అదనపు ఎస్పీ ప్రసాద్‌ మరికొంత మంది పోలీ్‌సలు అక్కడకు చేరుకున్నారు. రెండు వర్గాలను నెట్టి వేయడానికి ప్రయత్నించగా టీడీపీ నాయకులను పంపనిదే తాను వెళ్లనని ఎమ్మెల్యే తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ వారిని జడ్పీ క్రీడా మైదానం వరకు పంపి, బారికేడ్లు అడ్డుపెట్టారు. చివరకు బ్యాలెట్‌ బాక్స్‌లను బస్సులలో తీసుకెళ్లిన తర్వాత రెండు వర్గాలు వెళ్లి పోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది

గట్టి భద్రత నడుమ చిత్తూరుకు బ్యాలెట్‌ బాక్సులు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు

నెల్లూరు (హరనాథఫురం) : ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. సోమవారం నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ సామగ్రి స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఆత్మకూరు, నెల్లూరు, కావలి, కందుకూరు డివిజన్ల సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. జిల్లాలో పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్‌లు, వెబ్‌ క్యాస్టర్లు, వీడియో గ్రాఫర్‌లు సుమారు 1750 మంది ఎన్నికల విధుల్లో పొల్గొని, పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారంటూ అభినందించారు. బ్యాలెట్‌ బ్యాక్సులు, పోలింగ్‌ సామగ్రిని జాగ్రత్తగా స్వాధీనం చేసుకొని గట్టి బందోబస్తు నడుమ చిత్తూరుకు తరలించనున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. ఆయన వెంట కార్పొరేషన్‌ కమిషనర్‌ హరిత, డీఆర్వో వెంకటనారాయణమ్మ, ఆర్డీఓ మలోల తదితరులు ఉన్నారు.

వెబ్‌కాస్టింగ్‌లో పర్యవేక్షణ ఏదీ!?

ఓటింగ్‌ జరుగుతున్న తీరు, పోలింగ్‌ స్టేషన్ల వద్ద ఏర్పాట్లు, ఇతర సమస్యలను గుర్తించడానికి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కేంద్రీకృత వెబ్‌ కాస్టింగ్‌లో సోమవారం పర్యవేక్షణ కొరవడింది. తొలుత ఈ వెబ్‌ కాస్టింగ్‌ను తిక్కన భవన్‌లో పర్యవేక్షించిన కలెక్టర్‌, ఆ తరువాత పోలింగ్‌ జరుగుతున్న తీరు, ఓటు హక్కును వినియోగించుకోవడానికి డీకే కళాశాలకు వెళ్లారు. 11గంటల ప్రాంతలో తిక్కన భవన్‌కు కలెక్టర్‌ తిరిగి వచ్చారు. అప్పటిదాకా వెబ్‌ కాస్టింగ్‌ను పట్టించుకొనే వారే కరువయ్యారు. కలెక్టర్‌ తిరిగి వచ్చిన తరువాత వెబ్‌ కాస్టింగ్‌ సజావుగా సాగింది.

ఎస్పీ పరిశీలన

నెల్లూరు (క్రైం) : జిల్లాలో పోలింగ్‌ సరళిని ఎస్పీ సీహెచ్‌ విజయరావు సోమవారం పరిశీలించారు. నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల, కావలి, గుడ్లూరులలోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

Updated Date - 2023-03-14T00:47:12+05:30 IST