ఎర్రమట్టి.. కొల్లగొట్టి!
ABN , First Publish Date - 2023-05-21T22:11:03+05:30 IST
ప్రభుత్వ పోరంబోకు భూములు, కొండలు, వంకలు, వాగు ప్రాంతాల్లో గ్రావెల్‌ను దోచేస్తున్న ముఠా కన్ను ఇప్పుడు సంగంలోని ప్రభుత్వ ఐటీఐ స్థలంపై పడింది. ముంబయి జాతీయ రహదారి సమీపంలో ఉండటం, సదరు స్థలంలో విలువైన గ్రావెల్ ఉండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు.
బరి తెగిస్తున్న అక్రమార్కులు
భారీ యంత్రాలతో తవ్వకాలు.. ప్రమాదకరంగా గుంతలు
ప్రభుత్వ పోరంబోకు భూములు, కొండలు, వంకలు, వాగు ప్రాంతాల్లో గ్రావెల్‌ను దోచేస్తున్న ముఠా కన్ను ఇప్పుడు సంగంలోని ప్రభుత్వ ఐటీఐ స్థలంపై పడింది. ముంబయి జాతీయ రహదారి సమీపంలో ఉండటం, సదరు స్థలంలో విలువైన గ్రావెల్ ఉండటంతో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వి గ్రావెల్‌ను లే అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.
సంగం, మే 21 : 2009లో సంగంలో ప్రభుత్వ ఐటీఐ మంజూరవగా, స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల రెండు గదులు కేటాయించడంతా అక్కడ తాత్కాలిక తరగతులు నిర్వహిస్తున్నారు. తిరుమనపత్పిలోని 252 సర్వే నెంబరులో 5.75 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీఐకు కేటాయించి హద్దులు ఏర్పాటు చేశారు. టెండర్లు ఆహ్వానించే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తరువాత ఐటీఐ నిర్మాణం మరుగున పడింది. అయితే సంగం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐటీఐకి కేటాయించిన గదులు శిథిలస్థితికి చేరడం, వాటి స్థానంలో నూతన భవనాలు మంజూరు కావడంతో ఐటీఐ నిర్వహణకు సమస్య ఏర్పడింది. దీంతో సొంత భవనాలు నిర్మించే వరకు ఆత్మకూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు.
ఐటీఐ స్థలంలో గ్రావెల్ తరలింపు
తిరుమనతిప్పలో ప్రభుత్వ ఐటీఐకి కేటాయించిన స్థలంలో నాణ్యమైన గ్రావెల్ ఉంది. ఇందులో లభ్యమయ్యే గ్రావెల్‌కు మంచి డిమాండ్ పలుకుతోంది. దీంతో అక్రమార్కుల కన్ను ఐటీఐ స్థలంపై పడింది. రాత్రింబవళ్లు యంత్రాలతో తవ్వి గ్రావెల్‌ను ట్రాక్టర్లు, టిప్పర్లతో లే అవుట్లకు తరలించి జేబులు నింపుకుంటున్నారు.
హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినా..
గతంలో కొందరు ఈ స్థలంలో గ్రావెల్ తరలింపుతోపాటు ఆక్రమణకు పాల్పడటంతో ఐటీఐ ప్రిన్సిపాల్ రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు ఆక్రమణలు తెలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా ఆక్రమణలు ఆగినా గ్రావెల్ దొంగలు మాత్రం రెచ్చిపోతున్నారు. వీరి దాహానికి ఐటీఐ స్థలంలో భారీ గుంతలు ఏర్పడి భవిష్యత్తులో ఎందుకూ పనికిరాకుండా పోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ భవనం నిర్మించాలనుకుంటే ఈ గుంతలను పూడ్చేందుకు మళ్లీ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పట్టించుకోని యంత్రాంగం
ప్రభుత్వ ఐటీఐ స్థలంలో అక్రమార్కులు బరితెగిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఇంత తతంగం జరుగుతున్నా మైనింగ్, విజిలెన్స్, సెబ్, రెవెన్యూ, పోలీసులు పట్టించుకోకపోవడంతో పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఐటీఐ స్థలంలో అక్రమ గ్రావెల్ తరలింపును అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు.
=========