డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారమయ్యేనా?

ABN , First Publish Date - 2023-02-12T22:24:08+05:30 IST

కందుకూరు పట్టణాన్ని డంపింగ్‌ యార్డు సమస్య పట్టి పీడిస్తోంది.

డంపింగ్‌ యార్డు సమస్య పరిష్కారమయ్యేనా?
కందుకూరు డంపింగ్‌ యార్డులో పదిహేను అడుగుల ఎత్తున పేరుకుపోయిన చెత్త

కందుకూరు, ఫిబ్రవరి 12: కందుకూరు పట్టణాన్ని డంపింగ్‌ యార్డు సమస్య పట్టి పీడిస్తోంది. రెండు దశాబ్దాల క్రితం పట్టణానికి దూరంగా శివార్లలో ఏర్పాటు చేసిన డంపింగ్‌ యార్డు చుట్టూ ప్రస్తుతం నివాస గృహాలు అభివృద్ధి చెందినప్పటికీ దానిని అక్కడి నుంచి తరలించకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. డంపింగ్‌ యార్డుని అక్కడి నుంచి పట్టణానికి దూరంగా మరోచోటకు తరలిస్తున్నామని ప్రజాప్రతినిధులు, మున్సిపల్‌ అధికారులు మూడేళ్లుగా చెబుతున్నా అది కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పటం లేదు. డంపింగ్‌యార్డులో పదిహేను అడుగుల మేరకు చెత్త పేరుకునిపోవడంతో దాని నుంచి విపరీతమైన దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో పాటు వేసవి వస్తే నిప్పుపడి రావణకాష్టంలా కాలుతూ పట్టణంపైకి ధూమకాలుష్యాన్ని వెదజల్లడం పరిపాటిగా మారింది. తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా మున్సిపల్‌ పారిశుధ్య సిబ్బంది సేకరిస్తున్నప్పటికీ చెత్తను కంపోస్టుగా మార్చే ప్రక్రియ జరగకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇప్పటికే డంపింగ్‌యార్డుకి తూర్పు, పడమర, ఉత్తరం వైపుల దాని సమీపం వరకు నివాసగృహాలు రాగా 167బి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా జరిగే బైపాస్‌ నిర్మాణం పూర్తయితే ఈ డంపింగ్‌ యార్డు పట్టణం మధ్యకు చేరినట్లు అవుతోంది. ఇప్పటికైనా డంపింగ్‌యార్డుని అక్కడి నుంచి తరలించడంతో పాటు 2 ఎకరాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని ప్రజోపయోగకరంగా అభివృద్ధి చేస్తే మున్సిపాలిటీకి విలువైన ఆస్తిగా మారే అవకాశం ఉంది.

కార్యరూపం దాల్చక తప్పని తిప్పలు

కందుకూరు పట్టణ డంపింగ్‌యార్డుని నివాసప్రాంతాలకు దూరంగా తరలిస్తున్నామని ఎమ్మెల్యే మహీధరరెడ్డి, మున్సిపల్‌ అధికారులు గత మూడున్నరేళ్లుగా చెబుతున్నా కార్యరూపం దాల్చలేదు. తొలుత విక్కిరాలపేట రోడ్డులో ఉన్న ఓ స్థలంలో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు ప్రయత్నం జరగ్గా అది కార్యరూపం దాల్చలేదు. అనంతరం దివివారిపాలెం సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో డంపింగ్‌యార్డు ఏర్పాటుకు కొద్దిరోజులు ప్రయత్నాలు జరిగాయి. కారణం ఏమైనా అది కూడా కార్యరూపం దాల్చలేదు. కొద్దినెలల క్రితం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న దూబగుంట గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్థలంలోకి డంపింగ్‌యార్డుని తరలిస్తున్నామని అధికారులు ప్రకటించారు. అయితే స్థానిక అధికారపార్టీ నాయకులు వ్యతిరేకించటంతో ఆ ప్రయత్నాన్ని కూడా అధికారులు విరమించుకుని యధావిధిగా పాత డంపింగ్‌యార్డులోనే చెత్తను పడేస్తున్నారు.

కాలుష్యంతో ఇబ్బందులు

ప్రస్తుతం ఉన్న డంపింగ్‌యార్డు నుంచి వస్తున్న దుర్గంధంతో సమీప నివాసాలవారు తీవ్ర ఇబ్బందులు పడుతుండటమే గాక వేసవి కాలంలో డంపింగ్‌యార్డులో నిప్పుపడితే దానిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి కూడా మూడు నాలుగురోజులు పడుతున్న స్థితి. దీంతో వారం పదిరోజులపాటు దాదాపు సగం పట్టణంపైకి పొగ విరజిమ్ముతుండగా అనేకప్రాంతాల వారు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేసవిలో ఇళ్లలో పడుకోలేక, బయటకు రావాలంటే పొగదెబ్బకు ఊపిరాడక సతమతమవుతున్నామని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి సమీపిస్తుండటంతో డంపింగ్‌యార్డు సమస్యను తలుచుకుని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా డంపింగ్‌యార్డుకి అనువైన స్థలాన్ని పట్టణంకు దూరంగా గుర్తించి తరలించాలని ప్రజలు ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.

Updated Date - 2023-02-12T22:24:11+05:30 IST