Lokesh Padayatra: సీమ నుంచి కోస్తాలోకి యువగళం

ABN , First Publish Date - 2023-06-14T03:13:21+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర మంగళవారం రాయలసీమలో పూర్తయి కోస్తాలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది.

Lokesh Padayatra: సీమ నుంచి కోస్తాలోకి యువగళం

నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన లోకేశ్‌ పాదయాత్ర

రాయలసీమలో పాదయాత్ర పూర్తి

నేలతల్లికి నమస్కారం చేసి.. లోకేశ్‌ భావోద్వేగం

సాదరంగా వీడ్కోలు పలికిన టీడీపీ నేతలు

నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టిన లోకేశ్‌

కడ ప/నెల్లూరు, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ యువగళం పాదయాత్ర మంగళవారం రాయలసీమలో పూర్తయి కోస్తాలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టింది. 125వ రోజు పీపీ కుంట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన యాత్ర.. 3కి.మీ నడవగానే సాయంత్రం 6.15గంటలకు రాయలసీమలో పూర్తయి.. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు అమరనాథ్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, ఆర్‌.శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పుత్తా నరసింహారెడ్డి తదితరులు లోకేశ్‌కు వీడ్కోలు పలికారు.

9nlr6.jpg

సీమ నేలతల్లికి నమస్కరించిన ఆయన భావోద్వేగానికి గురయ్యారు. వేలాది జనం, అభిమానులు, నాయకులు, కార్యకర్తల జయజయధ్వానాల నడుమ.. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లిలో నెల్లూరు సీమలో అడుగుపెట్టిన లోకేశ్‌.. తొలుత సింహపురి గడ్డను ముద్దాడారు. భారీగా తరలివచ్చిన నెల్లూరు టీడీపీ నేతలు, కార్యకర్తలు, జనం ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. 2గంటలు ఆలస్యమైనా ఓపిగ్గా ఎదురుచూశారు. కదిరినాయుడుపల్లి సర్కిల్‌ వద్ద గ్రామ మహిళలు లోకేశ్‌కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. టీడీపీ నేతలు గుమ్మడికాయతో దిష్టితీశారు. మహిళలు, చిన్నపిల్లలు ఆయనతో ఫొటోలు దిగడానికి పోటీలుపడ్డారు. రాత్రి 9.30 గంటలకు పడమటి నాయుడుపల్లిలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి లోకేశ్‌ను కలిశారు. మర్రిపాడు మాజీ ఎంపీపీ పుట్టం బ్రహ్మానందరెడ్డి లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో మొదలైన పాదయాత్ర తొలిరోజు 9కి.మీ. సాగింది. దీంతో లోకేశ్‌ ఇప్పటివరకు 1,597 కిలోమీటర్లు నడిచారు.

9nlr2.jpg

సీమ అభివృద్ధిపై చర్చకు రెడీ..

‘రాయలసీమ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో చర్చించేందుకు మేం సిద్ధం.. కడపలోనే చర్చ పెడదాం.. నేనొక్కడినే వస్తా. వైసీపీ నుంచి 49 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు.. మొత్తం 57మందీ రండి.. చర్చిద్దాం’ అని లోకేశ్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పీపీ కుంట విడిది కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో సీమలో జరిగిన అభివృద్ధిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వద్ద సెల్ఫీలు దిగి.. ‘మా పాలనలో ఏం చేశామో మేం చూపించాం. మీరు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పే దమ్ముందా’ అని వైసీపీ ప్రజాప్రతినిధులకు సవాల్‌ విసిరారు. టీడీపీ రాగానే మిషన్‌ రాయలసీమలో ఇచ్చిన ప్రతి హామీనీ నిలబెట్టుకుంటామన్నారు.

9lokesh-(2).jpg

తొలి మజిలీ విజయవంతం

లోకేశ్‌ బహిరంగ లేఖ

రాయలసీమ జిల్లాల్లో 125 రోజులపాటు సుదీర్ఘ పాదయాత్ర చేసి నెల్లూరు జిల్లాకు చేరుకున్న లోకేశ్‌.. తనకు ఎదురైన అనుభవాలను, అనుభూతులను లేఖ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘రాష్ట్రంలో నాలుగేళ్ల అరాచక పాలనలో బాఽధితులుగా మారిన ప్రజలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన యువగళం పాదయాత్ర తొలి మజిలీ ప్రజలందరి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తి చేయడం ఆనందంగా ఉంది. రాయలసీమ చరిత్రలో ఇదివరకెవరూ చేయని విధంగా 124 రోజులపాటు నిర్వహించిన పాదయాత్రలో 44 అసెంబ్లీ నియోజకవర్గాలు, 108 మండలాలు, 943 గ్రామాల మీదుగా 1587.7 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశాను. ఇందులో సుమారు 20లక్షల మంది ప్రజలు భాగస్వామ్యులయ్యారు. వైసీపీ సైకోలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నాతోపాటు యువగళం బృందాలను ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వారు చూపిన ఆదరాభిమానాలను జీవితంలో మరిచిపోలేను. ఎంతటి గడ్డు పరిస్థితులనైనా ఎదురొడ్డి నిలబడే పోరాట స్ఫూర్తిని వారినుంచి పొందాను. ఆ స్ఫూర్తితో నా లక్ష్యాన్ని చేరేవరకు విశ్రమించను. రాయలసీమ బిడ్డగా ఆ ప్రాంతంలో నెలకొన్న సాగు, తాగునీరు, నిరుదోగ్యం సమస్య, వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నాను. మిషన్‌ రాయలసీమ ద్వారా సీమ ప్రజల కన్నీరు తుడుస్తానని మాటిస్తున్నాను. రైతుల కష్టాలను చంద్రబాబు గుర్తించారు. అందుకే మహానాడులో అన్నదాత పథకం ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఏటా ఈ పథకం కింద రైతుకు రూ.20వేలు ఇస్తామని ప్రకటించారు. రైతులకు ఒక విజ్ఞప్తి. ఒక్క చాన్స్‌ మోజులో పడినట్లుగా మరోసారి ఆ ఉచ్చులో పడకండి. మీ కోసం పనిచేసే చంద్రబాబును సీఎంగా చేసేందుకు సహకరించండి’ అని అందులో లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-06-14T04:24:14+05:30 IST