నారీలోకం ఉక్కు పిడికిలి!

ABN , First Publish Date - 2023-02-06T23:32:00+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణి, బాలింతలకు సేవలు అందిస్తున్న కార్యకర్తలు, సహాయకులకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సిబ్బంది సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా నిర్వహించారు.

నారీలోకం ఉక్కు పిడికిలి!
కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నాలో పాల్గొన్న అంగన్‌వాడీలు

నెల్లూరు (వీఆర్సీ) ఫిబ్రవరి 6 : అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణి, బాలింతలకు సేవలు అందిస్తున్న కార్యకర్తలు, సహాయకులకు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సిబ్బంది సోమవారం కలెక్టరేట్‌ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి అంగన్‌వాడీలు తరలిరావడంతో కలెక్టరేట్‌కు వెళ్లే అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శి జీ బేబిరాణి, కే సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు నేను ఉన్నాను.. నేను విన్నాను.. మిగిలిన అన్ని రాష్ట్రాలకంటే ఏపీ అంగన్‌వాడీలకు రూ.వెయ్యి అదనంగా ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మూడున్నరేళ్లయినా ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేదన్నారు. త్వరలోనే ఆయనకు బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఎంతటి బలవంత సర్పమైనా చలిచీమల చేతిలో చావక తప్పదన్న సుమతి శతక పద్యాన్ని గుర్తు చేశారు. అంగన్‌వాడీ లంటే సీఎం ఆఫా్ట్రల్‌ అనుకుంటున్నారేమో అలా అనుకున్న వారికి రాజకీయాన్నే దూరం చేశామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రకారం కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలుకు కొన్ని ప్రాజెక్టులలో 6నెలలుగా బిల్లులు చెల్లించలేదని ఇలా అయితే ఎలా కేంద్రాలు నడుస్తాయని ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు యూనియన్‌ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ ఆందోళనలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి టీవీవీ ప్రసాద్‌, వై సుజాతమ్మ, రెహనాబేగం, జీ నాగేశ్వరరావు, జీవీ కుమార్‌, అల్లాడి గోపాల్‌, పెంచలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రధాన డిమాండ్లు

అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలి

ఫేస్‌ యాప్‌ రద్దు చేసి, పర్యవేక్షణల పేరుతో వేధింపులు ఆపాలి.

వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచి, గ్యాస్‌ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి.

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి గ్రాడ్యుటీ అమలు చేయాలి. రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌ రూ.5లక్షలు, వేతనంలో సగం పింఛను ఇవ్వాలి.

బాబ్‌ క్యాలెండర్‌ నిర్ణయించాలి. వేతనంతో కూడిన మెడికల్‌ లీవు సౌకర్యం కల్పించాలి.

సర్వీసులో ఉండి చనిపోయిన సిబ్బంది కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి

ర్యాలీలు, సభలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.1ని రద్దు చేయాలి.

Updated Date - 2023-02-06T23:32:01+05:30 IST