నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ
ABN , First Publish Date - 2023-02-22T21:03:41+05:30 IST
ముత్తుకూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం, ఇంటి పన్ను అక్రమాల గురించి వార్డు సభ్యులు చేసిన ఫిర్యాదులపై బుధవారం డీపీవో చిరంజీవి విచారణ నిర్వహించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని గతంలో వార్డు సభ్యుడు షేక్
ముత్తుకూరు, ఫిబ్రవరి22: ముత్తుకూరు పంచాయతీలో నిధుల దుర్వినియోగం, ఇంటి పన్ను అక్రమాల గురించి వార్డు సభ్యులు చేసిన ఫిర్యాదులపై బుధవారం డీపీవో చిరంజీవి విచారణ నిర్వహించారు. తాము ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకుండా తమపైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారని గతంలో వార్డు సభ్యుడు షేక్ షఫీవుల్లా జాతీయ మైనార్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మైనార్టీ కమిషన్ జిల్లా కలెక్టరు, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. కలెక్టరు ఆదేశాల మేరకు డీపీవో స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఫిర్యాదుదారుడు షఫీవుల్లాను విచారించారు. ముత్తుకూరు పంచాయతీకి సంబంధించిన ఎలాంటి నిధుల వివరాలను, వ్యయం తీరును ఈవో చక్రం వెంకటేశ్వర్లు వార్డు సభ్యులకు చెప్పడం లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతానని బెదిరిస్తున్నారని షఫీవుల్లా ఫిర్యాదు చేశారు. నిధుల వ్యయంలో అక్రమాలకు పాల్పడ్డారని, సమావేశాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని, ఇతర అంశాల్లోనూ తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అరోపించారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను తమకు అందజేస్తే, రికార్డులు తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామని డీపీవో తెలిపారు. తాము చేసిన తీర్మానాలు ఏవీ అమలుకు నోచుకోవడం లేదని పలువురు వార్డు సభ్యులు కూడా ఫిర్యాదు చేశారు. అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి ఎంత పన్నులు వసూలు చేశారు... ఎందుకు ఖర్చు చేశారు.. అనే అంశాలేవీ వార్డు సభ్యులకు తెలియజేయడం లేదన్నారు. రోడ్డు విస్తరణ కోసం ఆక్రమణలు తొలగించే పేరుతో తన దుకాణాన్ని తీసివేయాలని చూస్తున్నారని, న్యాయం చేయాలని మత్స్యకార మహిళ అలహరి రమణమ్మ డీపీవోకు వినతిపత్రం అందించారు. పంచాయతీకి సంబంధించి తాను ఎలాంటి కాంట్రాక్టులు, పనులు చేయడం లేదని వైసీపీ నాయకులు కాకుటూరు లక్ష్మణరెడ్డి విచారణలో తెలిపారు. జాతీయ మైనార్టీ కమిషన్ సూచన మేరకు విచారణ నిర్వహించామని, వాస్తవాలపై కలెక్టరుకు నివేదిక అందజేస్తామని డీపీవో తెలిపారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో విజయకృష్ణ, ఎంపీడీవో ప్రత్యూష పాల్గొన్నారు.