పోలేరమ్మ జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2023-10-05T00:31:50+05:30 IST

వెంకటగిరి గ్రామ దేవత పోలేరమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది.ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు తీర్చిదిద్దారు. పిల్లలు వెదురుబుట్టలు, తట్టలతో ఇంటింటికి వెళ్లి ‘పోలేరమ్మకు భిక్షం వేయండి, పోతురాజుకు టెంకాయ కొట్టండి’ అంటూ భిక్షాటన చేశారు.

 పోలేరమ్మ జాతర ప్రారంభం
పోలేరమ్మకు నట్టింట పూజలు

వెంకటగిరి/వెంకటగిరి టౌన్‌, అక్టోబరు 4: వెంకటగిరి గ్రామ దేవత పోలేరమ్మ జాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది.ప్రతి ఇంటి ముందూ రంగవల్లులు తీర్చిదిద్దారు. పిల్లలు వెదురుబుట్టలు, తట్టలతో ఇంటింటికి వెళ్లి ‘పోలేరమ్మకు భిక్షం వేయండి, పోతురాజుకు టెంకాయ కొట్టండి’ అంటూ భిక్షాటన చేశారు.ఆ బియ్యంతో కుడుములు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారు. ప్రతి ఇంటిలో పోలేరమ్మ ప్రతిమను పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించి పూజలు నిర్వహించారు. ఇండ్ల ముంగిట నాటు పుంజుకోడిని కోయించి అమ్మవారిని ఆహ్వానించడంతో పాటు భక్తులకు అంబలి పోశారు.రాత్రి అమ్మవారి పుట్టిల్లుగా భావించే కుమ్మరింట అమ్మవారి ప్రతిమను తయారు చేశారు.అలంకారం చేయకుండా బుట్టలో పెట్టి అమ్మవారి అత్తవారిల్లుగా భావించే జీనిగల వారి వీధిలోని చాకలింటి మండపానికి ఊరేగింపుగా తరలించారు.అక్కడ అమ్మవారికి దిష్టిచుక్క, నల్లగుడ్డు పెట్టి ఆభరణాలతో అలంకరించారు.పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన రథంపై ఉంచి దివిటీల నడుమ ఊరేగింపుగా భక్తుల దర్శనార్థం పోలేరమ్మ దేవస్థానం వద్దకు తీసుకెళ్లి అర్ధరాత్రి తరువాత కొలువు దీర్చారు.గురువారం భక్తుల దర్శనానంతరం సాయంత్రం మూడు గంటల సమయంలో రాజాల నగరి నుంచి అమ్మవారికి సారె తీసుకొస్తారు బలి దున్నపోతును నరికిన కత్తిని,గండరదీపాన్ని అమ్మవారికి చూపించాక పొలిమేరకు తరలిస్తారు.పూలతో అలంకరించిన రఽథం నగరినుంచి అమ్మవారి దేవస్థానం వద్దకు రావడంతో విరూపోత్సవం మొదలవుతుంది. పురవీధుల గుండా పోలేరమ్మ ఊరేగుతూ మల్లమ్మ గుడి వీధిలోని మల్లయ్య తోటలో ఉన్న విరూప మండపం వద్దకు చేరుకున్నాక అమ్మవారి ప్రతిమను కత్తితో నరకడంతో జాతర ముగుస్తుంది. విరూపోత్సవానికి చుట్టుపక్కల జిల్లాలనుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సైతం తరలివచ్చిన జనాలతో వెంకటగిరి హోరెత్తుతోంది. ఎప్పుడూ లేనివిధంగా అమ్మవారి దర్శన టికెట్ల రేటు రూ.200కు, రూ.500కు పెంచడం పట్ల విమర్శలొచ్చాయి.జాతరకు మొత్తం 1500మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డి తెలిపారు.డీఎస్పీ కిరణ్‌కుమార్‌ తదితరులతో కలిసి ఆయన బుధవారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

=========

Updated Date - 2023-10-05T00:31:50+05:30 IST