ISRO: నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్.. పీఎస్ఎల్వీ సీ-56 ప్రయోగం విజయవంతం...
ABN , First Publish Date - 2023-07-30T07:27:09+05:30 IST
ఉమ్మడి నెల్లూరు: షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది.
ఉమ్మడి నెల్లూరు: శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో (ISRO) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు ఇస్రో శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీ సీ-56 (PSLV C-56) రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఉదయం 6గంటల 31 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్... సింగపూర్ (Singapore) దేశానికి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ (DS-SAR) ఉపగ్రహంతో పాటు మరో 6 నానో ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ సీరిస్‌లో ఇది 58వ ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఇస్రో ఛైర్మన్ సోమనాధ్ (ISRO Chairman Somanadh) స్వయంగా పర్యవేక్షించారు. పీఎస్ఎల్వీ రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 228.642 టన్నులు. ఏడు ఉపగ్రహాల బరువు 422కిలోలు. 23 నిమిషాల్లో ప్రయోగం పూర్తి చేశారు. ప్రధానమైన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని 19.03 నిమిషాలు, మిగిలిన 6 ఉపగ్రహాలను రాకెట్ 3.30 నిమిషాల వ్యవధిలో కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్ దేశానికి చెందిన ఏడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి రాకెట్ ప్రవేశపెట్టిందన్నారు. సెప్టెంబర్ నెలలో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం ఉంటుందని తెలిపారు. రాకెట్ ప్రయోగాల్లో వివిధ పరిశ్రమల సహకారాన్ని మరింతగా తీసుకుంటామన్నారు. గగన్ యాన్, ఎస్ఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని సోమనాథ్ తెలిపారు.