కాటేసిందయ్యా.. ఇప్పటికైనా కళ్లు తెరవండి!

ABN , First Publish Date - 2023-05-01T23:33:22+05:30 IST

అయ్యా.. మా వీధిలో కుక్కలు ఉన్నాయి. ఎటువైపు వచ్చి కరుస్తాయేమోనని వణికితున్నాం. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నాం. అధ్యక్షా.. మా డివిజన్‌లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కాలనీల్లోకి వెళితే ఇదే సమస్యపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం.

కాటేసిందయ్యా..  ఇప్పటికైనా కళ్లు తెరవండి!
60 మందిని కాటు వేసిన కుక్క ఇదే!

ప్రజలు మొత్తుకుంటున్నా పట్టించుకునేవారేరీ!?

నగర నడిబొడ్డున ఓ పిచ్చి శునకం స్వైరవిహారం

60 మందికి కాట్లు.. ఆసుపత్రుల్లో చికిత్స

అయ్యా.. మా వీధిలో కుక్కలు ఉన్నాయి. ఎటువైపు వచ్చి కరుస్తాయేమోనని వణికితున్నాం. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నాం.

అధ్యక్షా.. మా డివిజన్‌లో కుక్కల బెడద ఎక్కువవుతోంది. కాలనీల్లోకి వెళితే ఇదే సమస్యపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాం.

ఇలా ప్రజలే కాదు.. సాక్షాత్తు కార్పొరేటర్లు గొంతు చించుకున్నా నగరపాలక సంస్థ అధికారుల్లో మాత్రం చలనం కనిపించలేదు. వాళ్ల కునుకు నగరవాసుల ప్రాణం మీదకు వచ్చినట్టు అయ్యింది. సోమవారం నగర నడిబొడ్డున పచ్చిపట్టిన ఓ శునకం స్వైరవిహారం చేసింది. వీఆర్సీ సెంటర్‌ నుంచి మద్రాసు బస్టాండ్‌ సెంటర్‌ వరకు రోడ్డు మీద నడిచి వెళుతున్న వారందరినీ కరిచింది. దీంతో చుట్టుపక్కల వారు అటు ఇటూ పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. జీజీహెచ్‌లో మరమ్మతులకు గురైన లిఫ్టులను బాగు చేయాలంటూ కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భిక్షాటన చేస్తూ వెళుతుండగా వారిపైనా ఆ పిచ్చి కుక్క విరుచుకుపడింది. ఇలా మొత్తంగా సుమారు 60 మందిని తన పళ్లతో రక్కేసింది. చివరకు మద్రాసు బస్టాండ్‌ వద్ద కొందరు స్థానికులే సాహసించి ఆ కుక్కను పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కాగా, గాయపడ్డ వారందరూ జీజీహెచ్‌తోపాటు నెల్లూరు ఆసుపత్రి, రామచంద్రారెడ్డి ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

నియంత్రణ ఏదీ!?

కుక్కలు, పందుల నియంత్రణకు ఏటా నగర పాలక సంస్థ రూ.లక్షల్లో ఖర్చు చేస్తోంది. కానీ ఆ ఫలితాలు మాత్రం ఉండటం లేదు. కుక్కల సంతానోత్పత్తి జరగకుండా కు.ని ఆపరేషన్లు చేసి కుక్కల సంఖ్యను నియంత్రిస్తుంటారు. కానీ ఏటా ఈ పని చేస్తున్నట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేస్తున్నా నగరంలో కుక్కల సంఖ్య మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతోంది. ప్రస్తుతం కార్పొరేషన్‌లో కుక్కలను పట్టేందుకు ఒకే వాహనం ఉంది. ఆ ఒక్కటే నగరం మొత్తం తిరగాలి. ఇటీవల రెండో వాహనం కొనాలని నిర్ణయించినా ఇంకా అమలు జరగలేదు. కాగా మరోవైపు పందుల బెడద కూడా నగరంలో మళ్లీ ఎక్కువవుతోంది. గతంలో ప్రజలు గగ్గోలు పెట్టడంతో పందులను నగరం వెలుపలకు పంపారు. అయితే మళ్లీ పందులు నగరంలో జొరబడ్డాయి. మూడు రోజుల క్రితం బీవీ నగర్‌లో ఓ పంది రోడ్డుకు అడ్డం రావడంతో వాహనదారుడు కిందపడిపోయి గాయాలపాలయ్యాడు.

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)

======

Updated Date - 2023-05-01T23:33:59+05:30 IST