Tiger: ఆపరేషన్ తల్లి పులి.. తర్జనభర్జనలో అధికారులు
ABN , First Publish Date - 2023-03-07T20:22:14+05:30 IST
కొత్తపల్లి మండలం (Kothapalli Mandal) పెద్దగుమ్మాడాపురం అటవీ ప్రాతంలో నాలుగు ఆడ పులి పిల్లలు దారి తప్పి ఊళ్లోకి వచ్చాయి. వాటిని తల్లి ఒడిలోకి చేర్చేందుకు
నంద్యాల: కొత్తపల్లి మండలం (Kothapalli Mandal) పెద్దగుమ్మాడాపురం అటవీ ప్రాతంలో నాలుగు ఆడ పులి పిల్లలు దారి తప్పి ఊళ్లోకి వచ్చాయి. వాటిని తల్లి ఒడిలోకి చేర్చేందుకు ‘ఆపరేషన్ తల్లి పులి’కి శ్రీకారం చుట్టారు. పెద్దగుమ్మాడాపురం అటవీ ప్రాతంలో ప్రాజెక్ట్ టైగర్ ఎఫ్.డి శ్రీనివాస్రెడ్డి (Srinivas Reddy) పర్యటించారు. పెద్దపులి పిల్లలు లభ్యమైన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలు పరిశీలించారు. రెండురోజులు గడుస్తున్న T108 ఆచూకీ లభ్యం కాకపోవడంతో అటవీశాఖ అధికారులు తర్జనభర్జనలో పడ్డారు. ట్రాప్ కెమెరా (Trap camera)ల సంఖ్యను పెంచి త్వరితగతిన.. తల్లిపులి జాడను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. అటవీప్రాంతంలోని బెస్ క్యాప్లు (Bess Caps), ట్రెంచ్, సాసర్ పిట్ ప్రాంతాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు ఆదేశించారు.
నాలుగు ఆడ పులి పిల్లలు దారి తప్పి ఊళ్లోకి వచ్చాయి. బహుశా వాటికి నెల లోపు వయసు ఉండవచ్చు. పిల్లలు ఇక్కడికి ఎలా వచ్చాయో తెలియదు.. సోమవారం ఉదయం 7గంటల సమయంలో గ్రామానికి చెందిన యువకులు బహిర్భూమికి సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఒక చోట కాకులు సంచరిస్తూ అరవడం గమనించారు. దగ్గరకు వెళ్లి చూస్తే నాలుగు పెద్దపులి కూనలు కనిపించాయి. వాటికి పాలు, ఐస్‌క్రీస్, సెరిలాక్ వంటి పదార్థాలను తినిపించే ప్రయత్నం చేశారు. పులికూనలు వాటిని తినలేదు. ఎండ తీవ్రతకు మరింతగా నీరసించాయి. అటవీ అధికారులు తడి గోనెసంచులతో పులికూనలను చుట్టి ఉపశమనం కల్పించారు. ఆ తర్వాత వాటిని అడవిలో వదిలేయగా అవి అక్కడి నుంచి కదల్లేకపోయాయి. చివరికి చేసేదేమీ లేక వాటిని బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.
తల్లి వద్దకు చేర్చేందుకు..
పులి కూనల తల్లి కోసం అటవీ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దగుమ్మడాపురం సమీప అటవీ ప్రాంతాల్లో 40 కెమెరా ట్రాప్స్‌ను ఏర్పాటు చేశారు. ఎక్కడైన పులి అడుగుజాడలు కనిపిస్తే వాటిని పరిగణలోకి తీసుకుని పులికూనలను తల్లి వద్దకు చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సోమవారం రాత్రి వరకు బైర్లూటి వెటర్నరీ ఆసుపత్రిలోని ఏసీ గదిలో నిర్ధిష్ట ఉష్ణోగ్రతల మధ్య పులికూనల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నారు. రెండురోజుల్లోగా పూలికూనలను తల్లివద్దకు చేరుస్తామని అటవీ అధికారులు చెప్పారు.. ఇది సాధ్యం కాకపోతే తిరుపతి జూపార్క్‌కు తరలిస్తామని అన్నారు.