Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

ABN , First Publish Date - 2023-02-22T19:01:35+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు.

Pattabhi: రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి

గన్నవరం: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Kommareddy Pattabhiram)తో సహా 11 మంది టీడీపీ నేతలను రాజమండ్రి సెంట్రల్ జైలు (Rajahmundry Central Jail)కు తరలించాలని జడ్జి ఆదేశించారు. న్యాయమూర్తి ఆదేశాలతో పట్టాభిరామ్‌ సహా 11 మందిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. నిన్న (మంగళవారం) పట్టాభితోపాటు 13 మంది టీడీపీ నేతలను కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు కొట్టారా అని న్యాయమూర్తి శిరీష ప్రశ్నించారు. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ పట్టాభి జరిగిన విషయాన్ని వెల్లడించారు. గుడ్లవల్లేరు పోలీసు స్టేషన్‌ (Gudlavalleru Police Station)లోకి వెళ్లగానే ముఖానికి టవల్‌ కట్టారని.. ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను లోపలకు ఈడ్చుకుని వెళ్లారని.. అక్కడ తనను లాఠీతో కొట్టారని తెలిపారు. అరగంట పాటు చిత్రహింసలకు గురిచేశారని చెప్పారు. రాత్రంతా పోలీసు స్టేషన్లు మార్చి హింసించారన్నారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. ఈ ఫిర్యాదుతో వైద్య పరీక్షలకు న్యాయమూర్తి ఆదేశించారు. పట్టాభి మెడికల్‌ రిపోర్టులను నేడు కోర్టుకు పోలీసులు సమర్పించారు. చేతి మీద వాపు తప్ప... పెద్దగా గాయాలు లేవని నివేదికలో వైద్యులు తెలిపారు.

సోమవారం గన్నవరం (Gannavaram)లో జరిగిన ఘటనలకూ, పోలీసులు నమోదు చేసిన కేసులకూ ఏమాత్రం పొంతన లేదు. దొంతు చిన్నకు బెదిరింపులపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం సాయంత్రం టీడీపీ నాయకులు గన్నవరం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు (Batchula Arjunudu) అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో... పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు టీడీపీ రాష్ట్ర నాయకుడు పట్టాభి అక్కడికి వెళ్లారు. అదే సమయంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. దీనికి నిరసనగా పట్టాభితోసహా టీడీపీ నాయకులంతా 16వ నంబరు జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.

పోలీసుల సమక్షంలో, వారిసహకారంతో వైసీపీ శ్రేణులు జాతీయ రహదారిపైకి చేరుకుని... టీడీపీ నాయకులు, కార్యకర్తలపై రాళ్ల దాడికి దిగాయి. సోమవారం జరిగిన ఈ సీన్లన్నీ మంగళవారం నాటికి మారిపోయాయి. సీఐ కనకారావుతోపాటు ఎమ్మెల్యే వంశీ ముఖ్య అనుచరుడు గొన్నూరు సీమయ్య ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పట్టాభితోసహా పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోసహా హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.గన్నవరం పోలీసులు పట్టాభి, మరో 11 మంది టీడీపీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 341, 333, 307 కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - 2023-02-22T19:23:17+05:30 IST