Pawan Kalyan: పవన్ సెక్యూరిటీలో కొత్త స్టైల్
ABN , First Publish Date - 2023-03-11T20:45:20+05:30 IST
సఫారీ దుస్తులు.. కళ్లకు నల్ల అద్దాలు.. చేతిలో బుల్లెట్ ప్రూఫ్ బ్యాగ్.. సీఎం, జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తుల భద్రతా సిబ్బంది ఆహార్యాలు ఇవి. తాజాగా జనసేన అధినేత..
విజయవాడ: సఫారీ దుస్తులు.. కళ్లకు నల్ల అద్దాలు.. చేతిలో బుల్లెట్ ప్రూఫ్ బ్యాగ్.. సీఎం, జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తుల భద్రతా సిబ్బంది ఆహార్యాలు ఇవి. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భద్రతా సిబ్బంది ఈ విధంగా స్టైల్ మార్చారు. పవన్ తన భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీ (Private security)ని ఏర్పాటు చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం వరకు ఆయనకు చుట్టూ ఆరుగురు భద్రతా సిబ్బంది మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 20కి పెరిగింది. వాళ్లంతా కళ్లకు నల్ల అద్దాలు పెట్టుకుని, సఫారీ దుస్తుల్లో, బుల్లెట్‌ప్రూఫ్ బ్యాగ్‌లతో కనిపించారు. పవన్ హైదరాబాద్ (Hyderabad) నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆయనకు వాళ్లంతా భద్రతా వలయంగా ఏర్పడ్డారు. రాష్ట్రంలో రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే పటిష్ట భద్రత పెట్టుకున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా పవన్ పర్యటించేందుకు ప్రత్యేకంగా వాహనం వారాహి సిద్ధం చేసుకున్నారు. వారాహికి కొండగట్టు, విజయవాడ కనకదర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేశారు. పవన్ సభలు, రోడ్ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా... చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్ ప్రత్యేక సర్వర్‌కు రియల్ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్ మెట్లు ఉంటాయి.