LokeshPadayatra: లోకేశ్ పాదయాత్రకు పోటెత్తిన ప్రజలు

ABN , First Publish Date - 2023-03-21T21:00:48+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ నాయకులు కొట్టేయాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో

LokeshPadayatra: లోకేశ్ పాదయాత్రకు పోటెత్తిన ప్రజలు

పుట్టపర్తి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను వైసీపీ నాయకులు కొట్టేయాలని చూస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (NaraLokesh) ఆరోపించారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో ఆయన మంగళవారం 49వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra) కొనసాగించారు. అడుగడుగునా ఆయనకు జనం నీరాజనం పలికారు. కదిరి (Kadiri) లోని విడిది కేంద్రం నుంచి ఓబుళదేవరచెరువు మండలంలోని వనుకువారిపల్లి విడిది కేంద్రం వరకూ మంగళవారం 12.5 కి.మీ. పాదయాత్ర సాగింది. ఇప్పటి వరకూ ఆయన 625 కి.మీ. యాత్ర పూర్తి చేశారు. కదిరి నుంచి విడిది కేంద్రం వరకూ దారిపొడవునా జనం బారులుతీరి లోకేశ్‌కు స్వాగతం పలికారు. వారి సమస్యలను తెలుసుకుంటూ లోకేశ్‌ ముందుకు సాగారు. అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యమానికి సంఘీభావంగా నారా లోకేశ్‌తోపాటు పార్టీ నాయకులు నల్లబ్జాడ్జీలు ధరించారు. హామీ మేరకు జీతాలు పెంచాలని కోరితే.. అంగన్‌వాడీలను అరెస్టు చేయడం దారుణమని లోకేశ్‌ అన్నారు. అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని సూచించారు.

కదిరి మండలం ముత్యాలచెరువు వద్ద టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లోకేశ్‌ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. టీడీపీ (TDP) హయాంలో గృహ నిర్మాణం 90 శాతం పూర్తి అయిందని, మిగిలిన పదిశాతం పనులను వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లయినా పూర్తి చేయలేదని, మౌలిక సదుపాయలు కల్పించలేదని విమర్శించారు. లబ్ధిదారుల ఎంపికలో అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులను తొలగించి, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులు కట్టిన డీడీ డబ్బులు కూడా ఇంతవరకు వెనక్కు ఇవ్వలేదని మండిపడ్డారు. గెలిచినవెంటనే టిడ్కో ఇళ్లను ఉచితంగా కేటాయిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని జగన్‌ను ప్రశ్నించారు. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం జీ ప్లస్‌ 3 ఇళ్లను నిర్మించిందని, కదిరిలో దాదాపు రూ.205 కోట్లతో 1,104 ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. మిగిలిన పదిశాతం పనులను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లుగా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తిచేసి, నిజమైన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

కదిరి మండలం చిన్నగుట్ట తండా వద్ద హాంద్రీనీవా కాలువను లోకేశ్‌ పరిశీలించారు. హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేసిన ఘనత టీడీపీదే అని లోకేశ్‌ అన్నారు. జగన్‌ నాలుగేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. నిలిచి పోయిందనుకున్న హంద్రీనీవా ప్రాజెక్టును 2018లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పూర్తి చేయించారని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పీలేరు, కుప్పం నియోజకవర్గాల పరిధిలో గ్రామాలకు సాగు, తాగునీరు అందించామని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమకు తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. ఎనిమిది నియోజకవర్గాలలోని 28 మండలాలకు హంద్రీనీవా ద్వారా నీరు వెళుతోందని అన్నారు. 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పది లక్షల మందికి తాగునీరు అందించడమే లక్ష్యంగా చెర్లోపల్లి జలాశయాన్ని నిర్మించామని అన్నారు. ఎత్తిపోతల పథకాల ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులను హంద్రీనీవా నీటితో నింపి, తద్వారా తాగునీరు అందించామని లోకేశ్ అన్నారు.

Updated Date - 2023-03-21T21:00:48+05:30 IST