పెద్దపులి సంచారంపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2023-01-29T01:38:59+05:30 IST
నల్లమల అటవీ ప్రాంతంలోని అర్థవీడు మండలంలోని మాగుటూరు, లక్ష్మీపురం, వెలగలపాయ, కాకర్ల గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు.
కంభం, జనవరి 28 : నల్లమల అటవీ ప్రాంతంలోని అర్థవీడు మండలంలోని మాగుటూరు, లక్ష్మీపురం, వెలగలపాయ, కాకర్ల గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ డిప్యూటీ ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. ఆయా ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు తెలిపారు. గత బుధవారం వెలగలపాయ అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి దాడి చేసి ఒక ఆవును చంపిన విషయం విధితమే. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు మాగుటూరు ప్రాంత అటవీ ప్రాంతంలో మరో ఆవుపై దాడి చేసింది. అయితే రైతులు గమనించి కేకలు వేయడంతో పులి అడవిలోకి వెళ్లిపోయింది. శుక్రవారం మాగుటూరు అటవీ ప్రాంతంలో మరో ఆవుపై దాడి చేసి చంపింది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు, గ్రామస్థులు రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరసగా పులిదాడుల నేపథ్యంలో పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేతకు పంపాలన్నా, సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటకు రావాలన్నా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీంతో ఫారెస్టు అధికారులు పులి ఆవులపై దాడులు చేసిన ప్రాంతాల్లో, అటవీప్రాంత సమీపాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆ పెద్దపులి మాగుటూరు, లక్ష్మీపురం, గెర్లకొండ, కోమటికుంట వరకు పెద్దపులి సంచరిస్తోందని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ తెలిపారు.