బాబుకు చిన్నబాబుల శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2023-04-21T01:26:10+05:30 IST
టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు.
మార్కాపురం, ఏప్రిల్ 20 : టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 73వ జన్మదిన వేడుకలు గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక సాయిబాలాజీ పాఠశాల వద్ద మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఏర్పాటు చేసిన ప్రాంగణంలో తొలుత సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మొదట ‘మీరే మా భవిష్యత్’ అనే ప్లకార్డ్‌లతోపాటు గులాబీ పూలతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలోకి వచ్చిన చంద్రబాబునాయుడుకు హ్యాపీ బర్త్‌డే తాతయ్య అంటూ 100మంది చిన్నారులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఆ సమయంలో ఓ చిన్నారి తాను దాచుకున్న హుండీని బహూకరించింది. ఆ తర్వా త మరో భారీ కేక్‌ను కట్ చేసి నాయకులకు పంచారు. ఈ సందర్భంగా టీడీపీ నెల్లూరు, ప్రకాశం జిల్లాల కోఆర్డినేటర్ బీసీ జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, స్వామి, ఎమ్మెల్సీలు పి.అనురాధ, మంతెన సత్యనారాయణరాజు, కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, పోతుల రామారావు, కందుల నారాయణరెడ్డి, మత్తుముల అశోక్‌రెడ్డి, నారపుశెట్టి పాపారావు, దివి శివరాం, టీడీపీ నాయకులు దామచర్ల సత్య, గూడూరి ఎరిక్షన్‌బాబు, వక్కలగడ్డ మల్లికార్జున్, రాష్ట్రస్థాయి టీడీపీ నాయకులు అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు.