రూ.కోట్లు కొల్లగొట్టారు!

ABN , First Publish Date - 2023-04-01T01:14:13+05:30 IST

కనిగిరి నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అవినీతి తారస్థాయికి చేరింది. వారి అక్రమాలు శ్రుతిమించిపోయాయి.

రూ.కోట్లు కొల్లగొట్టారు!

ముఖ్యప్రజాప్రతినిధుల అండతో బహిరంగ దోపిడీ

పనులు చేయకుండానే బిల్లులు

ప్రజావేదికలో వెల్లడి

సీఎస్‌ పురం మండలంలో భారీ బాగోతం

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కనిగిరి నియోజకవర్గంలో అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల అవినీతి తారస్థాయికి చేరింది. వారి అక్రమాలు శ్రుతిమించిపోయాయి. జరగని పనులు చేసినట్లు చూపిస్తూ వచ్చిన డబ్బులు వచ్చినట్లు నొక్కేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఉన్న అధికారపార్టీ ప్రజాప్రతినిధులు చేతివాటం ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలున్న వారే ఈ వ్యవహారంలో ప్రధానంగా పాలుపంచుకున్నారు. కారణాలు ఏమైనా అందుకు స్థానిక అధికార యంత్రాంగం సహకరిస్తుండగా అవినీతి సొమ్ములో అత్యధిక భాగం మాత్రం అసలు నేతకే చేరినట్లు తెలుస్తోంది. తాజాగా సీఎస్‌పురం మండలంలో బయటపడిన సుమారు రూ.2.5కోట్ల అవినీతి వ్యవహారమే ఇది.

రోడ్ల పేరుతో స్వాహా

సీఎస్‌పురం మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద కోట్ల రూపాయల పనులు జరిగాయి. అందులో రూ.2.50కోట్లకు సంబంధించి ఎలాంటి పనులు చేయకుండానే అధికారపార్టీ నాయకులు నొక్కేసినట్లు తేటతెల్లమైంది. మండలంలోని పెద్దరాజుపాలెం, ఆర్కేపల్లి, సీఎస్‌పురం, అరివేముల, అంబవరం, కొత్తపలి,్ల సీఎస్‌పురం పంచాయతీల పరిధిలో గ్రావెల్‌ రోడ్ల నిర్మాణం జరిగిందని, అందుకోసం, ఇతరత్రా అనుబంధ పనుల కోసం రూ.2.25 కోట్లకుపైగా నిధులు ఖర్చయ్యాయని రికార్డులు సృష్టించారు. ఆగమేఘాలపై సంబంధిత అధికారులు అన్ని పనులు సవ్యంగా జరిగినట్లు ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు. వారు కూడా అంతే వేగంతో ఆయా పంచాయతీలకు నిధులు మంజూరు చేశారు. అలా నిధులు పంచాయతీలకు వచ్చాయో లేదో ఇలా సర్పంచ్‌లుతమ పరిధిలోని ఉద్యోగుల సహకారంతో వాటిని డ్రా చేశారు. బిల్లులు ఓకే చేయడం, నిధులు మంజూరు కావడం, వాటిని డ్రా చేయడం అంతా రోజుల వ్యవధిలో శరవేగంగా జరిగిపోయాయి.

ప్రజావేదికలో బహిర్గతం

సీఎస్‌పురంలో ఉపాధి హామీ పనుల ఆడిట్‌లో భాగంగా శుక్రవారం ప్రజావేదిక కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించినప్పుడు ఈ బాగోతం బహిరంగమైంది. ఆయా గ్రామాల్లో గ్రావెల్‌ రోడ్లు వేసినట్లు అందుకోసం రూ.2కోట్లు ఖర్చుచేసినట్లు ప్రజావేదికలో అధికారులు వెల్లడించారు. అయితే అనూహ్యంగా ఆ గ్రామాల్లో రోడ్లు ఎక్కడ వేశారో చూపించండి అంటూ కొందరు సాధారణ ప్రజలు ప్రశ్నించటంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఎక్కడా రోడ్లు వేయకపోగా రికార్డుల్లో వేసినట్లు చూపటం, అధికారులు బిల్లులు మంజూరు చేయటం, డబ్బులు డ్రా చేయటం జరిగిపోయినట్లు వెల్లడైంది. రోడ్ల నిర్మాణంతోపాటు భవనాల నిర్మాణానికి సిమెంట్‌, ఇనుము కొన్నట్లు అలాగే పని ప్రదేశాల్లో బోర్లు వేసినట్లు కూడా నిధులు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. అలా డ్రా చేసిన సుమారు రూ.14.50 లక్షలు కూడా అధికారపార్టీ నేతలు స్వాహా చేశారు.

డబ్బులొచ్చాయ్‌.. డ్రా చేసి ఇచ్చాం..

ఇంత బహిరంగ అవినీతిని వదిలేస్తే కొంపలు మునుగుతాయి అనుకున్నారు కాబోలు అక్కడకు వెళ్లిన డ్వామా జిల్లా అధికారులు సంబంధిత ఉద్యోగులను నిలదీశారు. అలాగే ఈ అవినీతి వ్యవహారం ప్రజల్లో చర్చగా మారి కొత్త విషయాలు వెలుగుచూశాయి. ఒక మండలస్థాయి అధికారి అయితే ‘మాదేముంది పైనుంచి ఒత్తిడి అందుకే అన్నీ ఓకే చేశాం’ అని చెప్పేసినట్లు తెలిసింది. కొందరు సర్పంచ్‌లు కూడా ఈ పాపంలో మాకేమీ సంబంధం లేదంటూ డబ్బులు వస్తాయి డ్రా చేసి ఇవ్వాలంటే ఇచ్చామని బహిరంగంగానే ఒప్పుకున్నారు. అంతేకాక ఆయా పనులు చేసిన ట్లుగా రికార్డుల్లో చూపిన కొందరు వ్యక్తులు ముఖ్య ప్రజాప్రతినిధికి అనుంగ శిష్యులు అన్న విషయం తేటతెల్లమైంది. దీంతో ఒక పథకం ప్రకారమే ఈ అవినీతి బాగోతం చోటుచేసుకొని ఆ డబ్బులు ఎక్కడకు వెళ్లాలో అక్కడకు వెళ్లాయంటూ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అవినీతి సొమ్ము రికవరీ చేస్తామని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ శీనారెడ్డి అక్కడికక్కడే ప్రకటించారు. అయితే అందుకు ఎవరిని బాధ్యులు చేస్తారు. ఎక్కడ నుంచి రికవరీ చేస్తారు. తెరవెనుక సూత్రధారి, పాత్రధారి వెలుగులోకి వస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.

Updated Date - 2023-04-01T01:14:13+05:30 IST