భగ్గు.. భగ్గు
ABN , First Publish Date - 2023-03-21T01:21:24+05:30 IST
కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డీఎస్‌బీవీ స్వామిపై సోమవారం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై జిల్లాలోని టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి.
తెలుగు తమ్ముళ్ల మండిపాటు
ఎమ్మెల్యే స్వామిపై దాడికి వ్యతిరేకంగా నిరసనలు
జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు
ముక్తకంఠంతో ఖండించిన ముఖ్య నేతలు
ఒంగోలు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డీఎస్‌బీవీ స్వామిపై సోమవారం అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడ్డారు. ఈ దారుణంపై జిల్లాలోని టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేల తీరును ఖండిస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. ఎమ్మెల్యే స్వామి ప్రాతినిథ్యం వహించే కొండపితోపాటు ఒంగోలు, కనిగిరి, సంతనూతలపాడు తదితర నియోజకవర్గాలతోపాటు పలు పట్ఠణాలు, మండల కేంద్రాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద పార్టీ కార్యకర్తలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. కొండపి, సింగరాయకొండ, టంగుటూరులలో ర్యాలీలు నిర్వహించారు. ఒంగోలులోని మిరియాలపాలెం సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద భారీగా టీడీపీ నేతలు నిరసన తెలిపారు. పామూరులో అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీశ్రేణులు నిరసన చేపట్టాయి. కనిగిరిలో ర్యాలీ నిర్వహించారు. పీసీపల్లి, ఎస్‌ఎన్‌పాడు, మద్దిపాడు, గిద్దలూరుతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి వైసీపీ తీరుపై మండిపడ్డారు.
ఖండించిన నేతలు
ఎమ్మెల్యే డీఎస్‌బీవీ స్వామిపై జరిగిన దాడిని టీడీపీ ముఖ్యనేతలు ముక్తకంఠంతో ఖండించారు. మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయకుమార్, అశోక్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, వైపాలెం నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు వేర్వేరు ప్రకటనల్లో ఈ ఘటనను నిరసించారు. అసెంబ్లీ చరిత్రలో ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి జీవో నెం1 గురించి స్వామి ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ వారు సాక్షాత్తు స్పీకర్ సమక్షంలోనే దాడులకు తెగబడ్డారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు ఫలితాలు పొందిన వైసీపీ అసహనంతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. దళిత శాసనసభ్యుడిపై అసెంబ్లీలో దాడికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సిగ్గుపడాలన్నారు. ఇలా దాడులకు పాల్పడే వారు అంతకు అంత అనుభవించక తప్పదని హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదని, దాడులకు పాల్పడిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు.