స్పష్టత కరువు
ABN , First Publish Date - 2023-04-01T01:05:10+05:30 IST
జిల్లాలో ఇంటింటికీ రేషన్ పంపిణీపై స్పష్టత కరువైంది. మొబైల్ వాహనాల ద్వారా శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు రేషన్ సరుకులు ఇవ్వాల్సి ఉంది.
రేషన్ పంపిణీపై స్పందించని ప్రభుత్వం
సమస్యలు పరిష్కరించే వరకూ వాహనాలు తీసేది లేదంటున్న ఆపరేటర్లు
ఒంగోలు (కలెక్టరేట్) మార్చి 31 : జిల్లాలో ఇంటింటికీ రేషన్ పంపిణీపై స్పష్టత కరువైంది. మొబైల్ వాహనాల ద్వారా శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా కార్డుదారులకు రేషన్ సరుకులు ఇవ్వాల్సి ఉంది. అయితే ఎండీయూ ఆపరేటర్లు తమ సమస్యలను పరిష్కరించే వరకు వాహనాలు తీసేది లేదని స్పష్టం చేయడంతో బియ్యం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. వాహనదారులకు బ్యాంకులో మార్చి నెలలో వేసిన వేతనాలను వాహనాల ఇన్సూరెన్స్‌కు జమచేసుకున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరు రూ.14వేల నుంచి రూ.22వేల వరకు ఇన్సూరెన్స్‌ను చెల్లించాల్సి వచ్చింది. అయితే వాహనాల ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం ఆపరేటర్ల వేతనం నుంచి బ్యాంకులు నేరుగా జమ చేసుకున్నాయి. దీంతో కొంతమంది బ్యాంకు ఖాతాలు మైన్‌సలోకి వెళ్లాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వాహనాల ఆపరేటర్ల యూనియన్ నాయకులు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ చెప్పినా ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. దీంతో శనివారం నుంచి జరగాల్సిన రేషన్ పంపిణీపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై శుక్రవారం సాయంత్రం వరకు కూడా స్పందించకపోవడంతో సంబంధిత అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ విషయంపై డీఎ్‌సవో ఉదయభాస్కర్‌ను వివరణ కోరగా ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో రేషన్ పంపిణీ చేపడతామని తెలిపారు.