భూమాయ

ABN , First Publish Date - 2023-07-29T01:03:46+05:30 IST

మండలంలోని పన్నూరు వీఆర్వో భూమాయ ప్రదర్శించాడు.

భూమాయ
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న పన్నూరు రైతులు, పక్కన ఎమ్మెల్యే స్వామి

హైవే పరిహారం పొందేందుకు పన్నూరు వీఆర్వో పన్నాగం

70 ఎకరాలపైన బీడు కుటుంబ సభ్యుల పేర్లతో రిజిస్ట్రేషన్‌

రైతులతో తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని మోసం

బాధితులతో కలిసి కలెక్టర్‌ దినేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిన కొండపి ఎమ్మెల్యే స్వామి

మర్రిపూడి, జూలై 28 : మండలంలోని పన్నూరు వీఆర్వో భూమాయ ప్రదర్శించాడు. బీడు భూమికి హక్కులు కల్పిస్తానని రైతులను నమ్మించి మోసం చేశాడు. వారితో ఒప్పంద పత్రాలంటూ తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే కోసం ప్రభుత్వం సేకరించే భూమికి ఇచ్చే నష్టపరిహారాన్ని నొక్కేసేందుకు పన్నాగం పన్నాడు. తన కుటుంబ సభ్యుల పేర్లతో రోడ్డుకు ఇరువైపులా వచ్చే 70 ఎకరాలకుపైగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. అదేసమయంలో అధికార పార్టీకి చెందిన వారికి జాతీయ రహదారి పక్కన వచ్చే భూములను ఆన్‌లైన్‌ చేయించారు. విషయం తెలుసుకున్న మిగిలిన రైతులు కొండపి ఎమ్మెల్యే స్వామితోపాటు కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పన్నూరులోని 169/1, 171/1, 172/1, 173/1, 177/1, 178/1, 180/1, 185/1, 206/1, 209/1, 12/2, 204/1, 114/10, 115/2 సర్వేనెంబర్లలో 150 ఎకరాల వరవడి బీడు భూమి ఉంది. ఎఫ్‌ఎల్‌ఆర్‌ ప్రకారం ఆ భూమిపై 28 మంది హక్కుదారులుగా ఉన్నారు. వారి వారసులుగా 91 మందిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. బెంగళూరు-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రకటన రావడంతో ఆభూమిపై వీఆర్వో శివారెడ్డి కన్నుపడింది. గ్రామంలోని కొందరు రైతులతో కుమ్మక్కై ఆభూమిని దక్కించుకునేందుకు పన్నాగం పన్నాడు.

కుటుంబ సభ్యుల పేరుతో 70 ఎకరాలపైన కొనుగోలు

వరవడి బీడు భూమి ఉన్న 169/1 సర్వే నెంబర్‌లో 5.76 ఎకరాలు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం సేకరించేందుకు ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. దీంతో వీఆర్వో శివారెడ్డి రంగంలోకి దిగాడు. బీడు భూములపై రైతులకు హక్కులు కల్పిస్తామని నమ్మించాడు. వారితో ఒప్పంద పత్రాలు అంటూ తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నాడు. రోడ్డు వెంబడి ఉన్న పొలాలకు డిమాండ్‌ వచ్చే అవకాశం ఉండటంతో వాటిని తనకు అనుకూలమైన వారు, అధికార పార్టీకి చెందిన వ్యక్తుల పేర్లతో ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వారి నుంచి 70 ఎకరాలకు పైన కొనుగోలు చేశాడు. అందులో హైవే కోసం సేకరించే 5.76 ఎకరాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వం ఇచ్చే రూ.37లక్షల పరిహారం దిగమింగేందుకు అంతా సిద్ధం చేసుకున్నాడు.

కలెక్టర్‌కు ఫిర్యాదు

వీఆర్వో పన్నాగాన్ని ఆలస్యంగా తెలుసుకున్న మిగిలిన రైతులు లబోదిబోమంటున్నారు. విషయాన్ని ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వారితోపాటు శుక్రవారం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వీఆర్వో అర్హులైన వారి పేర్లు ఆన్‌లైన్‌ చేయకుండా అనర్హులను కొందరిని హక్కుదారులుగా చేర్చారని తెలిపారు. కొంతమంది రైతులను మభ్యపెట్టి, మరికొందరిని బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని వారు ఆరోపించారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో నష్టపరిహారం రూ.37లక్షలు దిగమింగే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తెల్లకాగితంపై సంతకాలు పెట్టించుకొని రాత్రికిరాత్రి రైతుల ఇష్టానికి వ్యతిరేకంగా భూమిని విడగొట్టి ఆన్‌లైన్‌ చేశారని పేర్కొన్నారు. వీఆర్వోపై కఠిన చర్యలు తీసుకొని అక్రమంగా ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అర్హులైన రైతులందరికీ సమానంగా భూమిని పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌ కనిగిరి ఆర్డీవో చేత సమగ్ర విచారణ చేయించి న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్యేతోపాటు గ్రామ రైతులు కిలారి శ్రీనివాసరావు, చేరెడ్డి పోతయ్య, భైరపునేని వెంకటనారాయణ, మందాడి బాలకోటయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-07-29T01:03:46+05:30 IST