పడకేసిన ప్రగతి

ABN , First Publish Date - 2023-04-12T00:53:29+05:30 IST

నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రగతి పూర్తిగా పడకేసింది. జిల్లాలో శాశ్వత అభివృద్ధి, ఉపాధి, మౌలికరంగాలకు సంబంధించిన పనులపై జగన్‌ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

పడకేసిన ప్రగతి

జిల్లా అభివృద్ధిపై జగన్‌ సర్కారు నిర్లక్ష్యం

పశ్చిమ ప్రాంతంలో జలఘోష

200 గ్రామాలకు ట్యాంకర్ల నీరే దిక్కు

వెలిగొండ పూర్తే పరిష్కారం

ఎండమావిని తలపిస్తున్న ప్రాజెక్టు

ఉపాధి, విద్య, వైద్యంపై ఉదాసీనత

పురోగతి లేని మెడికల్‌ కాలేజీ, గిరిజన ఆస్పత్రుల నిర్మాణం

ఊసేలేని ట్రిపుల్‌ ఐటీ, పారిశ్రామిక కారిడార్‌, నిమ్జ్‌

పలు శాఖల్లో వందల కోట్ల బకాయిలు

నీటి ట్యాంకర్ల బిల్లులూ ఇవ్వని దుస్థితి

నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వ కాలంలో ప్రగతి పూర్తిగా పడకేసింది. జిల్లాలో శాశ్వత అభివృద్ధి, ఉపాధి, మౌలికరంగాలకు సంబంధించిన పనులపై జగన్‌ సర్కార్‌ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. సాగు, తాగునీటి వనరులు.. విద్య, వైద్యం, ఉపాధి మార్గాల పెంపు కోసం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేవు. ఇది ప్రధానంగా పశ్చిమ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. అక్కడి ప్రజానీకం సాగు, తాగునీటి ఇక్కట్లు తీరడానికి శాశ్వత పరిష్కారం వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం. అయితే దాన్ని పూర్తిచేసే విషయంలో వైసీపీ సర్కారు మాటలకు, చేతలకు పొంతన లేదు. గత ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌ ప్రస్తుతం అడుగు ముందుకు పడలేదు. దోర్నాల వద్ద చేపట్టిన 131 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పునాదులకే పరిమితమైంది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద రెండేళ్ల క్రితం మంజూరైన మెడికల్‌ కాలేజీ నిర్మాణంలో పురోగతి కరువైంది. అసలు ఏ ఒక్కటీ సక్రమంగా ముందుకు సాగుతున్న పరిస్థితి లేదు.

ఒంగోలు, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. పునర్విభజన అనంతరం మిగిలిపోయిన జిల్లాలో పశ్చిమ ప్రాంతం అధికంగా ఉంది. అయితే అక్కడ సాగు, తాగునీటి వనరులతోపాటు విద్య, వైద్యం, ఉపాధి మార్గాలు ఏమీ లేవు. ఒకటి అరా ప్రారంభించినా ప్రస్తుత సర్కారు వాటిని నిర్లక్ష్యం చేసింది. భూగర్భజలాలే సాగు, తాగునీటికి పశ్చిమ ప్రాంత ప్రజలకు దిక్కు కాగా సరైన వర్షాలు లేక వెయ్యి అడుగుల లోతున తవ్విన బోర్లు సైతం ఒట్టిపోతున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ అంచనా ప్రకారం.. నీటి సమస్య అధికంగా ఉన్న మార్కాపురం, వైపాలెం నియోజకవర్గాల్లోని తొమ్మిది మండలాలతోపాటు దర్శిలోని మరో మూడు కలిపి 12 మండలాల్లో ఉన్న 556 ఆవాసాలలో ఈ వేసవిలో నీటి కోసం జనం తల్లడిల్లే పరిస్థితి. ఇప్పటికే ఆ 12 మండలాల్లో ఉన్న 5,252 చేతి పంపులలో 2,654 ఎండిపోయాయి. 370 డీప్‌బోర్లలో 232 పనిచేయడం లేదు. దాదాపు 300 చిన్న, మధ్య తరహా తాగునీటి పథకాలు మొరాయించాయి. దాదాపు 120 ఆవాసాలకు ప్రస్తుతం ట్యాంకర్లతో నీటిని తోలుతుండగా నెలాఖరుకు ఆ సంఖ్య 260కి పెరిగే అవకాశం ఉంది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక నీటి సరఫరా ట్యాంకర్ల బిల్లులు కూడా ఇవ్వలేదు. దీంతో తోలే వాళ్లు లేక అఽధికారులు అవస్థలు పడుతున్నారు.

వెలిగొండపై నీలినీడలు

వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులు అనుకున్న స్థాయిలో జరగలేదు. పైగా పూర్తయిన టన్నెల్‌ నుంచి నీటిని విడుదల చేయలేక చేతులెత్తేసింది. గత టీడీపీ ప్రభుత్వం చూపిన చొరవ, చేపట్టిన కీలక పనులతో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏడాదిన్నరలోనే తొలి టన్నెల్‌ తవ్వకం పూర్తయ్యింది. దానికి అనుబంధంగా ఉన్న పెండింగ్‌ పనుల పూర్తిలో ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో నేటికీ నీటిని తీసుకునే అవకాశం లేకుండాపోయింది. నిజానికి తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రాజెక్టును పూర్తిచేసి నీరిస్తామని ప్రతిపక్ష నేతగా పలు మార్లు చెప్పిన జగన్‌ అధికారంలోకి వచ్చాక తొలుత హడావుడి ప్రదర్శించి అనంతరం నిర్లక్ష్యం చేశారు. వైసీపీ ప్రభుత్వ నాలుగేళ్ల కాలంలో నిధులు మంజూరు చేయక ప్రాజెక్టు పనులు, నిర్వాసితుల పునరావాస చర్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌లో రూ.3,902 కోట్లు కేటాయింపులు చూపిన ప్రభుత్వం ఆచరణలో కేవలం 23.84శాతంతో రూ.932 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. రెండేళ్ల క్రితం నిర్వాసితులకు పరిహారం, పునరావాస చర్యలకు రూ.1,300 కోట్లకు జీవో జారీ చేసినా ఇంతవరకూ నిధులు ఇవ్వలేదు. మరోవైపు ఇంకా పెద్దఎత్తున భూసేకరణ, కాలనీల్లో సౌకర్యాల కల్పన, రెండో టన్నెల్‌ తవ్వకం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటికీ మరో రూ.3,600 కోట్ల వరకు అవసరమని తెలుస్తుండగా 2023-24 బడ్జెట్‌లో కేవలం రూ.101కోట్లు మాత్రమే కేటాయించారు. పైగా ఆగస్టుకు తొలి టన్నెల్‌, డిసెంబర్‌కు రెండో టన్నెల్‌ నుంచి కూడా నీరిస్తామని బూటకపు మాటలు చెప్తున్నారు. వాస్తవానికి తొలి టన్నెల్‌ పూర్తయిన వెంటనే నిర్వాసితులను తరలించి ఉంటే ప్రాజెక్టులోకి రెండేళ్ల క్రితమే నీరు తీసుకునే అవకాశం ఉండేది. అలా చేసి ఉంటే మొత్తం పశ్చిమప్రాంతంలో భూగర్భజలాలు గణనీయంగా పెరిగి తాగునీటి ఇక్కట్లు తీరేవి.

ఎక్కడి నిర్మాణాలు అక్కడే!

మరోవైపు ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన వివిధ రకాల భవన నిర్మాణాలు నిధుల కొరతతో ముందుకు సాగడం లేదు. పలు ఇతర శాఖల్లోనూ భారీగా బిల్లులు పెండింగ్‌లో పెడుతుండటంతో ఎవరూ పనులు చేయని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఉపాధి మెటీరియల్‌ నిధుల భాగస్వామ్యంతో జిల్లాలో 591 సచివాలయాలు, 593 ఆర్‌బీకేలు, 492 హెల్త్‌క్లినిక్‌ల భవనాలు 2019-20లో మంజూరుచేయగా ఇప్పటివరకు 397 సచివాలయాలు, 340 ఆర్‌బీకేలు, 222 హెల్త్‌క్లినిక్‌లు పూర్తయినట్లు చెప్తున్నారు. మిగిలిన వాటిలో కొన్ని అసంపూర్తిగా, మరికొన్ని పునాదులలో ఉన్నాయి. అనంతరం డిజిటల్‌ లైబ్రరీలు, మిల్క్‌సెంటర్‌ భవనాలు మంజూరు చేయగా వాటి నిర్మాణాలూ ముందుకు సాగడం లేదు. ఇక ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, జలవనరుల శాఖల పరిధిలో ఏ ఒక్క పనికీ బిల్లులు ఇస్తున్న పరిస్థితి లేదు. మెట్ట రైతులకు ఎంతో ఉపకరించే మైక్రో ఇరిగేషన్‌ (బిందుసేద్యం), జలసిరి పథకాలను కూడా ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గత ప్రభుత్వంలో 90శాతం సబ్సిడీతో బిందుసేద్యం పరికరాలను ఏటా 20వేల ఎకరాలకు ఇవ్వగా ఈ ప్రభుత్వం వచ్చాక మూడేళ్లు దాని ఊసే ఎత్తలేదు. 2022-23లో మేల్కొని పంపిణీ చేపట్టినా తొలుత 16వేల ఎకరాలు లక్ష్యంగా పెట్టి తర్వాత 8 వేలకు తగ్గించారు. ఇక జలసిరి పథకం దాదాపుగా నిలిచిపోయింది. దీని వల్ల ప్రధాన లబ్ధి పశ్చిమప్రాంత రైతులకు కాగా వారికి అసలు అందడం లేదు.

మెడికల్‌ కాలేజీ నత్తనడక

మరోవైపు పశ్చిమ ప్రాంతంతోపాటు జిల్లా మొత్తానికి ఉపాధి పెంపు, అభివృద్ధికి ఉపకరించే పారిశ్రామిక వాడలు, విద్య, వైద్యం ఇతర మౌలికరంగాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. గత ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న దొనకొండ పారిశ్రామిక కారిడార్‌, కేంద్ర భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే కనిగిరి ప్రాంతంలో నిమ్జ్‌ ఏర్పాటు అడుగు ముందుకు పడలేదు. కనీసం ఆ ప్రాంతంలో గత ప్రభుత్వం చేపట్టిన ఎంఎస్‌ఎంఈ పార్కులు (చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు) పనులు కూడా నిలిచిపోయాయి. ఇక జిల్లాకు ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్‌ఐటీ, ఆంధ్రకేసరి యూనివర్సిటీల నిర్మాణానికి ఒక్క రూపాయి ఇవ్వక ఒక్క ఇటుక కూడా ఈ ప్రభుత్వ కాలంలో పెట్టలేదు. వైద్యరంగ అభివృద్ధిలో భాగంగా దోర్నాల వద్ద నాబార్డు ఆర్థిక సహాయంతో రూ.50కోట్ల వ్యయంతో చేపట్టిన 131 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పునాదులకే పరిమితమైంది. మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద రెండేళ్ల క్రితం మంజూరైన మెడికల్‌ కాలేజీ పునాదుల దశను దాటలేదు. కనీసం దాని నిర్మాణానికి నిధులు కూడా పెద్దగా విడుదల చేయలేదు. పశ్చిమప్రాంతంలో గత ప్రభుత్వం మంజూరు చేసి, శంకుస్థాపన కూడా చేసిన భారీ తాగునీటి పథకాన్ని మార్పుచేసి రెండేళ్ల క్రితం వాటర్‌గ్రిడ్‌ పేరుతో రూ.1,200 కోట్ల పథకాన్ని వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఆ పథకం పనులు ఏమాత్రం కదలిక లేకపోగా జిల్లావ్యాప్తంగా ఇంటింటికీ కొళాయి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ వాటాతో చేపట్టిన జలజీవన్‌ మిషన్‌ పనుల్లోనూ పురోగతి కరువైంది.

రూ.కోట్లలో బిల్లులు పెండింగ్‌

భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండటం తీవ్ర ప్రతిబంధకంగా మారింది. గత ప్రభుత్వంలో చేసిన పనుల బిల్లులను ఈ ప్రభుత్వం రాగానే ఆపేయగా కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. అదేసమయంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన పనుల బిల్లులు కూడా ఇవ్వలేదు. అత్యవసరమైన తాగునీటి బిల్లులనూ పెండింగ్‌లో ఉంచింది. జిల్లాలో ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలో 2019 నుంచి 2023 అక్టోబరు వరకు రూ.132 కోట్ల మేర తాగునీటి బిల్లులు రావాల్సి ఉండగా అర్బన్‌ ప్రాంతాల్లో మరో రూ.26.46 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అలాగే 50 సీపీడబ్ల్యూ స్కీంలకు రూ.100 కోట్ల విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. గ్రామస్థాయిలో వివిధ భవనాలకు రూ.31.31 కోట్లు పెండింగ్‌తో ఆ పనులు సాగడం లేదు. జలజీవన్‌ మిషన్‌ పనులకు రూ.30 కోట్ల బకాయిలు ఉన్నాయి. చివరకు గతేడాది వెలిగొండకు చేసిన వ్యయమే రూ.174 కోట్లు కాగా అందులోనూ రూ.49 కోట్లు పెండింగ్‌ ఉంది. పశుసంవర్థకశాఖలో పశుబీమా, అలాగే గడ్డి, మందుల సరఫరా వంటి వాటికి రెండేళ్లుగా నిధులు ఇవ్వక రూ.28కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధికి నోచక కనీసం తాగేందుకు కూడా గుక్కెడు నీరు దొరక్క జనం తల్లడిల్లుతున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితి ఉన్న మార్కాపురం డివిజన్‌ కేంద్రానికి బుధవారం సీఎం జగన్మోహన్‌రెడ్డి వస్తున్నారు. తమ ప్రాంత సమస్యలపై ఆయన స్పందించాలని ప్రజానీకం కోరుకుంటున్నారు.

Updated Date - 2023-04-12T00:53:32+05:30 IST