తాగునీటి సమస్య నానాటికి తీవ్రతరం
ABN , First Publish Date - 2023-06-02T01:00:08+05:30 IST
మండలంలో మంచినీటి బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో ప్రజలు నీటికోసం ట్యాంకర్లుపైనే ఆధారపడుతున్నారు.
ఎర్రగొండపాలెం, జూన్ 1 : మండలంలో మంచినీటి బోర్లలో భూగర్భ జలమట్టం పడిపోయింది. దీంతో ప్రజలు నీటికోసం ట్యాంకర్లుపైనే ఆధారపడుతున్నారు. భూగర్భ జలమట్టం బోర్లలో అడుగుంటుతుండడంతో రోజు రోజుకు తాగునీటి సమస్య పెరుగుతోంది. మండలంలో ఇప్పటికీ నిత్యం 220 ట్యాంకర్ల నీటిని ప్రజలకు వ్యవసాయ బోర్లనుంచి సేకరించి సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు వచ్చిన సమయంలో ప్రజలు బిందెడు నీటికోసం పడిగాపులు కాచి నీళ్లు పట్టుకోవాల్సి వస్తోంది.
మండలంలో అమానిగుడిపాడు గ్రామంలో 25 ట్యాంక ర్లు, అయ్యంబొట్లపల్లి 15 ట్యాంకర్లు, చిన్నబోయలపల్లి 8, చిన్నకొలుకుల 5, చెన్నరాయునిపల్లి12, గంగుపల్లి 15, , గుర్రపుసాల 12 ట్యాంకర్లు, వాదంపల్లి 18 ట్యాంకర్లు, కాశికుంటతాండ 8, మెట్టబోడుతాండ 2, పిల్లికుంట 2 మొగుళ్లపల్లి 5, రేగులపల్లి 5, మిల్లంపల్లి పంచాయతిలో వీకే.నగర్ 14, మురారిపల్లె 35 ట్యాంకర్లు, వీరభద్రాపురం 10, ఇందిరమ్మకాలనీ 8, తమ్మడపల్లి గ్రామంలో 20 ట్యాంకర్లు నీటిని ఆర్,డబ్ల్యుఎస్ శాఖ ద్వారా సర్పంచులు సరఫరా చేస్తున్నారు. వర్షాలు కురిస్తే తాగునీటి బోర్లలో భూగర్భజలాలు పెరుగుతాయని ప్రజలు వర్షాలు కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురిసేనా తాగునీటి సమస్య పరిష్కారం అయ్యేనా అన్నట్లుగా.., తాగునీటి సమస్య నెలకొంది.
నియోజకవర్గంలోని ఐదు మండలాలలో 2019 నుంచి 2023 ఇప్పటి వరకు రూ.65.40 కోట్లు తాగునీటి సరఫరా అద్దె ట్యాంకర్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు గురువారం తెలిపారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని ఐదు మండలాలలో నీటి సరఫరా ట్యాంకర్లు బిల్లులు అప్‌లోడ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఏఈ వివరణ
ఈ నెలలో వర్షాలు కురిసి భూగర్బజల మట్టం బోర్లలో పెరిగితే ట్యాంకర్లు సంఖ్య తగ్గిస్తాం. అప్పటి వరకు ఇబ్బంది లేకుండా నీటిని సరఫరా చేస్తాం.