Rains: రాయలసీమలో వర్షాలు
ABN , First Publish Date - 2023-04-21T21:35:53+05:30 IST
విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి.
విశాఖపట్నం: విదర్భ నుంచి తెలంగాణ (Telangana), రాయలసీమల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం మేఘాలు ఆవరించాయి. రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమ (Rayalaseema)లో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 25వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులు కూడా వీస్తాయని పేర్కొంది.
కాగా గడచిన పది రోజుల నుంచి ఠారెత్తించిన ఎండలు, వడగాడ్పులు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. అనకాపల్లి, ఏలూరు (Anakapalli Eluru), కాకినాడ జిల్లాల్లో పది మండలాల్లో వడగాడ్పులు వీచాయి. అనేకచోట్ల 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం కడప జిల్లా కమలాపురంలో 42.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు, మూడు రోజుల్లో వడగాడ్పుల ప్రభావం ఉండదని, అయితే మేఘాలు ఆవరించని ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.