నారావారిపల్లెలో వెల్లివిరిసిన సంక్రాంతి శోభ

ABN , First Publish Date - 2023-01-14T20:53:08+05:30 IST

నారావారిపల్లె (Naravaripalli)లో శనివారం సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో శనివారం భోగి పండగ సంబరాలు అంబరాన్నంటాయి...

నారావారిపల్లెలో వెల్లివిరిసిన సంక్రాంతి శోభ

నారావారిపల్లె: నారావారిపల్లె (Naravaripalli)లో శనివారం సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడంతో శనివారం భోగి పండగ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా సంక్రాంతిని పురస్కరించుకుని నారావారిపల్లెలోని టీటీడీ కల్యాణమండపంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Bhuvaneshwari), కోడలు బ్రాహ్మణి ముగ్గులను పరిశీలించి విజేతలకు బహుమతులందజేశారు. మహిళలు గొబ్బెమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతుంటే భువనేశ్వరి, బ్రాహ్మణి వారితో కలిసి తెలుగువారి సంక్రాంతి సాంప్రదాయాన్ని అనుసరించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా తన అత్తగారింట్లో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. మన సంప్రదాయాలను ఎవరూ మరిచిపోరాదని, నిత్యం హడావిడి జీవితాన్ని పక్కనపెట్టి ఈ ఐదారు రోజులు సంతోషంగా అందరితో కలిసి పండుగలు చేసుకోవాలని సూచించారు. బ్రాహ్మణి మాట్లాడుతూ ఆట, పాటలతో పండుగను జరుపుకోవడం ఆనందంగా ఉందని, అందులో భాగంగానే ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. మన పిల్లలకు సంస్కృతి, సాంప్రదాయాలను అలవాటు చేయడమంటే వారికి సంస్కారం కూడా నేర్పించినట్లవుతుందన్నారు. తన తండ్రి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి (Veerasimha Reddy) సినిమాను చంద్రగిరిలో శనివారం మధ్యాహ్నం చూసి ఎంజాయ్‌ చేశానని చెప్పారు.

ఎడ్లబండిపై నారా దేవాన్ష్‌ హల్‌చల్‌

చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్‌ (Nara Devansh) సంక్రాంతి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. గతంలో తన తాతయ్య, నాన్నమ్మ చేతులు పట్టుకుని వారి వెంట నడిచిన దేవాన్ష్‌ ఈసారి తానే ఎడ్లబండిపైకి ఎక్కి హల్‌చల్‌ చేశాడు. తలపాగా కట్టుకుని పిల్లలతో కలిసి ఎడ్లబండిపై రావడం గ్రామస్తులను ఆకట్టుకుంది.

Updated Date - 2023-01-14T20:54:24+05:30 IST