AP News: ఏపీలో రసాభాసగా మారిన సర్పంచ్‌ల ముట్టడి..

ABN , First Publish Date - 2023-07-03T12:02:21+05:30 IST

ఏపీలో సర్పంచ్‌ల ముట్టడి కార్యక్రమం రసాభాసగా మారింది.

AP News: ఏపీలో రసాభాసగా మారిన సర్పంచ్‌ల ముట్టడి..

అమరావతి: ఏపీలో సర్పంచ్‌ల ముట్టడి కార్యక్రమం రసాభాసగా మారింది. ఏపీ సర్పంచ్‌ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ కమిషనరేట్ ముట్టడి పిలుపునివ్వగా... ఒక్కసారిగా సర్పంచ్‌లు వందలాది మంది పంచాయతీరాజ్ కమిషనరేట్ వైపు దూసుకొచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు.. సర్పంచులను ఎత్తి వెహికల్స్‌లోకి ఎక్కించారు. 15 ఆర్థిక సంఘం నిధులు వచ్చి 40 రోజులు అవుతున్నా నేటికీ విడుదల కాకపోవడంపై సర్పంచులు ఆందోళనకు దిగారు. తాము కూడా ముఖ్యమంత్రి జగన్‌లాగా ప్రజలు ఎన్నుకుంటేనే గెలిచామని... మీరంతా పార్టీ గుర్తుపై గెలిస్తే మేం మాత్రమే ప్రజల ఆమోదంతో గెలిచామని చెప్పుకొచ్చారు.

రాత్రి అయితే సర్పంచ్‌లకు నిద్ర ఉండటం లేదని, నెలల తరబడి గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు పెండింగ్లు ఉంటున్నాయని తెలిపారు. నిద్ర పట్టక మాత్రలు వేసుకున్నా ఫలితం ఉండడం లేదన్నారు. తక్షణం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.691 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీలు సర్పంచ్‌ల ఆధీనంలో గ్రామ సచివాలయాల కార్యకలాపాలు జరగాలన్నారు. సర్పంచుల గౌరవ వేతనాన్ని రూ.3000 నుంచి రూ.15 వేలుకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మైనర్ పంచాయతీల కరెంట్ బిల్లులు తాగునీటి సరఫరా వీధిలైట్లు పూర్తి బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. గ్రామ సచివాలయాలపై వచ్చే ఆదాయాన్ని పంచాయతీల ఖాతాల్లోనే వేయాలని పట్టుబడ్డారు. గిరిజన తండాలకు ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. గ్రామపంచాయతీల్లో గ్రీన్ అంబాసిడర్ జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సర్పంచ్‌లు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-07-03T12:02:21+05:30 IST