Share News

పీహెచ్‌సీల్లో.. ఆరోగ్యమిత్రలేరీ?

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:14 AM

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యమిత్రలు లేక.. వైద్యసేవలపై ప్రభావం పడుతోంది. రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా సక్రమంగా సేవలు పొందేందుకు ఆరోగ్య మిత్రలు దోహదపడేవారు.

పీహెచ్‌సీల్లో.. ఆరోగ్యమిత్రలేరీ?
కొలిగాం పీహెచ్‌సీ

- వైద్య సేవలపై ప్రభావం

(ఇచ్ఛాపురం రూరల్‌)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యమిత్రలు లేక.. వైద్యసేవలపై ప్రభావం పడుతోంది. రోగులు ఆరోగ్యశ్రీ ద్వారా సక్రమంగా సేవలు పొందేందుకు ఆరోగ్య మిత్రలు దోహదపడేవారు. ప్రభుత్వం పీహెచ్‌సీల నుంచి ఇటీవల వారిని తొలగించి.. సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులతో పాటు నెట్‌వర్క్‌ వైద్యశాలలకు సర్దుబాటు చేసింది. ఆరోగ్యమిత్రల బాధ్యతలను స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బందికి అప్పగించింది. దీంతో రెండు విధాలా వైద్య సేవల్లో లోపం తలెత్తుతోంది. జిల్లాలో 66 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. గతంలో ప్రతీ పీహెచ్‌సీతో పాటు అన్ని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యమిత్రలు ఉండేవారు. ప్రస్తుతం జిల్లాలో 99 మంది ఆరోగ్యమిత్రలు ఉండగా.. పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నవారిని సీహెచ్‌సీలు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులకు సర్దుబాటు చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల రోగులు ఆరోగ్యశ్రీ సేవలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద లబ్ధి పొందాలన్నా అవస్థలు పడాల్సి వస్తోంది. పీహెచ్‌సీల్లో ఆరోగ్యమిత్రలు అందుబాటులో లేకపోవడంతో ఆ భారం స్టాఫ్‌నర్సులు, సచివాలయ ఏఎన్‌ఎంలపై పడింది. వాస్తవంగా స్టాఫ్‌నర్సులు కాన్పులు, కుటుంబ నియంత్రణ, రోగుల బాగోగులతో పాటు ఇతర పనులు పర్యవేక్షించాలి. ఏఎన్‌ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూ.. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత యాప్‌లో నమోదు చేయాలి. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇప్పటికే సుమారు 72యాప్‌లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో తమపై అధిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ప్రతీ పీహెచ్‌సీలో రోజూ సుమారు 50 నుంచి 70 మంది వరకు ఓపీ నమోదవుతోంది. రోగులకు సేవలందిస్తూ యాప్‌లో నమోదు, ఇతర సర్వేలతో సతమతమవుతుండటంతో ఆ ప్రభావం పీహెచ్‌సీల్లో ఆరోగ్యశ్రీ సేవలపై పడుతోంది.

ప్రభుత్వ నిర్ణయం మేరకే.. :

ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆరోగ్యమిత్రలను ఇతర వైద్యశాలలకు సర్దుబాటు చేశాం. వారి బాధ్యతలను స్టాఫ్‌నర్సులకు అప్పగించాం. ఆరోగ్యశ్రీ సేవలు పొందాలనుకునేవారు వైద్యశాలల్లో సంప్రదించాలి. గ్రామీణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

- పొగిరి ప్రకాశరావు, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త

Updated Date - Dec 17 , 2023 | 12:14 AM