బాబోయ్‌.. ప్రాణాలు తీస్తున్నాయ్‌

ABN , First Publish Date - 2023-04-24T00:18:43+05:30 IST

పట్టణాల నుంచి పల్లె ప్రజల వరకు కుక్కలు టెన్షన్‌ పెడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా స్వైరవిహారం చేస్తూ భయపెడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు లేదా మూగజీవాలపై కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. కొందరు కొద్దిపాటి గాయాలతో బయటపడగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.

బాబోయ్‌.. ప్రాణాలు తీస్తున్నాయ్‌
పాతఖండ్యాం కూడలి వద్ద గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు

- జిల్లాలో స్వైరవిహారం చేస్తున్న కుక్కలు

- దాడులతో భయపడుతున్న ప్రజలు

- కానరాని నియంత్రణ చర్యలు

(ఆంధ్రజ్యోతి బృందం)

- తెలంగాణలోని ఖమ్మం జిల్లా పెదగోపతి గ్రామంలో 13 నెలల చిన్నారిపై ఫిబ్రవరి 22న కుక్కలు దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది.

.............

- తాజాగా ఈ నెల 21న జి.సిగడాం మండలం మెట్టవలస కూడలిలో ఏడాది చిన్నారి సాధ్విక కుక్కల దాడిలో బలైపోయింది. ఈ సంఘటన కూడా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బయట మంచంపై నిద్రిస్తున్న చిన్నారిని కుక్కలు చిదిమేశాయని తెలుసుకుని ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనుకున్నారు.

.............

- ఇదే తరహా ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. పట్టణాల నుంచి పల్లె ప్రజల వరకు కుక్కలు టెన్షన్‌ పెడుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా స్వైరవిహారం చేస్తూ భయపెడుతున్నాయి. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రజలు లేదా మూగజీవాలపై కుక్కలు దాడి చేస్తూనే ఉన్నాయి. కొందరు కొద్దిపాటి గాయాలతో బయటపడగా.. మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడంతో లెక్కకు మిక్కిలిగా పెరుగుతున్నాయి. రాత్రి అయితే కొన్ని ప్రాంతాల్లో కుక్కలకు భయపడి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.

జిల్లాలో ఘటనలివీ..

జి.సిగడాం: జి.సిగడాం మండలంలో ఏ గ్రామంలో చూసినా.. వీధికుక్కలు గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. మండలంలో కుక్క కాటు బాధితులు వందల సంఖ్యలో ఉన్నారు. జి.సిగడాం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో 2022 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి వరకు 202మంది, బాతువ సీహెచ్‌సీ పరిధిలో 255 మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. వీరికి వైద్యులు వ్యాక్సిన్‌ వేశారు. కుక్కల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

రణస్థలం: ఎచ్చెర్ల నియోజకవర్గంలో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. రణస్థలం మండలంలోని రామతీర్థం జంక్షన్‌, కొండములగాం, కోష్ట జంక్షన్‌, పైడిభీమవరం, రణస్థలం, సినిమా థియేటర్‌ జంక్షన్‌ల్లో అధిక సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. పరిశ్రమల్లో పనులు చేసుకొని ఇంటికి వస్తున్న కార్మికులపై నిరంతరం ఇవి దాడి చేస్తున్నాయి. రణస్థలం, పాతర్లపల్లి, కొచ్చెర్ల, తదితర గ్రామాల పరిధిలో చాలామంది కుక్కల దాడికి గురయ్యారు. లావేరు మండలంలోని సుభద్రాపురం, లావేరు, లావేటిపాలెం, అదపాక, బుడుమూరు, మురుపాలక తదితర గ్రామాల్లో శునకాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. గత మూడు నెలలుగా కుక్కల కాటుకు గురైనవారిని పరిశీలిస్తే.. కొండములగాం సీహెచ్‌సీ పరిఽదిలో 120 మంది, పాతర్లపల్లి, రావాడ పీహెచ్‌సీల పరిధిలో 300 మంది, మురపాక, లావేరు పీహెచ్‌సీల పరిధిలో 130 మంది, ఎచ్చెర్ల, పొన్నాడ పీహెచ్‌సీల పరిధిలో 125 మంది, జి.సిగడాం పీహెచ్‌సీ పరిధిలో 80 మంది ఉన్నట్లు గణంకాలు చెబుతున్నాయి.

పొందూరు: పొందూరులో కూడా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి. గతంలో ఓ చిన్నారి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. 2017లో దళ్లిపేటకు చెందిన బాకి స్పందన(8).. పొలం పనుల్లో ఉన్న తన తాతకు టీ తీసుకెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా మార్గమధ్యంలో కుక్కలు దాడి చేశాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందింది. అలాగే ఐదేళ్ల కిందట తండ్యాంలో గొర్రెలమందపై కుక్కలు దాడిచేశాయి. ఈ దాడిలో సుమారు 12 గొర్రెపిల్లలు మృత్యువాత పడ్డాయి.

నందిగాం: నందిగాం, పెంటూరు, బడబంద, కాపు తెంబూరు, సింగుపురం, హుకుంపేట, మల్లివీడు, సుభద్రాపురం తదితర గ్రామాల్లో కుక్కకాటుకు గురై పలువురు ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల నందిగాంకు చెందిన ఏ.భాస్కరరావు, పి.మహేంద్ర, రవికుమార్‌, ఎ.జానికమ్మపై కుక్కలు దాడిచేశాయి. అలాగే పశువుల శాలలోకి చొరబడి మూగజీవాలపై కూడా దాడి చేశాయి.

పోలాకి: పోలాకి పీహెచ్‌సీ పరిధిలో ఈ నెలలో సుమారు 45 మందికి కుక్కలు కాటువేశాయి. వారందరికీ యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌ వేసి.. చికిత్స అందజేశామని పీహెచ్‌సీ వైద్యాధికారి బి.శ్రీనాథ్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. కుక్క కాటు వేస్తే తొలిరోజున జీరో డోస్‌ టీటీ, మూడురోజుల తర్వాత రెండో డోస్‌, ఏడు రోజుల తర్వాత మూడో డోస్‌, 28 రోజుల తర్వాత నాలుగో డోస్‌ వాక్సిన్‌ వేస్తామన్నారు. కుక్కకాటు వాక్సిన్‌ కొరత లేదన్నారు. పెంపుడు కుక్కల వద్దకు చిన్నారులను తీసుకువెళ్లవద్దని సూచించారు. ఇదిలా ఉండగా శనివారం ఉదయం దీర్గాశి గ్రామానికి చెందిన ఎం.లక్ష్మణరావుకు పెంపుడు కుక్క కరిచింది. దీంతో వైద్యులు వాక్సిన్‌ వేశారని బాధితుడు తెలిపాడు.

టెక్కలి రూరల్‌: టెక్కలిలో ఎన్టీఆర్‌ కాలనీ, ఆదిఆంధ్రా వీధి, మండాపోలం కాలనీ తదితర ప్రాంతాలతో పాటు పలు గ్రామాల్లో కుక్కలు సంచారం రోజురోజుకు ఎక్కువవుతోంది. గత ఏడాది అక్టోబర్‌ 25న టెక్కలి, నందిగాం మండలంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. టెక్కలి మండలం సతివానిపేటకి చెందిన నక్క కృష్ణ, నందిగాం మండలం పెంటూరుకి చెందిన ఎస్‌.నవదీప్‌ అనే 6వ తరగతి విద్యార్థిని పిచ్చికుక్కలు గాయపరిచాయి. దీంతో టెక్కలి జిల్లా ఆసుపత్రిలో వారు చికిత్స పొందారు. టెక్కలిలో వీధికుక్కల నియంత్రణకు చర్యలు మచ్చుకైనా చేపట్టడంలేదు.

Updated Date - 2023-04-24T00:18:43+05:30 IST