Share News

ఖరీఫ్‌ నష్టమే!

ABN , First Publish Date - 2023-10-21T00:00:08+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌.. రైతులను కష్టాల పాల్జేసింది. వర్షాభావ పరిస్థితులతో శివారు ప్రాంత భూములకు నీరందక సాగు ప్రశ్నార్థకమవుతోంది. పొలాలు నెర్రెలు చాస్తూ పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఖరీఫ్‌ నష్టమే!
మెళియాపుట్టి : పెద్దపద్మాపురంలో మాడిపోయిన వరి పంట

- జిల్లాను వెంటాడుతున్న వర్షాభావం

- ఇప్పటికి 18.2శాతం లోటు వర్షపాతం

- శివారు భూములకు అందని సాగునీరు

- వాడుముఖం పట్టిన వరి పొలాలు

- కాపాడుకునేందుకు రైతన్నల పాట్లు

(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)

ఖరీఫ్‌ సీజన్‌.. రైతులను కష్టాల పాల్జేసింది. వర్షాభావ పరిస్థితులతో శివారు ప్రాంత భూములకు నీరందక సాగు ప్రశ్నార్థకమవుతోంది. పొలాలు నెర్రెలు చాస్తూ పొట్ట దశలో ఉన్న వరి పంట ఎండిపోతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటను బతికించుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. వంశధార, నారాయణపురం ఆనకట్టల నుంచి.. అలాగే చెరువుల నుంచి వ్యవసాయం కోసం సాగునీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది శివారు భూములకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. పలాస, టెక్కలి, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉంది. సాగునీటి కోసం జిల్లాపరిషత్‌ సర్వసభ్య సమావేశాల్లోనూ.. మండల పరిషత్‌ సమావేశాల్లోనూ ప్రజాప్రతినిధులు గొంతెత్తి వినిపిస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చెరువులు, గెడ్డలు, వాగులు, నేల బావుల్లో నీటివనరులను ఇంజన్ల ద్వారా పొలాలకు మళ్లిస్తున్నారు. అయినా పంట దక్కుతుందన్న ఆశ లేదని వాపోతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు.

- 18.2శాతం లోటు వర్షపాతం

ఈ ఏడాది వర్షాకాలం దాదాపు ముగిసినట్లే. ఈ వర్షాకాలంలో జూన్‌ 1 నుంచి ఇప్పటివరకూ 873.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా.. 714.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నెలలో ఇప్పటివరకూ 177.5 మి.మీ వర్షపాతానికి గానూ 15.5 మి.మీ మాత్రమే కురిసింది. సరాసరి జిల్లాలో 18.2 శాతం లోటు వర్షపాతం ఏర్పడింది.

అన్ని ప్రాంతాల్లోనూ అవస్థలే:

- టెక్కలి మండలంలో నర్శింగపల్లి, ముఖలింగపురం, గూడెం, మేఘవరం, లింగాలవలస పంచాయతీల్లో రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.

- నందిగాం మండలంలో 20వేల ఎకరాల్లో వరిసాగు చేపట్టారు. వర్షాభావ పరిస్థితుల్లో పొట్ట దశలో ఉన్న చేను ఎండిపోతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నారాయణపురంలో చెరువులు, బావుల్లోనూ నీరు అడుగంటిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి విడిచి పెడుతున్నారు.

- సోంపేట మండలంలో పలాసపురంలో సనపల మన్మథరావు అనే రైతు సాగునీరు అందించలేక.. తన పొలంలో వరినారును పశువుల మేతకు అప్పగించేశారు. అలాగే కంచిలి మండలం జాడుపూడి పంచాయతీ బసవపుట్టుగ వద్ద పొలాలు బీటలు తేరాయి.

- సంతబొమ్మాళి మండలం మేఘవరం, మరువాడ, లింగుడు, నౌపడ, మర్పిపాడు పంచాయతీల్లో సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. చెరువుల్లో మోటార్ల ద్వారా నీటిని మళ్లించి పంటను కాపాడుకుంటున్నారు.

- మెళియాపుట్టి మండలంలో సుమారు 1500 హెక్టార్లలో వరి పంట మాడిపోయింది. పెద్దపద్మాపురం వద్ద వరి పంట కాలిపోయినట్లుగా కనిపిస్తోంది.

- పాతపట్నం మండలంలో అత్యధికగా వరి ఎద సాగుచేశారు. కనీసస్థాయిలో వర్షాలు కురవకపోగా.. వేసవిని తలపించేలా ఎండలు కాస్తుండడంతో పంటలు ఎండిపోయాయి. చెరువుల్లో నీటిని ఇంజన్ల ద్వారా పొలాలకు మళ్లిస్తున్నా ఫలితం లేకపోతోందని రైతులు వాపోతున్నారు.

- పలాస మండలం టెక్కలిపట్నం,మోదుగులపుట్టి ప్రాంతంలో వరినారు ఎండిపోయి దుర్భర స్థితిలో ఉంది. మరో వారం రోజుల్లో వర్షాలు కురవపోతే తమకు తీవ్ర నష్టం తప్పదని ఆవుగాన షణ్ముఖరావు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-21T00:00:08+05:30 IST