‘స్థానిక’ ఎమ్మెల్సీగా నర్తు రామారావు
ABN , First Publish Date - 2023-03-17T00:36:28+05:30 IST
శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. ఈ నెల 13న పోలింగ్ జరగ్గా, గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు.
632 ఓట్లతో విజయం
ఎచ్చెర్ల/ఆమదాలవలస, మార్చి 16: శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపొందారు. ఈ నెల 13న పోలింగ్ జరగ్గా, గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిర్వహించారు. జిల్లాలో స్థానిక సంస్థల నుంచి 776 ఓట్లు ఉండగా, 752 మంది ప్రజాప్రతినిధులు ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇందులో నర్తు రామారావుకు 632 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఆనెపు రామకృష్ణకు 108 ఓట్లు లభించాయి. 12 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎన్నికల పరిశీలకుడు హనుమంతు అరుణ్‌కుమార్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్, జేసీ, రిటర్నింగ్ అధికారి ఎం.నవీన్‌ల సారధ్యంలో స్ట్రాంగ్‌రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను బయటకు తీసి.. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. ఎస్పీ జీఆర్ రాధిక సారథ్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. లెక్కింపు అనంతరం అధికారులు నర్తు రామారావుకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. నర్తు రామారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవితో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.
- ఫలితాల అనంతరం ఇండిపెండెంట్ అభ్యర్థి ఆనెపు రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రతినిధులకు నిధులు, విధులు, హక్కుల, గౌరవ వేతనం ఇవ్వకపోవడంతో వారి వాణి వినిపించడానికి పోటీ చేశాను. ఓడిపోతానని ముందే తెలుసు. అయినా ప్రజాప్రతినిధుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలనే ఉద్దేశంతో బరిలో దిగాను. ఈ ఎన్నికలో నాకు ఓటు వేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.