Share News

జిల్లాకు ఒక్కటే!

ABN , Publish Date - Dec 18 , 2023 | 12:15 AM

జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్‌యోజన రోడ్ల మంజూరులో ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క రోడ్డు కేటాయించడంపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు.

జిల్లాకు ఒక్కటే!
మందస మండలం సవరతులసిగాం రోడ్‌ దుస్థితి

- ప్రధానమంత్రి సడక్‌ యోజన రోడ్ల మంజూరు తీరిది

- సీఎం సొంత జిల్లాకు 35, చిత్తూరుకు 15 కేటాయింపు

- జిల్లాలో దారుణంగా రహదారులు

- అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు

- ప్రభుత్వ తీరుపై విమర్శలు

(కాశీబుగ్గ)

మందస మండలం సవర తులసిగాం రహదారి నిర్మాణానికి 2020 ఫిబ్రవరి 12న మంత్రి కాక ముందు.. ఎమ్మెల్యే హోదాలో డాక్టర్‌ సీదిరి అప్పలరాజు శంకుస్థాపన చేశారు. కానీ పనులు మాత్రం పూర్తికాలేదు. కాంట్రాక్టర్‌ అరకొరగా పనులు చేపట్టి మధ్యలో వదిలేశారు. దీంతో పదుల సంఖ్యలో గిరిజన గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రహదారిని పట్టించుకునే వారు కరువయ్యారని ఆవేదన చెందుతున్నారు.

.......................

మందస రైల్వేస్టేషన్‌ సమీపంలో హరిపురం వెళ్లే పాత జాతీయ రహదారి... గోతులమయంగా మారింది. వాహనదారులు తరచూ ఇక్కడ గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

...................

జిల్లాలో రహదారులు అధ్వానంగా ఉన్నా.. పాలకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సడక్‌యోజన రోడ్ల మంజూరులో ఉమ్మడి జిల్లాకు ఒకే ఒక్క రోడ్డు కేటాయించడంపై జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. వైసీపీ నేతలకు చిత్తశుద్ధి కరువైందని, వారు చేసే ప్రకటనలు ఉత్తిమాటలుగా మిగిలిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన పథకం కింద 115 రోడ్లు మంజూరు చేయగా.. ఇందులో ఉత్తరాంధ్రకు కేవలం 8 మాత్రమే కేటాయించింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై వైసీపీ ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే ఈ రహదారుల్లో సింహభాగం ఈ ప్రాంతానికి కేటాయించాలి. కానీ ఉమ్మడి విశాఖ జిల్లాకు రెండు, ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఐదు రోడ్లను కేటాయించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు మాత్రం కేవలం ఒక్క రహదారినే కేటాయించి చేతులు దులుపుకొన్నారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం జగన్‌ సొంత జిల్లా కడపకు 35 రోడ్లు, సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు 15 రోడ్లు కేటాయించారు. కానీ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా.. ఆశించినస్థాయిలో ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- ఎక్కడ చూసినా అధ్వానమే

జిల్లాలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా గోతులమయం కావడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదాహరణకు పలాస, పాతపట్నం నియోజకవర్గాలను కలుపుతూ ఉన్న బెండిగేటు-పాతపట్నం రూటు దారుణంగా తయారైంది. అటువైపుగా ప్రయాణాలు సాగించాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు నదులు, కాలువలపై నిర్మించిన కల్వర్డులు సైతం ఎక్కడికక్కడే కూలిపోతున్నాయి. జిల్లా పునర్విభజన తరవాత ఐటీడీఏ సేవలు సైతం మందగించాయి. ఇప్పటికీ చాలా గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం మెరుగుపడలేదు. గతంలో శంకుస్థాపనలు చేసి.. అరకొర పనులు చేసి వదిలేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోజిల్లాలో దాదాపు వందకుపైగా రోడ్ల నిర్మాణానికి హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. కానీ ఇదిగో.. అదిగో నిధులు.. అంటూ ఇన్నాళ్లూ కాలయాపన చేసేశారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నా నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. తాజాగా ప్రధానమంత్రి గ్రామసడక్‌ యోజన పథకంలోనూ ఈ పనులకు చోటు దక్కకపోవడంతో రహదారుల నిర్మాణం ప్రశ్నార్థకంగా మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం రహదారులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Dec 18 , 2023 | 12:15 AM