జిల్లాకు చేరిన ‘పది’ ప్రశ్నపత్రాలు

ABN , First Publish Date - 2023-03-20T23:37:37+05:30 IST

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో వాటిని భద్రపరుస్తున్నారు.

జిల్లాకు చేరిన ‘పది’ ప్రశ్నపత్రాలు
నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నపత్రాలను భద్రపరుస్తున్న దృశ్యం

జిల్లాకు చేరిన ‘పది’ ప్రశ్నపత్రాలు

33 స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో భద్రం

(నరసన్నపేట)

పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభంకానున్న పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 33 స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో వాటిని భద్రపరుస్తున్నారు. ప్రశ్నపత్రాలు రెండు సెట్‌లలో రాగా.. సీఎస్‌లు, డీవోలు, కస్టోడియన్‌ అధికారి సమక్షంలో భద్రపరిచారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి 149 కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొత్తం 29,575 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టేందుకు మాక్‌ టెస్టులు నిర్వహించారు. ఈ నెల 9 నుంచి 18 వరకూ ప్రీ ఫైనల్‌ పరీక్షలు సైతం పూర్తయ్యాయి. అటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వారికి ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని హెచ్‌ఎంలతో పాటు యాజమాన్యాలకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఏ ఒక్క విద్యార్థి నేలపై పరీక్ష రాయకుండా చూడాలన్నారు. బెంచీలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. జిల్లా విభజన నేపథ్యంలో జిల్లాలో పరీక్ష కేంద్రాలు తగ్గాయి. 30 మండలాల్లో 149 కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా జంబ్లింగ్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. సీఎస్‌, డీవోలను నియమించారు. ఇన్విజలేటర్లు కూడా మండల పరిధి దాటి నియమాకాలను చేపడుతున్నారు. ఇప్పటికే హాల్‌ టిక్కెట్లును పాఠశాలలు లాగిన్‌లో ఉంచారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఉండేందుకు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటుచేశారు. సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించారు. పరీక్షలురాసే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపనుంది. కాగా పదో తరగతి పరీక్షలకు అన్నివిధాలా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఈవో పగడాలమ్మ తెలిపారు.

Updated Date - 2023-03-20T23:37:37+05:30 IST