వాట్సాప్ ఆదేశాలే గెలిచాయి
ABN , First Publish Date - 2023-09-08T00:22:44+05:30 IST
మంత్రి మంత్రాంగం ఫలించింది. వాట్సాప్‌లో పంపిన ఆదేశాలే గెలిచాయి. ఇంతవరకు తొక్కిపట్టి ఉంచిన ఉత్తర్వులను చేసేదేమీ లేక అమలుచేయాల్సిన పరిస్థితి విద్యాశాఖ అధికారులకు ఏర్పడింది.
- విద్యాశాఖలో అక్రమ బదిలీలు
- కోరుకున్నచోటకు ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు
- ఫలించిన మంత్రి మంత్రాంగం
- విస్తుపోతున్న ఉపాధ్యాయులు
(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం)
మంత్రి మంత్రాంగం ఫలించింది. వాట్సాప్‌లో పంపిన ఆదేశాలే గెలిచాయి. ఇంతవరకు తొక్కిపట్టి ఉంచిన ఉత్తర్వులను చేసేదేమీ లేక అమలుచేయాల్సిన పరిస్థితి విద్యాశాఖ అధికారులకు ఏర్పడింది. కొంతమంది ఉపాధ్యాయులు.. వారు కోరుకున్నచోట బదిలీ చేసేందుకు ఓ మంత్రి జాబితాను సిద్ధం చేసి.. వాట్సాప్ ఆదేశాలను పంపిన విషయం తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు వెలువడగా.. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. కానీ నిరసనలు సద్దుమణగడంతో... వాట్సాప్ ఆదేశాలను విద్యాశాఖ అధికారులు అమలు చేసేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఉపాధ్యాయులు కోరుకున్నచోటకు బదిలీ చేసేశారు. సిఫారసుల ఆధారంగా అక్రమ బదిలీలను ప్రతిఘటిస్తామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించినా.. అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి.. సిఫారసు జాబితాలో ఉన్న ఉపాధ్యాయులు కోరుకున్న చోటకు బదిలీ చేసేయాలని ఆదేశించారు. వారు చెప్పిందే తడువుగా ఆదేశాలు అమలు చేసేశారు.
- ముందు 20 మంది.. తర్వాత 40
కొంతమంది ఉపాధ్యాయులు కోరుకున్న స్థానానికి బదిలీ కోసం మంత్రి అనుచరులకు రూ.లక్షల్లో ముట్టజెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆరోపించాయి. వాటికి బలం చేకూర్చేలా జిల్లాలో 60 మంది ఉపాధ్యాయులను బదిలీ చేసేందుకు వాట్సాప్ ద్వారా ఓ జాబితాను మంత్రి జిల్లా అధికారులకు పంపారు. ముందుగా ఇరవై మందిని బదిలీచేయాలని ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత 40మందిని బదిలీచేయాలని వాట్సాప్‌లో జాబితా చేరింది. అప్పటి డీఈవో తిరుమలచైతన్య ఈ పద్ధతిని అమలుచేయలేక దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయారు. ఆతర్వాత ఇన్‌చార్జి డీఈవోగా వ్యవహరించిన ఆర్జేడీ కూడా స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌కు రిమార్కులు రాసేసి.. ప్రక్రియను ముందుకు కదలనీయలేదు. ఇటీవల టెలీకాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారుల ఆదేశాలతో బదిలీలు ప్రక్రియ సాగిపోయింది. ముందుగా జాబితా ప్రకారం ఈ నెల ఒకటి నుంచి గురువారం వరకు 20 మంది ఉపాధ్యాయులను బదిలీచేసేశారు. తర్వాత 40 మందికి ఎక్కడెక్కడ బదిలీచేయాలన్నది జాబితాను సిద్ధం చేసేశారు.
- అప్పుడు వెళ్లిపోయి.. ఇప్పుడు వచ్చేసి...
మొన్నటి సాధారణ బదిలీల్లో దూరప్రాంతాలకు వెళ్లినవారు సైతం.. ఇప్పుడు వాట్సాప్ ఆదేశాల కారణంగా.. జిల్లాకేంద్రానికి సమీపంలో చేరిపోయారు. ఓ మహిళా టీచరు జూన్‌లో జరిగిన బదిలీల్లో జిల్లా కేంద్రానికి సమీపం నుంచి మందస మండలం వెళ్లిపోయారు. అక్కడ నుంచి తాజాగా సిఫారసుల ఆధారంగా చేపట్టిన బదిలీల్లో మళ్లీ జిల్లాకేంద్రానికి సమీపంలో చేరిపోయారు. అలాగే మంత్రి సిఫారసులతో ఎచ్చెర్ల మండలంలో ఓ ఉపాధ్యాయుని... అదే మండలంలో మరొక గ్రామంలోకి బదిలీ అయిపోయారు. ప్రస్తుతం చేపట్టిన 20 బదిలీలు ఇటువంటివే. ఈ వ్యవహరాలపై విజిలెన్స్, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేసేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.