Panchumurti Anuradha: 175 స్థానాల్లోనూ టీడీపీ గెలవడం ఖాయం: పంచుమర్తి అనురాధ
ABN , First Publish Date - 2023-03-26T21:40:11+05:30 IST
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్రకు (YuvaGalamPadayatra) వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే...
అనంతపురం: తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) చేపట్టిన యువగళం పాదయాత్రకు (YuvaGalamPadayatra) వస్తున్న ప్రజాస్పందన చూస్తుంటే... వచ్చే ఎన్నికల్లో టీడీపీ 175 స్థానాల్లోనూ గెలవడం ఖాయమని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ (Panchumurti Anuradha) ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ సంఘీబావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. యువతతోపాటు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములవుతున్నారని తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గంలో వడ్డెర్లు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఆ సామాజికవర్గ ప్రజలు అడిగిన ప్రశ్నలకు నారా లోకేశ్ చెబుతున్న సమాధానంతో సంతృప్తి చెందుతున్నారన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉందన్నారు. బీసీ మహిళనైన తాను ఎమ్మెల్సీగా విజయం సాధించడం ఇందుకు నిదర్శనమన్నారు. ఆ వర్గాల అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. తన గెలుపు మాజీసీఎం చంద్రబాబు (Chandrababu), నారా లోకేశ్, టీడీపీ కుటుంబసభ్యుల విజయంగానే భావిస్తున్నానని తెలిపారు. వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై ఆ పార్టీ నేతల వేధింపులు సరికాదన్నారు. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలకే నచ్చలేని పరిస్థితి ఎందుకొచ్చిందో ముఖ్యమంత్రి జగన్ (Jagan) ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిపోయి.. మహిళా ఎమ్మెల్యేను వేధించడం పద్ధతి కాదని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా అధికార పార్టీలో ఇవే పద్ధతులను అవలంబిస్తున్నారని ఆమె మండిపడ్డారు. తనపైనా సోషల్ మీడియాలో బూతులు మాట్లాడించారని దుయ్యబట్టారు. చంద్రబాబు, లోకేశ్ అండతో తాను నిలబడ్డానని అనురాధ తెలిపారు.