Varla Ramaiah: జగన్ దళితులకు మేనమామ కాదు.. కంసమామ.. దొంగమామ

ABN , First Publish Date - 2023-08-15T14:07:30+05:30 IST

ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

Varla Ramaiah: జగన్ దళితులకు మేనమామ కాదు.. కంసమామ.. దొంగమామ

అమరావతి: ప్రస్తుత ప్రభుత్వంలో రాష్ట్రంలో దళితులకు రక్షణ కరువైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. దళితులను చంపినా, నరికినా, శిరోముండనం చేసినా, అత్యాచారాలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి, సీఎంకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. జగన్ మౌనం.. పరోక్షంగా వీటిని ప్రోత్సహిస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల గురించి పుంఖాను పుంఖానులుగా పత్రికల్లో వస్తున్నా చర్యలు శూన్యమన్నారు. దళితులపై దాడులు చేస్తే అవార్డులు, రివార్డులు ఏమైనా ఇస్తున్నారా అని అనుమానించాల్సి వస్తోందన్నారు. పట్టపగలే రాష్ట్రంలో దళిత మహిళలకు రక్షణ లేకుండాపోయిందని విమర్శించారు. ఒక్కసారైనా సీఎం.. డైరెక్టర్ జనరల్, పోలీసులు, కలెక్టర్లను పిలిచి దళితులపై దాడి చేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారా?.. సమీక్ష చేశారా? అని టీడీపీ నేత నిలదీశారు.


అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మాదిగ కులానికి చెందిన ఓ మహిళపై వైసీపీకి చెందిన ఐదుగురు సంవత్సరకాలంగా సామూహిక అత్యాచారం చేశారన్నారు. ఒక దళిత మహిళను సంవత్సర కాలంగా గ్యాంగ్ రేప్ చేస్తూ వస్తుంటే డీఎస్పీ, ఎస్‌ఐలు చిన్న కంప్లైంట్ అని చెప్పడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య దినోత్సవం రోజున స్వాతంత్ర్యం కోల్పోయిన దళిత బిడ్డకు సీఎం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దళితులకు మేనమామ కాదు.. కంసమామ.. దొంగమామ అంటూ విరుచుకుపడ్డారు. దళితులు కూడా వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిని గమనించాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పట్ల ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయాలన్నారు. కల్యాణదుర్గం మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనపై పూర్తి విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐ, డీఎస్పీలపై తగు చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-15T14:07:30+05:30 IST