Tiger: పిల్లల కోసం తల్లిపులిలో కనిపించిన ఆరాటం..?
ABN , First Publish Date - 2023-03-09T21:17:50+05:30 IST
నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో దారితప్పి చేరిన పులికూనలను తల్లివద్దకు చేర్చే ప్రక్రియ క్షణ.. క్షణం.. ఉత్కంఠగా మారింది.
ఆత్మకూరు: నంద్యాల జిల్లాలో కొత్తపల్లి మండలం పెద్దగుమ్మడాపురంలో దారితప్పి చేరిన పులికూనలను తల్లివద్దకు చేర్చే ప్రక్రియ క్షణ.. క్షణం.. ఉత్కంఠగా మారింది. ఎలాగైనా పులికూనలను తల్లివద్దకు చేర్చాలని అటవీ అధికారులు శ్రమిస్తున్నారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ధేశించిన స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసిజర్(ఎస్‌వోపీ)తో ముందుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆత్మకూరు ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో ఉన్న నాలుగు పులికూనలను ప్రత్యేక వాహనంలో పెద్దగుమ్మడాపురం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. బుధవారం అటవీ ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలు లభించగా... ముసలిమడుగు గ్రామ సమీపంలోని నీలగిరిచెట్లలోకి పెద్దపులి వెళ్లినట్లు ఓ గొర్రెల కాపరి ప్రత్యక్షంగా చూశారు. ఈ సంఘటనలను బట్టి తల్లిపులి అయివుండవచ్చునని అటవీ అధికారులు భావిస్తున్నారు. అందులో అత్యంత కీలకమైన ప్రదేశంలో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుఝాము వరకు ఆపరేషన్ మదర్ టీ-108లో భాగంగా పులికూనలను తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పులికూనల శబ్దాలను అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేయగా.. తల్లిపులి వాటిని అనుసరిస్తూ కూనలు ఉన్న ప్రదేశానికి 500మీటర్ల దూరం వరకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత తల్లిపులి దారి మళ్లినట్లు తెలిసింది. ఈ ప్రక్రియను రహస్యంగా పరిశీలించిన అటవీ అధికారులు పెద్దపులి పిల్లల కోసం ఇంకా అన్వేషిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్థారించుకున్నారు. ఇప్పటివరకు దారితప్పిన పులికూనలను తల్లి చేరదీస్తుందో లేదోనని అటవీ అధికారులు ఒకింత ఆందోళన చెందారు.
తల్లిపులి పిల్లల కోసం తపించే ఆరాటాన్ని గమనించినట్లు సమాచారం. ఈ ప్రక్రియను అటవీ అధికారులు అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. గురువారం కూడా తల్లిపులి ఆచూకీ కోసం అటవీ అధికారులు గాలించారు. పెద్దగుమ్మడాపురం సమీప అటవీ ప్రాంతంలో ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే పాదముద్రలను గుర్తించేందుకు బృందాలు అటవీ ప్రాంతంలో సంచరించాయి. ఇదిలావుంటే తల్లిపులి పిల్లల కోసం జరిపే అన్వేషణ, పులికూనల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేనట్లయితే వీలైనంతవరకు తల్లిపులి దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇది సాధ్యం కాని పక్షంలో తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర జులాజికల్ పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లోకి తరలించి అక్కడ రెండేళ్ల పాటు పులికూనలను సంరక్షిస్తారు. వాటికి వైల్డ్‌లైఫ్ హ్యాబిటేషన్, వన్యప్రాణులను వేటాడే సామర్థ్యం వచ్చాక తిరిగి అడవిలో వదిలేస్తామని ఎన్‌ఎస్‌టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రస్తుతం గెస్ట్‌హౌస్‌లోని ఏసీ గదిలో ఉన్న నాలుగు పులికూనలు ఆరోగ్యవంతంగా ఉన్నాయని, వీటిపై ఎప్పటికప్పుడు ఎన్‌టీసీఏ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.