Kodi Pandalu: కోడిపందేల జోరు.. మూడు రోజులు.. రూ.100 కోట్లు
ABN , First Publish Date - 2023-01-16T20:25:36+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మూడు రోజుల సంక్రాంతి (Sankranti) సంబరం సోమవారంతో ముగిసింది. ఈసారి హైదరాబాద్ (Hyderabad) నుంచి లక్షల్లో జనం తరలివచ్చారు.
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా (West Godavari District)లో మూడు రోజుల సంక్రాంతి (Sankranti) సంబరం సోమవారంతో ముగిసింది. ఈసారి హైదరాబాద్ (Hyderabad) నుంచి లక్షల్లో జనం తరలివచ్చారు. ముఖ్యంగా కోడి పందేలను తిలకించడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో అధిక సంఖ్యలో యువకులే ఉన్నారు. వీరే కాకుండా రాయలసీమ (Rayalaseema) జిల్లాలైన ముఖ్యంగా కడప జిల్లా నుంచి ఎక్కువగా వచ్చారు. 50 శాతం పైగా ఒక్క హైదరాబాద్ నగరం నుంచి రావడం విశేషం. జిల్లాలో మూడు రోజుల పందాలలో రూ.100 కోట్లు పైగా పందేలు సాగినట్టు అంచనా వేస్తున్నారు. భీమవరం (Bhimavaram), ఆకివీడు, కాళ్ళ, యలమంచిలి, పోడూరు, తణుకు, పెంటపాడు, వీరవాసరం మండలాల్లో పెద్ద బరులు సాగాయి. ఇక్కడ రూ.50 వేల నుంచి రూ.20 లక్షల వరకు పందేలు జరిగాయి. భీమవరం మండలం డేగాపురం, ఆకివీడు మండలం దుంపగడప, యలమంచిలి మండలం కలగంపూడి, పోడూరు మండలం కవిటం వద్ద రూ.లక్షల్లో పందేలు కాశారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్నాటక (Karnataka), తమిళనాడు, చత్తీస్‌ఘడ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రాంతాల నుంచి అక్కడ ఉన్న తెలుగువారితో పాటు ఆ ప్రాంతాలకు చెందిన స్థానిక మిత్ర బృందాలు వచ్చి పందేలను తిలకించారు. ఈసారి జూదాలను ఒక్కరోజు మాత్రమే అనుమతించడంతో పందేలపై ఆ ప్రభావం కనిపించింది. పెద్దబరులతో పాటు మరో 100 వరకు చిన్న బరులు వేయంతో అన్ని గ్రామాల్లోను కోడిపందేల సందడి కనిపించింది. మహిళలు కూడా ఈసారి ఎక్కువగా తిలకించడానికి వచ్చారు. పొరుగు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వాహనాలు తరలివచ్చాయి.
జూదాలకు గండి కొట్టిన పోలీసులు.. నష్టపోయిన నిర్వాహుకులు
కోడి పందేలతో పాటు వెనుకనే గ్యాంబ్లింగ్ జరుగుతుంది. పేకాట, గుండాట వంటి జూదాలు కొన్నేళ్లుగా జరగడం పరిపాటిగా మారింది. గోదావరి జిల్లాలకు వచ్చే వారిలో వీటిలో పాల్గొనే వారి సంఖ్య 50 శాతం ఉంటుంది. ఇక ఈ సంక్రాంతికి జూదాలకు పోలీసులు గండి కొట్టారు. జిల్లా ఎస్పీ రవిప్రకాష్ జూదాల విషయంలో కఠినంగా వ్యవహరించారు. భోగి రోజున ఉదయం నుంచి జూదాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా పెద్ద బరులలో వీటి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తొలి రోజు రాత్రి జూదాలను అడ్డుకుని కేవలం కోడిపందేలను మాత్రమే అనుమతించారు. కనీసం రూ.50 కోట్లు వరకు జూద నిర్వాహుకులు ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా కోట్ల రూపాయాల్లో నష్టాలు మూటకట్టుకోవాల్సి వచ్చింది. భీమవరం శివారు డేగాపురం పెద్ద శిబిరాన్ని కోటి రూపాయలకు పాడుకొన్న ఒక నిర్వాహుకుడికి 70 శాతం పైగా నష్టపోయినట్టు తెలిసింది. అనేక శిబిరాల్లో లక్ష నుంచి 20 లక్షల వరకు వేలంలో దక్కించుకున్న నిర్వాహుకులు నష్టాలు చవిచూశారు. జూదాల కోసమే కొన్ని పెద్ద శిబిరాల వద్ద రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఏర్పాట్లు చేశారు. శ్రీలంక ప్రాంతం నుంచి వచ్చిన ఒక బృందం భీమవరం శిబిరంలో టెంట్లు, ఇతర వసతులు కల్పించారని చెబుతున్నారు. వసతుల్లో ముఖ్యంగా విద్యుత్ దీపాలు, ఏసీలు, టీవీలు, ఎల్‌ఈడీ స్ర్కీన్‌లు, ఫర్నీచర్‌లు, మ్యాట్‌లు వంటివి ఏర్పాటు చేయడంతో పెట్టుబడులకు పెద్ద మొత్తంలో వ్యయం చేశారు. అయితే రెండు రోజులు వీటిని అడ్డుకోవడంతో ఆదాయం కోల్పోయారు.
తరలి వెళుతున్న అతిథులు, బంధువులు
సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఆస్వాదించిన బంధుగణం, పొరుగు ప్రాంతం నుంచి వచ్చిన అతిథులు సోమవారం ఉదయం నుంచి క్రమంగా బయలుదేరి వెళ్లడం కనిపించింది. పెద్ద ఎత్తున వాహనాలు తిరుగుముఖం పట్టాయి. ముందస్తుగా బుక్ చేసుకున్న బస్సులు, రైళ్లల్లో వెళ్లిపోవడం ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాల్లో వివిధ సామాజిక వర్గాలు ఏర్పాటు చేసుకున్న సమ్మేళనాలు ఎక్కువగానే జరిగాయి. సోమవారం కూడా సెలవు కావడంతో ఎక్కువమంది మంగళవారం తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.