TTD EO Dharma Reddy : ఆ సమయంలో చిన్న పిల్లలను అనుమతించే విషయంపై ధర్మారెడ్డి ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-10-04T11:26:10+05:30 IST
అలిపిరి నడక మార్గం ప్రారంభంలో భక్తులు సేదతీరేందుకు ఉపయుక్తమయ్యేలా కుడివైపు ఉన్న మండపం పునరుద్దరించాల్సి ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. రిపేరు చేయలేమని నిపుణులు తెలిపారన్నారు.
తిరుపతి : అలిపిరి నడక మార్గం ప్రారంభంలో భక్తులు సేదతీరేందుకు ఉపయుక్తమయ్యేలా కుడివైపు ఉన్న మండపం పునరుద్దరించాల్సి ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. రిపేరు చేయలేమని నిపుణులు తెలిపారన్నారు. అందుకే తొలగించి, అదే విధంగా 20 రాతి పిల్లర్లతో కొత్తది నిర్మిస్తున్నామన్నారు. ఇందుకోసం కోటి 36 లక్షల రూపాయల వరకూ వ్యయం చేయబోతున్నామని తెలిపారు. దీన్ని తొలగించటంపై ఎవరికైనా అభ్యంతరాలు, అనుమానాలు ఉంటే స్వయంగా పరిశీలించి స్పందించాలని ధర్మారెడ్డి కోరారు.
నడక మార్గంలో చిరుతలు సంచారం తగ్గిన నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలు తర్వాత చిన్నపిల్లలను అనుమతించే విషయంలో అటవీ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. కాబట్టి చిన్న పిల్లలతో వెళ్లే వారి విషయంలో ఆంక్షలు ఉంటాయన్నారు. కంచె నిర్మాణంపై వైల్డ్ లైఫ్ అధికారులు రిపోర్ట్ ఇంకా ఇవ్వలేదన్నారు. అటవీ జంతువుల కదలికలపై ఎప్పటి కప్పుడు నిఘా ఉంచామన్నారు. సీసీ కెమెరాలుతో పాటు ట్రాప్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని ధర్మారెడ్డి వెల్లడించారు.