Vande Bharat Express: రాత్రి 7.45కి గుంటూరు చేరుకోవాల్సిన ఈ వందేభారత్ రైలు ఎంత ఆలస్యమైందంటే..

ABN , First Publish Date - 2023-06-05T17:29:57+05:30 IST

తిరుపతి - సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు సర్వీసు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఈ ప్రీమియం రైలు గంటా 10 నిమిషాల ఆలస్యంగా గుంటూరు చేరుకొన్నది. ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలో 14 నిమిషాల ఆలస్యంగా 3.29కి బయలుదేరిన ఈ రైలు నెల్లూరుకు 24 నిమిషాలు, ఒంగోలుకు గంటా 4 నిమిషాల ఆలస్యంగా వచ్చింది.

Vande Bharat Express: రాత్రి 7.45కి గుంటూరు చేరుకోవాల్సిన ఈ వందేభారత్ రైలు ఎంత ఆలస్యమైందంటే..

వందేభారత్‌ గంటా 20 నిమిషాల ఆలస్యం

గుంటూరు (ఆంధ్రజ్యోతి): తిరుపతి - సికింద్రాబాద్‌ వందేభారత్‌ రైలు సర్వీసు ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఈ ప్రీమియం రైలు గంటా 10 నిమిషాల ఆలస్యంగా గుంటూరు చేరుకొన్నది. ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలో 14 నిమిషాల ఆలస్యంగా 3.29కి బయలుదేరిన ఈ రైలు నెల్లూరుకు 24 నిమిషాలు, ఒంగోలుకు గంటా 4 నిమిషాల ఆలస్యంగా వచ్చింది. ఒంగోలులో అరంగంటకు పైగా నిలిపేసి గుంటూరుకు పంపించారు. దాంతో రాత్రి 7.45కి రావాల్సిన ఈ రైలు 9.04 నిమిషాలకు వచ్చింది. ఇక్కడ మరో 16 నిమిషాలు నిలిపేసి 9.20కి పంపించారు. దీని వలన సికింద్రాబాద్‌కి ఈ రైలు అర్ధరాత్రి 12.30 గంటల సమయం దాటిన తర్వాత చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రీమియం రైలు పేరుతో ఛైర్‌కార్‌, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ బోగీలలో రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తూ కూడా ఇలా ఆలస్యంగా నడపడంపై ప్రయాణీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నాలుగు గంటల ఆలస్యంగా రీషెడ్యూల్‌

నిత్యం గుంటూరు మీదగా ప్రయాణించే నెంబరు. 17016 సికింద్రాబాద్‌ - భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ని ఆదివారం నాలుగు గంటల పాటు రీషెడ్యూల్‌ చేశారు. సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.50కి బయలుదేరాల్సిన ఈ రైలు రాత్రి 8.50 తర్వాత బయలుదేరింది. ఈ కారణంగా గుంటూరుకు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వచ్చే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైలులో విశాఖపట్టణం, భువనేశ్వర్‌ వెళ్లేందుకు ముందుగా టిక్కెట్‌లు బుకింగ్‌ చేసుకొన్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

27 గంటల ఆలస్యంగా దిబ్రూగఢ్‌ రైలు రాక

ఒడిస్సాలో రైలు ప్రమాదం కారణంగా గుంటూరు మీదగా సికింద్రాబాద్‌కి వెళ్లే దిబ్రూగఢ్‌ ప్రత్యేక రైలు 27 గంటల ఆలస్యమైంది. గత గురువారం ఉదయం 9.20కి బయలుదేరి ఈ రైలు శనివారం ఉదయం 9.10కి గుంటూరుకు వచ్చి సాయంత్రం 4.30కి సికింద్రాబాద్‌ చేరుకోవాలి. అలాంటిది 27 గంటల ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం 12.55కి గుంటూరు, రాత్రి 7.37కి సికింద్రాబాద్‌ చేరుకొన్నది. అలానే నెం.07029 అగర్తల - సికింద్రాబాద్‌ రైలు గత శుక్రవారం ఉదయం 6.10కి అగర్తలలో బయలుదేరింది. ఈ రైలు ఆదివారం ఉదయం 9.35కి గుంటూరుకు రావాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటల తర్వాత వస్తుందని రైల్వేవర్గాలు తెలిపాయి. దీంతో ఈ రైలు సికింద్రాబాద్‌కి చేరుకోవడానికి 15 గంటలకు పైగా ఆలస్యమౌతుందని తెలియడంతో ప్రయాణీకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2023-06-05T17:30:00+05:30 IST