భూహక్కుల చట్టంలోని 27/2023ను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2023-11-30T01:21:32+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం 27/2023ను వెంటనే రద్దు చేయాలని నర్సీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు.
నర్సీపట్నం, నవంబరు 29 : రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టం 27/2023ను వెంటనే రద్దు చేయాలని నర్సీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇక్కడి కోర్టు సముదాయం ముందు బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ భూ హక్కుల చట్టం ప్రకారం స్థిరాస్తి హక్కుల కోసం రెవెన్యూ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌కు వెళ్లాల్సి ఉంటుందని, రెండు సంవత్సరాల లోపు ఈ వివాదాలపై అభ్యంతరాలు తెలిపాలన్నారు. దీని వల్ల నిరక్షరాస్యులైన గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా నష్టపోతారని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి చట్టం అమలులో లేదన్నారు. వారం రోజుల పాటు ఈ చట్టంపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ చట్టంపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి లోలా లోవరాజుతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.