బైక్‌ను ఢీకొన్న కారు యువకుడి మృతి

ABN , First Publish Date - 2023-06-30T00:56:34+05:30 IST

దేవరాపల్లి- కొత్తవలస రోడ్డులో సంజీవమెట్ట వద్ద గురువారం సాయంత్రం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

బైక్‌ను ఢీకొన్న కారు  యువకుడి మృతి
రావాడ లక్ష్మణరావు(పైల్‌)

దేవరాపల్లి, జూన్‌ 29: దేవరాపల్లి- కొత్తవలస రోడ్డులో సంజీవమెట్ట వద్ద గురువారం సాయంత్రం బైక్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒక యువకుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

మండలంలోని ముషిడిపల్లి పంచాయతీ శివారు రావాడపాలెం గ్రామానికి చెందిన రావాడ లక్ష్మణరావు(22) గురువారం వేపాడ మండలం వావిలపాడు పంచాయతీ సంజీవమెట్టలో తన మేనత్త ఇంటికి వెళ్లాడు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొన్నది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మణరావును 108లో దేవరాపల్లి పీహెచ్‌సీకి తీసుకువచ్చి ప్రఽథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా వుండడంతో కేజీహెచ్‌కు తరలిస్తుండగా దారిలో మృతిచెందాడు. అవివాహితుడైన లక్ష్మణరావు వెల్డింగ్‌ పనులు చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు. చేతికి అంది వచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లిదండ్రులు రావాడ శ్రీరాములు, సూరిబాబు కన్నీరుమున్నీరు అయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతం విజయనగరం జిల్లా వేపాడ మండలం కావడంతో మృతుడి కుటుంబీకులు అక్కడి ఎస్‌.ఐ.కు సమాచారం ఇచ్చారు.

విద్యుదాఘాతంతో ఎలక్ర్టీషియన్‌ మృతి

కశింకోట, జూన్‌ 29: మండలంలోని ఏఎస్‌ పేట గ్రామం రాంకో సిమెంటు ఫ్యాక్టరీలో విద్యుదాఘాతానికి గురై ఎలక్ర్టీషియన్‌ మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఏఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా తుమ్మలోవకు చెందిన ఉట్ల కుమార్‌ వీరసుబ్రహ్మణ్యం(24) రాంకో సిమెంటు ఫ్యాక్టరీలో కొంత కాలంగా ఎలక్ర్టీషియన్‌గా పని చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే బుధవారం సాయంత్రం 5.30 గంటలకు ఫ్యాక్టరీలో విధులకు హాజరయ్యాడు. ఫ్యాక్టరీలో విధుల్లో భాగంగా వైర్లు కలుపుతున్న నేపథ్యంలో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే ఫ్యాక్టరీ అంబులెన్స్‌లో అనకాపల్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని మృతుని బంధువు గజ్జెల గోవింద గురువారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్‌ఐ తెలిపారు.

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

కశింకోట, జూన్‌ 29: మండలంలోని బయ్యవరం, నర్సింగబిల్లి రైల్వే స్టేషన్‌ల మధ్యలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని తుని రైల్వే పోలీసులు తెలిపారు. తుని రైల్వే పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ లోవరాజు గురువారం తెలిపిన వివరాలిలా వున్నాయి. సుమారు 50 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తిని ప్రమాదవశాత్తూ ఓ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఇతను మూడేళ్లుగా వాటర్‌ బాటిళ్లు ఏరుకుని జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని తుని ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, ఆచూకీ తెలిసిన వారు తుని రైల్వే పోలీసులను సంప్రతించాలని ఇన్‌చార్జి ఎస్‌ఐ కోరారు.

బాలికపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు

నర్సీపట్నం, జూన్‌ 29 : స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పాత బస్టాండ్‌ ప్రాంతానికి చెందిన కనితి కనకారావు(31)ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించినట్టు సీఐ గణేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలిక స్కూల్‌కి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని బాలిక తల్లి పట్టణ పోలీసులకుఫిర్యాదు చేసిన విషయం తెలిందే. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి పట్టణ పోలీసులు నిందితుడ్ని అరెస్టు చేశారు.

Updated Date - 2023-06-30T00:56:34+05:30 IST