నగరంలో నైట్ అవుట్స్ గ్యాంగ్
ABN , First Publish Date - 2023-07-20T01:17:17+05:30 IST
నగరంలో కొత్తగా ‘నైట్ అవుట్స్’ పేరుతో ఒక గ్యాంగ్ ఏర్పాటైంది. కైలాసపురం ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరంతా చెడు అలవాట్లకు బానిసలై చదువును మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతున్నారు. అవసరాలకు కావాల్సిన డబ్బు సులభంగా సంపాదించేందుకు దోపిడీలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం ‘నైట్ అవుట్స్’ పేరుతో గ్రూపు ఏర్పాటుచేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌లపై నగర శివారు ప్రాంతాలకు వెళ్లి లారీలను అడ్డగించి డ్రైవర్లను కత్తులు, కర్రలతో బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరికొకరు పరిచయం
శివారు ప్రాంతాల్లో
ఇతర రాష్ట్రాల లారీలను ఆపి దోపిడీ
ఏడుగురు అరెస్టు...వారిలో నలుగురు జువెనైల్స్
విశాఖపట్నం, జూలై 19 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కొత్తగా ‘నైట్ అవుట్స్’ పేరుతో ఒక గ్యాంగ్ ఏర్పాటైంది. కైలాసపురం ప్రాంతానికి చెందిన కొంతమంది యువకులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరంతా చెడు అలవాట్లకు బానిసలై చదువును మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరుగుతున్నారు. అవసరాలకు కావాల్సిన డబ్బు సులభంగా సంపాదించేందుకు దోపిడీలు చేయాలని నిర్ణయించారు. అందుకోసం ‘నైట్ అవుట్స్’ పేరుతో గ్రూపు ఏర్పాటుచేసుకుని అర్ధరాత్రి దాటిన తర్వాత బైక్‌లపై నగర శివారు ప్రాంతాలకు వెళ్లి లారీలను అడ్డగించి డ్రైవర్లను కత్తులు, కర్రలతో బెదిరించి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ తరహా నేరాలపై ఫిర్యాదులు అందడంతో వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టి ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారిలో నలుగురు పద్దెనిమిది సంవత్సరాలలోపువారు కావడం గమనార్హం. పోలీస్ కమిషనరేట్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో క్రైమ్ డీసీపీ జి.నాగన్న దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
కైలాసపురం ప్రాంతానికి చెందిన ఎర్రిపల్లి సురేష్, పోలవరపు లక్ష్మణ్, వాసుపల్లి నరేంద్రకుమార్‌తోపాటు మరో నలుగురు మైనర్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. అందరూ చదువు మధ్యలోనే ఆపేసి జులాయిగా తిరిగేవారు కావడంతో ప్రతిరోజూ రాత్రి సమయంలో పోర్టు డీఎల్‌బీ మైదానంలో కలుసుకునేవారు. వ్యసనాలకు బానిసలై సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ‘నైట్ అవుట్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఒక గ్రూపు ఏర్పాటుచేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన లారీల డ్రైవర్లను బెదిరించి డబ్బులు తీసుకుంటే కేసులు ఉండవని భావించారు. ప్రతిరోజూ రాత్రి ఎక్కడ కలవాలనేది గ్రూపులోనే మెసేజ్ పెట్టుకుని కలుసుకునేవారు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత బైక్‌లపై గాజువాక, కొమ్మాది, పెందుర్తి వంటి నగర శివారు ప్రాంతాలకు వెళ్లి తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల రిజిస్ర్టేషన్‌తో వచ్చే లారీలను గుర్తించి వాటిని వెంబడించి, కొంతదూరం వెళ్లాక ఎదురుగా బైక్‌లను పెట్టి ఆపేవారు. లారీలు ఆపగానే కత్తులు, కర్రలు పట్టుకుని అద్దాలు, డోర్‌లను కొట్టి, డ్రైవర్‌లను భయభ్రాంతులకు గురిచేసి వారి వద్ద ఉన్న నగదు, సెల్‌ఫోన్లను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యేవారు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ అర్ధరాత్రి 12.45 గంటల సమయంలో ఒడిశాలోని నవరంగ్‌పూర్ నుంచి హెచ్‌పీసీఎల్‌లో తారు లోడ్ చేసుకునేందుకు వచ్చిన లారీని ఆపి డ్రైవర్ బండ లింగస్వామిని కొట్టి బెదిరించి, అతడి వద్ద నుంచి రూ.రెండు వేలు, సెల్‌ఫోన్ లాక్కున్నారు. తర్వాత డ్రైవర్ బతిమలాడడంతో సెల్‌ఫోన్ తిరిగి ఇచ్చేశారు. అదేరోజు మరొక లారీ డ్రైవర్‌ను కూడా అదే తరహాలో బెదిరించి దోచుకున్నారు. దీనిపై బాధితులు ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైమ్ సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏడీసీపీ డి.గంగాధరం, క్రైమ్ ఏసీపీ బి.సునీల్ తదితరులు పాల్గొన్నారు.