జన సునామీ
ABN , Publish Date - Dec 21 , 2023 | 02:17 AM
‘యువగళం-నవశకం’ గర్జన సముద్రపు హోరును తలపించింది.
యువగళం-నవశకం సభ సూపర్ సక్సెస్
వెల్లువెత్తిన అభిమానం
భారీగా తరలివచ్చిన టీడీపీ, జనసేన కార్యకర్తలు
మధ్యాహ్నం నుంచి కిక్కిరిసిన జాతీయ రహదారి
కిలోమీటర్ల మేర కొద్దీ వాహనాల క్యూ
విశాఖకు పూర్వవైభవం తీసుకువస్తామన్న చంద్రబాబునాయుడు
వైసీపీ నేతలు ఉత్తరాంధ్రను దోచుకున్నారని ధ్వజం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
‘యువగళం-నవశకం’ గర్జన సముద్రపు హోరును తలపించింది. జనసంద్రం ఉప్పొంగి పోలిపల్లిని ముంచెత్తింది. జాతీయ రహదారి మొత్తం టీటీపీ, జనసేన శ్రేణులతో కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఇవ్వకపోయినా, బస్సులు ఇవ్వొద్దని ప్రైవేటు విద్యా సంస్థలపై ఆంక్షలు విధించినా పార్టీ శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ ప్రసంగాలను ప్రత్యక్షంగా వినాలని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లలో వేసుకొని పోలిపల్లి బాట పట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే జాతీయ రహదారి రద్దీగా మారిపోయింది. సాయంత్రం ఐదు గంటల వరకు పార్టీల జెండాలతో వాహనాలు హైవేపై దూసుకువెళ్లాయి. పార్టీ కార్యకర్తనని చెప్పుకునే ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరై నిబద్ధతను చాటుకున్నారు.
నవశకం సభలో ప్రముఖుల ప్రసంగాలన్నీ ఉత్తరాంధ్ర, విశాఖపట్నం చుట్టూనే తిరిగాయి. అధికార పార్టీ వైసీపీ ఉత్తరాంధ్రాను కబ్జా చేసిందని, విలువైన ఆస్తులన్నీ దోచుకుందని చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్‌కల్యాణ్ ఆరోపించారు. విశాఖను ఆనాడే తాము ఆర్థిక రాజధానిగా ప్రకటించామని, ఐటీ హబ్‌గా అభివృద్ధికి బాటలు వేశామని, అయితే వైసీపీ వచ్చి అన్నింటిని తరిమేసిందని చంద్రబాబు విమర్శించారు. వంద రోజుల్లో వైసీపీని వెనక్కి పంపితే విశాఖపట్నానికి తిరిగి పూర్వవైభవం తెస్తామని భరోసా ఇచ్చారు. ‘ఆంధ్రుల హక్కు... విశాఖ ఉక్కు’ అంటూ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుంటే...32 మంది ఎంపీలున్న వైసీపీ ఒక్కరోజు కూడా పార్లమెంటులో ప్రశ్నించలేదని, సొంత గనుల కోసం కృషి చేయలేదని లోకేశ్ విమర్శించారు. స్టీల్‌ప్లాంటుకు చెందిన వేలాది ఎకరాల భూమలు కొట్టేయడానికి జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే జోన్‌కు భూములు ఇస్తే శంకుస్థాపన చేస్తామని కేంద్రం చెబుతుంటే..వాటిని ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మెట్రో రైలు రాలేదని, సుజల స్రవంతిని గాలికి వదిలేశారని, ఐటీ మంత్రిగా విశాఖకు అనేక కంపెనీలను తాను తీసుకువస్తే కోడిగుడ్డు మంత్రి నిర్వాకంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని దుయ్యబట్టారు. ఆర్థిక రాజధాని అయిన విశాఖను నేర రాజధానిగా మార్చేశారన్నారు. నగరంలో క్రైస్తవులకు చెందిన సీఎన్‌బీసీ భూములు, హయగ్రీవ భూములు, దసపల్లా భూములు...ఇలా అన్నింటిని కబ్జా చేశారని, తాము అధికారంలోకి వస్తే వాటికి విముక్తి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. విజయసాయిరెడ్డి విశాఖను నాశనం చేస్తే, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి విశాఖ ఏజెన్సీలోని లేటరైట్, బాక్సైట్‌ని తవ్వుకొని పోతున్నాడని ఆరోపించారు. ఉత్తరాంధ్రాను దోచుకున్నారని, తాము అధికారంలో వచ్చాక దీనిని గాడిలో పెడతామని, జీడీపీలో ఐదో స్థానానికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జనసేన జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబులకు మాట్లాడే అవకాశం కల్పించారు. వారు కూడా వైసీపీ నేతల దౌర్జన్యాలు, కక్ష సాధింపు చర్యలపైనే మాట్లాడారు. సభ రాత్రి 8.30 గంటలకు ముగియగా పోలీసులు వాహనాలను దగ్గరుండి పంపించాల్సి ఉండగా, వారు నాయకుల కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో సర్వీసు రోడ్డులో వాహనాలు నాలుగు కి.మీ. మేర నిలిచిపోయాయి.
ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది
‘‘ఈ ఐదేళ్లలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగిపోయింది. భోగాపురం విమానాశ్రయం ఆశయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు ఆగిపోయింది. ఐటీ కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆగిపోయాయి. కబ్జాలు, సెటిల్‌మెంట్లు పెరిగిపోయాయి. మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకునే సంస్కృతి తీసుకువచ్చారు. విశాఖపట్నం నాడు ఆర్థిక రాజధానిగా ఉండగా ఇప్పుడు గంజాయికి రాజధానిగా మార్చేశారు. విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టం. హుద్‌హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడే పది రోజులు ఉండి నగర పునర్మిర్మాణానికి చర్యలు తీసుకున్నా’’
- నారా చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత
మళ్లీ వైసీపీ వస్తే ఎవరూ ఏపీలో ఉండలేరు
‘‘వారాహి యాత్ర చేసినప్పుడు నాపై దాడులు జరిగాయి. అన్నింటినీ భరించా. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి పార్టీ కార్యక్రమానికి వస్తున్న సమయంలో బయటకు రానివ్వకుండా, ప్రజలకు అభివాదం చేయనివ్వకుండా ఒక పోలీస్ అధికారి తనను కూర్చోమన్నారు. సదరు అధికారికి సకల శాఖల మంత్రి ఆదేశాలు ఇవ్వడం నాకు వినిపించిందన్నారు. ముందుకు వెళ్లనీయకండి, కూర్చోబెట్టండి అంటూ ఫోన్‌లో ఆ ఆధికారికి చెప్పారు. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబుకు, నాకు ఇటువంటి పరిస్థితులు ఎదురైతే సగటు మనిషి పరిస్థితి ఏమిటి. భవిష్యత్తులో మళ్లీ వైసీపీ వస్తే ఎవరూ ఇళ్లల్లోను, ఏపీలోనూ ఉండలేరు’’
పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు
‘‘మూడు రాజధానుల పేరిట మూడుముక్కలాట హడావుడి తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ధికి జగన్ ఒక్క ఇటుక కూడా వేయలేదు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు. స్టీల్‌ప్లాంట్ భూములను కొట్టేయడానికి జగన్ స్కెచ్ వేశాడు. అందుకే అంతమంది ఎంపీలు ఉన్నా ప్రైవేటీకరణను ఆపడానికి ప్రయత్నించలేదు. ఉక్కుకు గనులు కేటాయించాలని కేంద్రాన్ని అడగలేదు. విశాఖ మెట్రోరైల్ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం మూలనపడేసింది. మూతపడిన సహకార చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఎన్నికలు ముందు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఫ్యాక్టరీని కూడా తెరిపించలేదు. ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది.’’
- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
జన ప్రభంజనంలో వైసీపీ కొట్టుకుపోతుంది
భూమి ఈనిందా...ఆకాశం బద్ధలైందా అన్నరీతిలో యువగళం సభకు వచ్చిన ఈ జన ప్రభంజనం ముందు వైసీపీ కొట్టుకుపోతుంది. సైకో ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారు. పాదయాత్ర ద్వారా యువనేత లోకేశ్ ప్రజల కష్టాలను నేరుగా చూశారు. బాధలను విన్నారు. అన్ని వర్గాల ప్రజలకు నిర్దిష్టమైన హామీలు ఇస్తూ పాదయాత్రను సాగించారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా మొక్కవోని దీక్షతో ముందుకు కదిలారు. వైసీపీ మంత్రులు ఇప్పుడు బీసీ సాధికార బస్సుయాత్రను చేపట్టారు.
కె.అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
విశాఖను క్రైమ్ క్యాపిటల్‌గా చేశారు
విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తామని ప్రకటించిన సీఎం జగన్...క్రైమ్ క్యాపిటల్‌గా మార్చేశారు. విశాఖలోని విలువైన భూములను, బాక్సైట్ గనులను దోచేశారు. విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంరఽధను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డికి అప్పగించి మైన్, శాండ్, ల్యాండ్ మాఫియాగా మార్చేశారు.
- నాదెండ్ల మనోహర్, జనసేన నేత