Share News

రెండు సంస్థలకు భూ సంతర్పణ

ABN , Publish Date - Dec 16 , 2023 | 01:24 AM

అమరావతిలో శుక్రవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రెండు సంస్థలకు భూ సంతర్పణ

బెంగళూరు విద్యా సంస్థకు 11.25 ఎకరాలు

భీమిలి ఎమ్మెల్యే భార్యకు 32 సెంట్లు

విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

అమరావతిలో శుక్రవారం నిర్వహించిన మంత్రి మండలి సమావేశంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంచి డిమాండ్‌ ఉన్న ప్రాంతాల్లో రెండు విద్యా సంస్థలకు భూములు కేటాయించారు. బెంగళూరుకు చెందిన టీఐఎస్‌బీ/ఎన్‌ఎస్‌పీ గ్రూపు నేషనల్‌ పబ్లిక్‌ స్కూల్‌-ఇంటర్నేషనల్‌ పేరుతో ఏర్పాటు చేసే విద్యా సంస్థకు మధురవాడ సర్వే నంబరు 427-1లో 11.25 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రాంతంలో ఎకరాల లెక్కన భూముల ధరలను రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించలేదు. అంతా గజాల్లోనే లెక్కిస్తున్నారు. గజం కనీస ధర రూ.35 వేలు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే ఎకరా (4,840 గజాలు..గజం రూ.35 వేలు చొప్పున) రూ.16.94 కోట్లు పడుతోంది. సుమారు రూ.17 కోట్లు. మొత్తం భూమి విలువ రూ.190 కోట్లు. అయితే ప్రభుత్వం ఎకరా రూ.31.46 కోట్ల చొప్పున 11.25 ఎకరాలను రూ.707.85 కోట్లకు కేటాయించినట్టు ప్రకటించింది. ఎకరా రూ.31.46 కోట్లు లెక్క రూ.354 కోట్లు పడుతోంది. కానీ అంతకు రెట్టింపు చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. పైగా పరిహారం కాకుండా ఈ రేటు అని వివరించారు. ఇందులో ఏదో మతలబు ఉందని వ్యాపార వర్గాలు అనుమానిస్తున్నాయి.

ఇదిలావుంటే మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు భార్య జ్ఞానేశ్వరికి కాపులుప్పాడ సర్వే నంబరు 40/6లో 32 సెంట్లు కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఎకరా ధర రూ.2 కోట్లు ఉన్నట్టు కలెక్టర్‌ ప్రభుత్వానికి తెలియజేశారు. దానిని దృష్టిలో ఉంచుకొని 32 సెంట్లకు రూ.1.28 కోట్లు చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఎకరా రూ.3 కోట్ల చొప్పున రేటు నిర్ణయించినట్టు అర్థమవుతోంది. బోయపాలెంలో ముత్తంశెట్టికి కొంత భూమి ఉండగా, దానికి సరైన మార్గం లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కేటాయించాలని నాలుగేళ్ల క్రితం కోరినట్టు సమాచారం. దానికి ఇప్పుడు మార్కెట్‌ ధర నిర్ణయించి కేటాయించారు.

Updated Date - Dec 16 , 2023 | 01:24 AM