ఆలయ భూమి కబ్జాకు యత్నం
ABN , First Publish Date - 2023-06-03T00:49:20+05:30 IST
రెవెన్యూ డివిజనల్ అధికారి కోర్టులో వున్న కోట్లాది రూపాయల విలువ చేసే దేవుడి మాన్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి రెండు రోజుల నుంచి క్వారీ రాళ్లను ట్రాక్టర్లతో తీసుకొచ్చి పడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి గ్రామ పెద్దలు, దేవదాయ శాఖ ఈఓ శర్మ చెప్పిన వివరాలిలా వున్నాయి.
ప్రహరీ గోడ నిర్మాణానికి ఏర్పాట్లు
అభ్యంతరం చెప్పిన స్థానికులు
80 ఏళ్ల క్రితం పూజారి పేరున 3.42 ఎకరాలను రాసిచ్చిన దాతలు
కొన్నేళ్ల తరువాత తన పేరున పట్టాదారుపాస్ పుస్తకాలు పొందిన అర్చకుని కుమారుడు
అనంతరం వేరే వ్యక్తులకు విక్రయం
పట్టాదారు పాస్‌పుస్తకాలు రద్దు చేయాలని ఆర్డీవో కోర్టులో ఆలయ అధికారులు ఫిర్యాదు
తీర్పు వెలువడకముందే భూమి స్వాధీనానికి అక్రమార్కులు ప్రయత్నాలు
మార్కెట్ విలువ రూ.30 కోట్లు పైమాటే!
బుచ్చెయ్యపేట, జూన్ 2: రెవెన్యూ డివిజనల్ అధికారి కోర్టులో వున్న కోట్లాది రూపాయల విలువ చేసే దేవుడి మాన్యాన్ని స్వాధీనం చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నించారు. భూమి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడానికి రెండు రోజుల నుంచి క్వారీ రాళ్లను ట్రాక్టర్లతో తీసుకొచ్చి పడేస్తున్నారు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి గ్రామ పెద్దలు, దేవదాయ శాఖ ఈఓ శర్మ చెప్పిన వివరాలిలా వున్నాయి.
బుచ్చెయ్యపేట మండలం విజయరామరాజుపేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 275/6లో 1.88 ఎకరాలు, సర్వే నంబర్ 296లో 1.35 ఎకరాలు, సర్వే నంబర్ 285లో 29 సెంట్లు... మొత్తం 3.42 ఎకరాలను గ్రామానికి చెందిన నేమాని కొండప్ప, భార్య సూరీడమ్మ 1946 ఫిబ్రవరి 25న వడ్డాదిలో కొలువైయున్న లక్ష్మీనృసింహస్వామి దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ పొలంపై వచ్చే ఆదాయంతో స్వామివారికి ధూప, దీప, నైవేద్యంతోపాటు కల్యాణోత్సవం, ఆలయం నిర్వహణ వంటి పనులు చేయాలని కోరుతూ దస్తావేజును అప్పటి ఆలయ అర్చకులైన రాజేటి గోపాలచార్యులు పేరుమీద రాసి ఇచ్చారు. కొంతకాలం తరువాత గోపాలచార్యులు పరమపదించడంతో ఆయన కుమారుడు శ్రీధర్ ఆలయ నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. కానీ 1995 నుంచి ఆయన ఆలయాన్ని సరిగా తెరవకుండా పూజలకు స్వస్తి పలికాడు. దేవుడి మాన్యంపై వచ్చే ఆదాయాన్ని తన సొంతానికి వాడుకునేవాడు. కాగా ఆలయ భూములు వడ్డాది కూడలికి సమీపంలో ఉండడంతో విలువ గణనీయంగా పెరిగింది. దీంతో భూములను విక్రయించాలని నిర్ణయించుకుని 2011లో తన పేరుమీద పట్టాదారు పాసుపుస్తకాలు పొందాడు. తరువాత కశింకోటకి చెందిన ఒక వ్యక్తి ఈ భూములను కొనుగోలు చేశాడు. ఇతను మళ్లీ గాజువాకకు చెందిన ఒక బడాబాబుకు విక్రయించాడు. తరువాత 2014లో ఇతనిని నుంచి వడ్డాదికి చెందిన అధికార పార్టీ నాయకులు కొనుగోలు చేశారు. వెంటనే భూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఆలయ భూములు చేతులు మారినట్టు అప్పటి వరకు స్థానికులకు తెలియదు. దీనిపై పెద్దలు గ్రామసభ నిర్వహించి, దేవుని భూములు అన్యాక్రాంతం కావడంపై దేవదాయ శాఖకు ఫిర్యాదు చేశారు. అధికారులు వచ్చి... ఆలయానికి దాతలు ఇచ్చిన భూముల క్రయవిక్రయాలు చెల్లవని, ఈ భూములు ముమ్మాటికీ లక్ష్మీనృసింహస్వామికే చెందుతాయని స్పష్టం చేశారు. దీంతో గ్రామ పెద్దలు ఆలయ భూములను పక్కనే వున్న రైతుకు కౌలుకి అప్పగించారు. కౌలు సొమ్ముతో స్వామివారికి ధూప, దీప, నైవేద్య సమర్పణ ప్రక్రియలను పునరుద్ధరించారు. మరోవైపు ఈ భూములు దేవదాయ శాఖకు చెందినందున వీటిపై తహసీల్దార్ జారీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాలను రద్దు చేయాలని ఆ శాఖ అధికారులు అనకాపల్లి ఆర్డీఓ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇంతవరకు తీర్పు వెలువడలేదు. అయితే ఈ భూములను కొనుగోలు చేశామన్న చెబుతున్న స్థానిక నాయకులు.. ప్రహరీ గోడ నిర్మాణం కోసం రెండు రోజుల నుంచి ట్రాక్టర్లతో పునాదిరాళ్లను తీసుకవచ్చి పడేస్తున్నారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవదాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఆలయ భూమి విలువ రూ.30 కోట్లకు పైగా వుంటుదని గ్రామస్థులు చెబుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
శర్మ, దేవదాయ శాఖ ఈఓ
వడ్డాది లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి చెందిన మాన్యం భూముల కేసు ప్రస్తుతం ఆర్డీవో కోర్టులో వుంది. ఇంతవరకు వరకు తీర్పు వెల్లడించలేదు. అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు స్థానికులు చెప్పిన సమాచారం మేరకు ఆర్డీవో కార్యాలయం అధికారులను సంప్రదించాను. కేసు పెండింగ్‌లోనే వుందని, రెండు మూడు రోజుల్లో ఆర్డీవో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. దీంతో ఆలయ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.