Share News

అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచినట్టా?.. మూసినట్టా?

ABN , Publish Date - Dec 23 , 2023 | 11:35 PM

ప్రస్తుతం అంగన్‌ కేంద్రాలు తెరిచినట్టా?, మూసినట్టా? అనేది అర్థం కాక గ్రామాల్లోని లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. వారి సమ్మెను భగ్నం చేయడంతో పాటు వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయాలనే లక్ష్యంతో సమ్మె చేపట్టిన మూడో రోజు నుంచే అంగన్‌వాడీ కేంద్రాల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నించింది.

అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచినట్టా?.. మూసినట్టా?
తెరచుకోని పాడేరులోని లోచలిపుట్టు అంగన్‌వాడీ కేంద్రం

సందిగ్ధంలో లబ్ధిదారులు

బలవంతంగా కేంద్రాల తాళాలు పగులగొట్టి స్వాధీనం చేసుకున్న అధికారులు

బాధ్యతలు సచివాలయ సిబ్బందికి అప్పగింత

తాము నిర్వహించలేమని చేతులెత్తేసిన వైనం

చేసేది లేక మూసివేసిన అధికారులు

(ఆంధ్రజ్యోతి- పాడేరు)

ప్రస్తుతం అంగన్‌ కేంద్రాలు తెరిచినట్టా?, మూసినట్టా? అనేది అర్థం కాక గ్రామాల్లోని లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు సమ్మె చేపడుతున్న సంగతి తెలిసిందే. వారి సమ్మెను భగ్నం చేయడంతో పాటు వారి ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయాలనే లక్ష్యంతో సమ్మె చేపట్టిన మూడో రోజు నుంచే అంగన్‌వాడీ కేంద్రాల స్వాధీనానికి ప్రభుత్వం ప్రయత్నించింది. అధికారులు కొన్ని చోట్ల బలవంతంగా తాళాలు పగులగొట్టి కేంద్రాలను స్వాధీనం చేసుకోగా, మరికొన్ని చోట్ల ప్రతిఘటన ఎదురైంది.

అంగన్‌వాడీ కేంద్రాలు స్వాధీనం ఎందుకో....

అంగన్‌వాడీలు సమ్మెలో వున్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా బలవంతంగా సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్‌, ఐసీడీఎస్‌ అధికారులు కలిసి అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి కొన్ని చోట్ల స్వాధీనం చేసుకున్నారు. అంతటితో ఆగకుండా సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అంగన్‌వాడీలు సమ్మెలో వున్నప్పటికీ అంగన్‌వాడీ సేవలు అందిస్తారేమోనని అందరూ భావించారు. కానీ వాస్తవానికి అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించాలనే లక్ష్యం కంటే సమ్మెలో వున్న అంగన్‌వాడీల మనోఽధైర్యాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే వాటిని స్వాధీనం చేసుకున్నారని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఎంతో హడావిడి చేసి కేంద్రాలను తమ చేతిలోకి తీసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు వాటిని ఎందుకు నిర్వహించలేకపోతున్నారని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.

చేతులెత్తేసిన సచివాలయ సిబ్బంది

అంగన్‌వాడీల సమ్మెను భగ్నం చేయడంలో భాగంగా బలవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకుని వాటి నిర్వహణను సచివాలయ సిబ్బందికి అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే పనిభారంతో ఇబ్బంది పడుతున్న తమకు అంగన్‌వాడీ కేంద్రాల అప్పగింత తగదని, తాము వాటిని నిర్వహించలేమని సచివాలయ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో చేసేది లేక ఐసీడీఎస్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న అంగన్‌వాడీ కేంద్రాలకు మళ్లీ తాళాలు వేసేశారు. దీంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఎంతో హంగామా చేసి అంగన్‌వాడీ కేంద్రాలను స్వాఽధీనం చేసుకున్నా, వాటిని తెరిచి బాలలకు పూర్వప్రాథమిక విద్యను అందించలేని పరిస్థితి కొనసాగుతున్నది. దీంతో ఎప్పటిలాగానే అంగన్‌వాడీ కేంద్రాలు మూసేసి వున్నాయి. మరి ఈపాటి దానికేనా అధికారులు తమ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను బలవంతంగా లాక్కున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అంటున్నారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, న్యాయం చేయకుండా దొడ్డిదారిలో ఆందోళనను నీరుగార్చే ప్రయత్నాలను తాము తిప్పికొడతామని అంగన్‌వాడీలు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 11:35 PM