Share News

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

ABN , Publish Date - Dec 17 , 2023 | 01:06 AM

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. సీడీపీవో, తహసీల్దారు కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల్లో నిరసనను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలతోపాటు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

అంగన్‌వాడీల సమ్మె ఉధృతం
ఎన్టీఆర్‌ మిని స్టేడియం గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న అంగన్‌వాడీలు

సీఎం హామీలను నెరవేర్చే వరకు విరమించేది లేదని విస్పష్టం

టీడీపీ, జనసేన పార్టీల నేతలు సంఘీభావం

(ఆంధ్రజ్యోతి- న్యూస్‌నెట్‌వర్క్‌)

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారం ఐదో రోజుకు చేరింది. సీడీపీవో, తహసీల్దారు కార్యాలయాల ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల్లో నిరసనను కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలతోపాటు తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు కశింకోటలో అంగన్‌వాడీల దీక్షా శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడు అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలను రూ. 4,200 నుంచి రూ.10,500కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచడం సిగ్గుచేటన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత నక్కపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్తల శిబిరాన్ని సందర్శించి సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమస్యలు పరిష్కరించకుండా, అంగన్‌వాడీ కేంద్రాలను ఇతర ఉద్యోగులతో తెరిపించడం ప్రభుత్వానికి తగదని అన్నారు. అంగన్‌వాడీలు సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. కె.కోటపాడులో అంగన్‌వాడీలు మానవహారం నిర్వహించి ఎంపీడీవో, తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. పరవాడలో అంగన్‌వాడీల నిరసన శిబిరాన్ని జనసేన పార్టీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు సందర్శించి సంఘీభావం తెలిపారు. న్యాయమైన డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం నెరవేర్చాలని, లేకుంటే మూడు నెలల్లో ఏర్పాటయ్యే టీడీపీ-జనసేన ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పారు. నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు ధర్నా చేశారు. అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నాగశేషు మాట్లాడుతూ, గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్‌రెడ్డి నాలుగున్నరేళ్ల నుంచి నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాడుగులలో టీడీపీ నాయకులు పీవీజీ కుమార్‌, పైలా ప్రసాదరావు, జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ, రొబ్బా మహేశ్‌ సంఘీబావం తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 01:06 AM