బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2023-02-17T00:54:13+05:30 IST

మండలంలోని లింగరాజుపాలెంలో మహాత్మా జ్యోతీబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగవేణిని సస్పెండ్‌ చేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి చెప్పారు. ఆమె గురువారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజేశ్వరితో కలిసి గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. తొలుత అన్ని తరగతుల బాలికలతో జేసీ విడివిడిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ నాగవేణితో కూడా మాట్లాడారు.

బీసీ బాలికల గురుకుల పాఠశాల  ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌
బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగవేణితో మాట్లాడుతున్న జేసీ కల్పనాకుమారి

లింగరాజుపాలెంలో స్కూల్‌ను తనిఖీ చేసిన జేసీ, బీసీ వెల్ఫేర్‌ డీడీ

విద్యార్థినుల సమస్యలు తెలుసుకున్న అధికారులు

పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రిన్సిపాల్‌ నాగవేణిపై ఆగ్రహం

స్కూల్‌ను సందర్శించిన మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ

స్థలం మంజూరు చేస్తే సొంత భవనాలు నిర్మిస్తామని వెల్లడి

ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 16: మండలంలోని లింగరాజుపాలెంలో మహాత్మా జ్యోతీబాఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ నాగవేణిని సస్పెండ్‌ చేస్తున్నట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి చెప్పారు. ఆమె గురువారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రాజేశ్వరితో కలిసి గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. తొలుత అన్ని తరగతుల బాలికలతో జేసీ విడివిడిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌ నాగవేణితో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా జేసీ కల్పనాకుమారి విలేఖరులతో మాట్లాడుతూ, వసతి కొరతతో ఇబ్బందులు పడుతున్నట్టు బాలికలు చెప్పారని, డ్రైనేజీ సమస్య కూడా వుందని, వీటిని పరిష్కరిస్తామన్నారు. బోధన విషయంలో ఇద్దరు టీచర్లపై ఫిర్యాదు చేశారన్నారు. పాఠశాల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు ప్రిన్సిపాల్‌ నాగవేణిని సస్పెండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం దార్లపూడిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న నూతనంగా నిర్మించిన బాలికల వసతిగృహాన్ని జేసీ పరిశీలించారు. లింగరాజుపాలెం బీసీ బాలికల గురుకుల పాఠశాలను ఈ వసతిగృహానికి తరలించే విషయాన్ని పరిశీలిస్తున్నామని, అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్‌తోపాటు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆమె వెంట ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్యామ్‌కుమార్‌, ఇతర అధికారులు వున్నారు.

పాఠశాలను సందర్శించిన మంత్రి వేణుగోపాలకృష్ణ

లింగరాజుపాలెంలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను గురువారం సాయంత్రం బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సందర్శించారు. బాలికలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదంటూ ప్రిన్సిపాల్‌ నాగవేణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తరువాత రాష్ట్ర రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సెక్రటరీ కృష్ణమోహన్‌, ఇతర అధికారులతో కలిసి పాఠశాల పక్కనున్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పాఠశాలకు సొంత భవనాలు నిర్మించాలంటే ఐదు ఎకరాల భూమి కావాలని, రెవెన్యూ శాఖ అధికారులు భూమి కేటాయించినట్టయితే భవన నిర్మాణాల కోసం రూ.36 కోట్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పటి వరకు వసతి సమస్యను నివారించడానికి కింది అంతస్థును ఎలా వినియోగించాలన్నది పరిశీలించామన్నారు. కిచెన్‌ను పక్కనే ఖాళీగా ఉన్న ఎంపీపీ పాఠశాలలోకి మార్చాలని చెప్పారు. ప్రిన్సిపాల్‌ నాగవేణిని ఇప్పటికే సస్పెండ్‌ చేశామని, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ సెక్రటరీ కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందన్నారు. జిల్లాలో వున్న అన్ని వసతిగృహాలను పరిశీలించి సమస్యలపై నివేదికను తనకు పంపాలని బీసీ వెల్ఫేర్‌ డీడీ రాజేశ్వరని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, బీసీ హాస్టల్స్‌ కన్వీనర్‌ వెంకటరెడ్డి, ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్యామ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-17T00:54:14+05:30 IST