Vizag rk Beach: మసిబొగ్గులా మారిన సుందర తీరం

ABN , First Publish Date - 2023-09-07T16:03:56+05:30 IST

కోస్టల్‌ బ్యాటరీ నుంచి నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న చిల్డ్రన్‌ పార్కు వరకు సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు పలుచోట్ల నల్లగా మారాయి. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని అంతా భావిస్తున్నారు. అయితే, అది కారణం కాదని నిపుణులు అంటున్నారు.

Vizag rk Beach: మసిబొగ్గులా మారిన సుందర తీరం

నల్లగా మారిన తీరం

లైట్‌, హెవీ మినరల్స్‌ విడిపోవడమే కారణం

కెరటాలతోపాటు సముద్రంలోకి లైట్‌ మినరల్స్‌

ఇసుకలో ఉండిపోయిన హెవీ మినరల్స్‌

ప్రధానంగా ఇలమనైట్‌, రుటైల్‌ వంటి వాటి వల్లే నలుపు ఆకారం

విశాఖపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కోస్టల్‌ బ్యాటరీ నుంచి నోవాటెల్‌ హోటల్‌ ఎదురుగా ఉన్న చిల్డ్రన్‌ పార్కు వరకు సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు పలుచోట్ల నల్లగా మారాయి. కలుషితమైన వ్యర్థ జలాలు సముద్రంలో కలవడమే అందుకు కారణమని అంతా భావిస్తున్నారు. అయితే, అది కారణం కాదని నిపుణులు అంటున్నారు. ఇసుకలో ఉండే లైట్‌, హెవీ మినరల్స్‌ విడిపోవడం వల్లే తీరం నల్లగా మారిందని చెబుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల అలల ఉధృతి పెరిగినప్పుడు తీరంలో ఉండే లైట్‌ మినరల్స్‌ నీటితోపాటు సముద్రం లోపలకు వెళతాయి. హెవీ మినరల్స్‌ తీరంలోనే ఉండిపోతాయి. బరువుగా ఉండే ఈ మినరల్స్‌లో ఎక్కువగా ఇలమనైట్‌, రుటైల్‌, జింకాన్‌, గార్నెట్‌, సిలిమినైట్‌ వంటివి ఉంటాయి. బీచ్‌ నల్లగా మారడానికి ప్రధానంగా ఇలమనైట్‌, రుటైల్‌ వంటి హెవీ మినరల్స్‌ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు నల్లగా ఉండడం వల్లే తీరమంతా ఆ రంగులోకి మారుతుందంటున్నారు. సాధారణంగా అలలు తాకిడి ఎక్కడ అధికంగా ఉంటుందో అక్కడ ఇలాంటి పరస్థితి ఉత్పన్నమవుతుందని ఏయూ జియాలజీ ప్రొఫెసర్‌ ఎ.యుగంధరరావు తెలిపారు. రెండు రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అలల తాకిడి పెరిగిందని, ఈ కారణంగానే కోస్టల్‌ బ్యాటరీ నుంచి నోవాటెల్‌ వరకు తీరంలో హెవీ మినరల్స్‌, లైట్‌ మినరల్స్‌ విడిపోయి ఇసుక తిన్నెలు నల్లగా మారాయని చెప్పారు. వేవ్‌ యాక్షన్‌ అధికంగా ఉన్నచోట ఇటువంటి మార్పును చూడవచ్చునన్నారు.

blcak.jpg

Updated Date - 2023-09-07T16:07:42+05:30 IST