Share News

స్కూళ్లను సందర్శించిన ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:50 AM

జీవీఎంసీ 58వ వార్డు పరిధి ములగాడలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల, 40వ వార్డు షిప్‌యార్డు కాలనీలో ఉన్న గాంధీగ్రామ్‌ పాఠశాలను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ శనివారం సందర్శించారు. ముందుగా ములగాడలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాఠ్యాంశాలకు సంబంధించి మాట్లాడడంతో పాటు వారి పరీక్ష పత్రాలను, టెస్ట్‌, నోట్‌ పుస్తకాలను పరిశీలించారు.

స్కూళ్లను సందర్శించిన ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
ములగాల స్కూల్‌లో విద్యార్థులతో మాట్లాడుతున్న ప్రవీణ్‌ప్రకాశ్‌

ములగాడ పాఠశాల నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రవీణ్‌ప్రకాశ్‌

మల్కాపురం, డిసెంబరు 16: జీవీఎంసీ 58వ వార్డు పరిధి ములగాడలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాల, 40వ వార్డు షిప్‌యార్డు కాలనీలో ఉన్న గాంధీగ్రామ్‌ పాఠశాలను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్‌ శనివారం సందర్శించారు. ముందుగా ములగాడలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాఠ్యాంశాలకు సంబంధించి మాట్లాడడంతో పాటు వారి పరీక్ష పత్రాలను, టెస్ట్‌, నోట్‌ పుస్తకాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న వసతుల గురించి డీఈవో ఎల్‌.చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. రెండు, మూడు, ఐదు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో ఉంచి రెండు బోర్డులు ఏర్పాటు చేసి బోధించడంపై ఆరా తీశారు. ఆయన ఆ తరగతి గదిలో ప్రవేశించే సమయంలో విద్యాశాఖలో సంబంధం లేని ఓ మహిళ బోధించడం చూసి ఏ తరగతికి బోధిస్తున్నారని ప్రశ్నించగా, ఆమె నుంచి సరైనా సమాధానం రాలేదు. దీంతో ఆయన డీఈవోను ప్రశ్నించగా.. ఆమె కూడా బదులివ్వకపోవడంతో హెచ్‌ఎం అనితను నిలదీశారు. సదరు మహిళ హెచ్‌పీసీఎల్‌ ఆర్థిక సాయంతో నంది అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన టీచర్‌ అని, జిల్లాలో మొత్తం ఇలాంటి ఉపాధ్యాయులు 230 మందిఉన్నట్టు బదులిచ్చారు. అనంతరం ప్రవీణ్‌ప్రకాశ్‌ విద్యార్థులతో ఫొటో దిగారు.

డీఈవో, హెచ్‌ఎంపై తీవ్ర ఆగ్రహం

పాఠశాల ఆవరణలో కోరమాండల్‌ ఎరువుల సౌజన్యంతో నిర్మించిన భవనంలో కాంట్రాక్టరుకు చెందిన నిర్మాణ సామగ్రి ఉండడం చూసి ప్రవీణ్‌ప్రకాశ్‌ డీఈవో, హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20 లక్షలు వెచ్చించి నిర్మించిన గదిలో కాంట్రాక్టర్‌కు సంబంధించిన సామగ్రి పెట్టుకునేందుకు ఎవరు అనుమతిచ్చా రని మండిపడ్డారు. ఒకే గదిలో మూడు తరగతుల పిల్లలకు విద్యా బోధన చేస్తున్న మీకు.. ఈ గదిలో బోధించాలని అనిపించలేదా అని నిలదీశారు. గతంలో కన్నా జిల్లా పరిధి ఇప్పుడు తగ్గింది కాబట్టి పాఠశాలలను ఎందుకు తనిఖీ చేయడం లేదని డీఈవోఓను ప్రశ్నించారు. వెంటనే గదిలోని సామగ్రిని ఖాళీ చేయించి ఏదో ఒక తరగతికి కేటాయించాలని ఆదేశించారు. అనంతరం ఆయన షిప్‌యార్డు కాలనీలోని గాంధీగ్రామ్‌ పాఠశాలను తనిఖీ చేసి అక్కడే మధ్యాహ్న భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - Dec 17 , 2023 | 12:50 AM